తిరుపతి మీద జగన్ కన్ను
posted on: Dec 22, 2014 11:04AM

తిరుపతి ఎమ్మెల్యే వెంకట రమణ ఇటీవల అనారోగ్యం కారణంగా కన్నమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి వుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకట రమణ కుటుంబ సభ్యులలో ఒకరిని ఈ స్థానం నుంచి ఏకగ్రీవంగా గెలిపించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శోభా నాగిరెడ్డి మరణం తర్వాత ఆమె కుమార్తె అఖిలప్రియను కూడా రాజకీయ పార్టీలన్నీ ఆళ్ళగడ్డ స్థానం నుంచి ఏకగ్రీవంగా గెలిపించాయి. ఆ సంప్రదాయాన్నే తిరుపతిలోనూ కొనసాగించాలని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. వెంకట రమణకు ఇద్దరు కుమార్తెలు వున్నారు. వారిద్దరూ పుట్టు బధిరులు. దాంతో వెంకట రమణ భార్య సుగుణను ఈ స్థానం నుంచి ఏకగ్రీవంగా గెలిపించాలన్న ఆలోచనలు వున్నాయి. విద్యాధికురాలు అయిన సుగుణను ఈ స్థానం నుంచి నిలిపే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ చేస్తోంది.
ఇంతవరకూ అంతా సజావుగానే వుంది. అయితే ఇక్కడే జగన్ మార్కు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. తిరుపతి స్థానాన్ని తన పార్టీ అకౌంట్లో జమ చేసుకోవడానికి జగన్ అద్భుతమైన తెలివితేటలతో ప్రయత్నిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో వున్న వెంకట రమణ ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికలలో ఆయన వైసీపీ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి మీద విజయం సాధించారు. వెంకటరమణ తీవ్ర అనారోగ్యం పాలైనప్పటి నుంచి కరుణాకర్‌రెడ్డి బాగా యాక్టివ్ అయిపోయారు. వెంకట రమణను పరామర్శించడం, ఆయన కుటుంబాన్ని ఓదార్చడం, వెంకట రమణ చనిపోయిన తర్వాత మృతదేహాన్ని అందరికంటే ముందుగా సందర్శించడం, ఆయన కుటుంబానికి అండగా నిలుస్తానని అనడం, వెంకట రమణ అంత్యక్రియల్లో పాడె మోయడం లాంటి మంచి పనులన్నీ చేశారు. ఇక జగన్ అయితే వెంకట రమణ తన తండ్రి వైఎస్సార్‌కి ఎంతో సన్నిహితుడని అసెంబ్లీలో చెప్పారు. చాలా మంచి వ్యక్తి అని పొగిడారు. వెంకట రమణను వైద్యానికి సింగపూర్‌కి తీసుకెళ్తే బాగుండని ఆవేదనగా అన్నారు.
వీటితోపాటు ఇంకా అనేక రకాలుగా వైసీపీ నాయకులు వెంకట రమణ కుటుంబానికి చేరువ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి ఉప ఎన్నికలలో వెంకట రమణ భార్య సుగుణ పోటీ చేయకుండా చేసే బ్రెయిన్ వాష్ కార్యక్రమాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. సుగుణ పోటీ చేయకుండా వుంటే, వెంకట రమణ కుటుంబం మద్దతుతో కరుణాకర్‌రెడ్డిని బరిలో దించాలన్నది ఒక వ్యూహం. అలా కాకుండా వుంటే, వెంకట రమణ భార్యను తెలుగుదేశం పార్టీ తరఫున కాకుండా వైసీపీ తరఫున బరిలోకి దించాలన్నది కూడా వైసీపీ వ్యూహమని సమాచారం. మొత్తమ్మీద తిరుపతి స్థానాన్ని తన కైవసం చేసుకోవాలన్నది జగన్ వ్యూహమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ నగరంలోనూ వైసీపీకి బలం లేదు. ఇప్పుడు తిరుపతి నగరంలో వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వైసీపీ నాయకుడు జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ పరిశీకులు వివరిస్తున్నారు.



.jpg)
.jpg)

.webp)



