బ్రాండ్ మార్చు జగనన్నా.. అన్నిటికీ ఇంకా సజ్జలేనా?
posted on Sep 5, 2025 12:42PM
.webp)
అన్నిటికీ ఇంకా సజ్జలేనా అన్నది ప్రెజంట్ వైసీపీ అభిమానుల మాట. అప్పుడంటే ఆల్ డిపార్ట్ మెంట్స్ హోల్ సేల్ మినిస్టర్ గా సజ్జల పెద్ద ఎత్తున ఒక వెలుగు వెలుగొందిన విషయం అంతటా తెలిసిందే. గత జగన్న పాలనలో ఇటు ధనుంజయ్ రెడ్డి, అటు సజ్జల.. ఈ ఇద్దరి హవా నడిచిందని అంటారు. మరీ ముఖ్యంగా సజ్జల అయితే వైయస్ జగన్ తలరాత తిరగరాసినట్టుగా భావిస్తారు. అసలు సజ్జల వల్లే జగన్ కి చాలా విషయాలు చేరక పోయేవని చెబుతారు. దీంతో జగన్ ఒకానొక పబ్జీ గాడాంధకారంలో పడి కొట్టుమిట్టాడినట్టుగా ఒక అంచనా.
అలాంటి సజ్జలను తొలగించాలంటూ పార్టీ ఓడినప్పటి నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తింది. అయినా సరే సజ్జల, ఆయన కుమారుడు భార్గవ్ ను అలాగే అంటి పెట్టుకుని కూర్చున్నారు జగన్. ఇకనైనా వీరిని మార్చాల్సిన అవసరముందని అంటున్నారు. ప్రస్తుతానికైతే భార్గవ్ నుంచి సోషల్ మీడియాను లాగేసుకుని.. ఆపై మరొకరికి దాన్ని అప్పగించినట్టు తెలుస్తోంది. కానీ సజ్జలే మళ్లీ తన పాత పాత్రను అలాగే నిలుపుకుని.. ఇంకా మీడియా ముందుకొచ్చి జగన్ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు.
ఏమాటకామాట విజయసాయి రెడ్డి కలసి వచ్చినట్టు సజ్జల జగన్ కి కలసి రాలేదని అంటారు చాలా మంది జగన్ అభిమానులు. ఈయనకు ఏదీ నడపటం సరిగా రాదు. పైపెచ్చు మీడియా నుంచి వచ్చినట్టు చెప్పుకు తిరుగుతారు కానీ, మీడియా మేనేజ్మెంట్లో కనీసం ఏబీసీడీలు తెలీవని వాపోతారు. అంతెందుకూ.. తనపై రెడ్ కార్నర్ నోటీసులు వచ్చినపుడు.. కొన్ని చానెళ్లలో తనపై జరిగిన డిబేట్లకు జడుసుకుని.. నేనేమైనా దేశ ద్రోహినా అంటూ మొహం వేలాడేశారు.
తనకు తాను రక్షించుకోలేని వాడు.. జగన్ ని మాత్రం ఏం రక్షించగలడు? ఈ విషయం ఎందుకో జగన్ కి ఇంకా అర్ధం కావడం లేదు. అప్పట్లో విజయసాయి రెడ్డి అంత రేంజ్ లో సజ్జల జగన్ రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టడం లేదని అంటారు. నిజానికి విజయసాయి రెడ్డి జగన్ ఆస్తుల, ఆర్ధిక లావాదేవీలను ఇంకా చక్కబెడుతున్నట్టుగానే చెబుతారు. ఆయన రాజకీయాల నుంచి దూరమయ్యారుగానీ జగన్ ఫైనాన్షియల్ వ్యవహారాల నిర్వహణ నుంచి బయటకు రాలేదని సమాచారం.
ఇదలా ఉంచితే, పార్టీకి సరిగ్గా అలాంటి వ్యక్తి అవసరముంది కానీ, సజ్జల లాంటి వారు కాదన్నది ఫ్యాన్ పార్టీ శ్రేణులు బాహటంగా అంటోన్న మాట. మరి సజ్జల కాకుండా ఇంకెవరున్నారు. అన్న చర్చ కూడా నడుస్తోంది. బేసిగ్గా వైసీపీ అన్యులను అంత తేలిగ్గా ఎంటర్ టైన్ చేయదు. దీంతో సజ్జలకు ఇంకా ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తోందని భావిస్తున్నారు. సజ్జల ఫేస్ చూసి చూసి జనానికి బోర్ కొట్టేసిందని.. ఆయన వాక్య నిర్మాణం కూడా ఏమంత బాగుండదని.. అంత రసవత్తరంగా కూడా ఆయన మాట్లాడలేడు కాబట్టి మాకు నీరసం వస్తోందని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు.