జగన్ రూటే సెపరేటు.. మొంథా తుపాను నష్టం పరిశీలన టూ లేటు

వైసీపీ అధినేత జ‌గ‌న్  రూటే సెపరేట్. ఆయన మాటలతో నేల విడిచి సాము చేస్తారు. ఏ విషయమైనా సరే.. తానైతేనా అని చెప్పుకుంటారు. తన మాటలను ఎవరైనా విశ్వసిస్తున్నారా? లేదా అన్న అనుమానమే ఆయనకు రాదు. ప్రత్యర్థులను విమర్శించడానికీ తనను పొగుడుకోవడానికీ మాత్రమే ఆయన నోరు తెరుస్తారు. అది ప్రెస్ మీట్ అయానా, బహిరంగ సభ అయినా, పరామర్శ యాత్ర అయినా, ఓదార్పుయాత్ర అయినా ఆయన ప్రసంగ సారాంశం ఒక్కటే.. సకల సమస్యల పరిష్కారం తన చేతిలో ఉందని చచెప్పడమే.

తాజాగా కృష్ణా జిల్లాలో మొంథా తుఫాను ప్ర‌భావంతో న‌ష్ట‌పోయిన రైతుల‌ను ఆయన మంగళవారం (నవంబర్ 4) ప‌రామ‌ర్శించారు. ఈ సందర్భంగా ఆయన స‌హ‌జంగానే  తెలుగుదేం కూటమి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ విమర్శల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు పెద్ద ఎత్తున నెట్టింట ట్రోల్ అవుతున్నాయి. తాను ఉంటే మొంథా తుపాను వచ్చేదే కాదన్నట్లుగా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. దీంతో అంతా విస్తుపోయారు.

  కృష్ణాజిల్లా రామరాజుపాలెం ప్రాంతంలోని ఆకుమర్రు లాకు వద్ద పంట పొలాలను జ‌గ‌న్ పరిశీలించారు. అయితే రైతులు కోరినా జగన్ మాత్రం పొలాల్లోకి అడుగుపెట్టలేదు.  ఇదే రకం పరిశీలనో అర్ధంగాక రైతులు తలలుబాదుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాను సీఎంగా ఉన్న సమయంలో రైతులను అన్నివిధాలుగా ఆదుకున్నానన్నారు.  మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో పాతిక  జిల్లాల్లో పంట‌న‌ష్టం జ‌రిగింద‌న్నారు. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం నుంచి రూపాయి కూడా సాయం అందలేదన్నారు. రైతులకు అండగా తాను ఉంటాన్నన్నారు. వారికి న్యాయం జరిగే వరకూ పోరాడతాన్నారు.  మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన ఇదే విషయాన్ని చెప్పారు.  రాష్ట్రంలో తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.  రైతుల‌కు స‌రైన స‌మ‌యంలో సొమ్ములు కూడా ఇవ్వ‌డం లేద‌ని అన్నారు.  నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైసీపీ వారికి అండ‌గా నిలుస్తుంద‌ని చెప్పారు.  కూట‌మి పాల‌న‌లో రైతుల‌కు క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వ‌డం లేదని విమర్శించారు.

అయితే గ్రౌండ్ రియాలిటీ మాత్రం జగన్ చెప్పిన దానికి భిన్నంగా ఉంది. ఈ విషయాన్ని రైతులే చెబుతున్నారు.సాధారణంగా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ముందుగా విపక్ష నేత క్షేత్ర స్థాయికి చేరుకుని, ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి ప్రజలతో మమేకమై అండగా ఉన్నామనీ, ఉంటామనీ హామీ ఇచ్చి ప్రజలతో మమేకమౌతారు. తద్వారా విపత్తు కారణంగా నష్టపోయిన వారికి సత్వరసాయం అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలలో  మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, శ్రేణులూ క్షేత్ర స్థాయిలో ప్రజలకు అండగా నిలిచారు. అదే సమయంలో వైసీపీ అధినేత బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమై ఉన్నారు. అక్కడ నుంచే బాధితులకు అండగా నిలవాలంటూ పార్టీ నేతలూ, శ్రేణులకూ పిలుపునిచ్చారు. కానీ యథా రాజా తథా ప్రజా అన్నట్లుగా.. అధినేతకే పట్టనప్పుడు తమకెందుకు అనుకున్నట్లుగా వైసీపీయులెవరూ గడపదాట లేదు.  

మొంథాతుపాను తీరం దాటిన తరువాత ప్రభావిత ప్రాంతాలలో  ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు  క్షేత్ర స్థాయిలో తిరిగారు. బాధితులను నేరుగా కలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితులకు భరోసా ఇచ్చి ధైర్యం నింపారు. ఇదంతా జరుగుతున్నప్పుడు వైసీపీ అధినేత జగన్ కనీసం రాష్ట్రంలో లేరు. బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.    తుపాను వచ్చి వెళ్లిపోయిన వారం రోజుల తరువాత ఆయన తీరిగ్గా తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటనకు వచ్చారు.

అయితే అప్పటికే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, పలువురు మంత్రులు తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి, జరిగిన నష్టాన్ని పరిశీలించి, కేంద్రానికి నివేదిక పంపి తగు విధంగా ఆదుకోవాలని కోరడం కూడా జరిగిపోయింది. జగన్ పర్యటన చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం మంకుపట్టు పట్టి కూర్చున్న జగన్ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిగా ఆయన తన బాధ్యతలను పూర్తిగా విస్మరించారనీ, ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు పూర్తిగా ముఖం చాటేసి ఇప్పుడు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం వల్ల ప్రయోజనం ఇసుమంతైనా ఉండదనీ అంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu