జగన్ రాజకీయ జీవితం ఓ లాటరీ!
posted on Jul 21, 2014 10:07AM
.jpg)
వైఎస్సార్సీపీ నాయకుడు జగన్ జీవితం, పొలిటికల్ జీవితం ఒక లాటరీలా మారింది. దానికి ఒక తాజా ఉదాహరణ నెల్లూరు జడ్పీటీసీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను వైసీపీ లాటరీ ద్వారా గెలుచుకోవడం. మొదటి నుంచీ జగన్ రాజకీయ ప్రస్థానం ఒక లాటరీలాగానే సాగుతూ వచ్చింది. తన తండ్రి వైఎస్సార్ ముఖ్యమంత్రి పీఠం మీద వుండగా జగన్ పొలిటికల్ లాటరీ ఆడాడు. ఆ లాటరీలో పైసా పెట్టుబడి లేకుండా జగన్‌కి లక్షల కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. వైఎస్సార్ మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ లాటరీ ఆడాడు. అయితే ఆ లాటరీలో విజయం సాధించలేకపోయాడు. బెడిసికొట్టిన ఆ లాటరీ కారణంగా జగన్ 16 నెలలు జైలులో గడపాల్సివచ్చింది. తర్వాత జగన్ కాంగ్రెస్ పార్టీతో కలసి ఆడిన పొలిటికల్ లాటరీ గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికలను కూడా ఆయన ఒక లాటరీగానే తీసుకున్నాడు. ఈ లాటరీలో ఎలాగైనా విజయం సాధించాలన్న తాపత్రయంతో కోట్లాది రూపాయలను వినియోగించాడు. అయినాసరే ఆయనకు ఆ లాటరీలో విజయం దక్కలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్ ఆడుతున్న లాటరీ గురించి అందరికీ తెలిసిందే. తాను పొలిటికల్ లాటరీలో ఎలాగూ గెలవలేకపోయాడు కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని బద్నామ్ చేసే లాటరీ ఆడటం మొదలుపెట్టాడు. అలాగే జగన్ జనజీవన స్రవంతిలో ఉండే విషయం కూడా ఒక లాటరీ మాదిరిగానే వుంది. ఆయన ఏ నిమిషంలో మళ్ళీ జైలుకు వెళ్ళాలో ఆయనకే అర్థంకాని పరిస్థితిలో వున్నారు. ఇన్ని లాటరీలు ఆయన జీవితంలో ఉండగా, తాజాగా మరో లాటరీ ఆయన జీవితంలోకి ప్రవేశించింది. నెల్లూరు జడ్పీటీసీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను జగన్ పార్టీ లాటరీ ద్వారానే సొంతం చేసుకుంది.