జగన్ బొమ్మ పీకేశారు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పాసు పుస్తకాలపై ఉన్న జగన్ బొమ్మ మాయం కానుంది. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో తన ఫొటోల పిచ్చితో ఇష్టారీతిగా ఎక్కడపడితే అక్కడ తన ఫొటోలను ముద్రించుకున్న జగన్.. ఏకంగా సర్వేరాళ్లపైనా, రైతుల ఆస్తికి సంబంధించిన అధికార పత్రమైన పట్టాదారు పాసు పుస్తకాలపైనా కూడా తన బొమ్మలు వేయించుకున్నారు. 

ఎన్నికల ప్రచార సమయంలోనే చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించి, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ బొమ్మలను లేపేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ దిశగా అన్ని చర్యలూ తీసుకుంది. రైతుల పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటోను తీసేసి రాజముద్ర ఉన్న కొత్త పాసు పుస్తకాలను ఏప్రిల్ 1 నుంచి పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది. 

జగన్ హయాంలో భూముల రీసర్వే జరిగిన 8,680 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పేరిట ఇచ్చిన పాసుపుస్తకాలను వెనక్కి తీసుకొని, వాటిస్థానంలో కొత్త పాసు పుస్తకాలను ఇవ్వనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.  అలాగే వచ్చే నెలాఖరు నాటికి సర్వేరాళ్లపై ఉన్న జగన్ బొమ్మల తొలగింపు కూడా పూర్తి అవుతుందని ఆయన తెలిపారు. 
జగన్ అధికారంలో ఉండగా ఆయనకు ఫొటోల పిచ్చి పీక్స్ లో ఉండేది. ఆయన ఫొటోల పిచ్చిపై నెటిజనులు పెద్ద ఎత్తున ట్రోల్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా అని ఓ సినిమాలో డైలాగ్ ను ప్రస్తావిస్తూ జగన్ కు పిచ్చి పరాకాష్టకు చేరిందంటూ అప్పట్లో సెటైర్లు కూడా వేసేవారు.  

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, ఆఫీసుల్లోనే కాదు భూమి రికార్డుల్లోనూ జగన్ బొమ్మ ఉండి తీరాల్సిందేనన్నట్లుగా ఆయన హయాంలో పరిస్ధితి ఉండేది. చిత్ర‌మేమంటే ఎల్‌పీఎం రికార్డుల్లోనూ జగన్ మొహమే కనిపించేది. తన బొమ్మ కనిపించకపోతే జనం తనను మరిచిపోతారేమోనని జగన్ భయపడుతున్నారా అన్నట్లుగా అన్ని చోట్లా ఆయన ఫొటోయే కనిపించేలా ఆయన అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ ఎక్కడ చూసినా తన బొమ్మ మాత్రమే కనపడాలన్నట్లుగా ఆయన పాలన సాగింది.  రాష్ట్ర ప్రభుత్వ సమష్టి బాధ్యతను సాంతం   తన ఖాతాలో వేసి తనను శాశ్వత ఆరాధ్యుడిగా చేసుకునేందుకు జగన్ తహతహలాడారు. అందు కోసం అధికారులను అష్టకష్టాలూ పెట్టారు. జనాలకు ఇష్టం ఉన్నా లేకున్నా తన మొహం చూడకుండా రోజు గడవని ఖర్మ తీసుకొచ్చి పెట్టారు.  ఇందు కోసం వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.  ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు పాసు పుస్తకాలపైనా, సర్వే రాళ్లపైనా జగన్ ఫొటోలను తీసి ఆవల పారేసి రైతులకు ఊరట కలిగిస్తోంది.