రామోజీరావుని కలిసిన జగన్మోహన్ రెడ్డి!!!

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. ఆయన స్వయంగా రామోజీ ఫిలిం సిటీ వెళ్లి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో కాసేపు కబుర్లు చెప్పివచ్చారు. రామోజీరావు మొదటి నుండి జగన్ తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆ తరువాత అఆయన కుమారుడు తనకు పోటీగా సాక్షి మీడియాని స్థాపించడం, రాజకీయాలలోకి ప్రవేశించడంతో ఆ శత్రుత్వం జగన్ తో కూడా కొనసాగుతూనే ఉంది. ఇద్దరి చేతిలో బలమయిన మీడియా ఉండటంతో ఒకరి గురించి మరొకరు తీవ్ర విమర్శలు చేసుకొంటూ వాటినే వార్తలు అనే స్థితికి వచ్చేరు. కానీ ఈరోజు హటాత్తుగా జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుని కలుసుకోవడం వారిరువురు కాసేపు కబుర్లు చెప్పుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

వారిరువురూ యాదృచ్చికంగా కలిసారని భావించలేము. ఎందుకంటే అంత విరోధం ఉన్న వ్యక్తులు కలవాలంటే అంతకు ముందు ఎవరో మధ్యవర్తిత్వం చేసిఉండాలి. వారిరువురితో సత్సంబంధాలున్న సినీ నటుడు మోహన్ బాబు మధ్యవర్తిత్వం చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మోహన్ బాబు కుటుంబ సభ్యుల పెళ్ళిళ్ళలో రామోజీరావు కోడలు శైలాజా కిరణ్, జగన్మోహన్ రెడ్డి భార్య భారతికి పరిచయం ఏర్పడినట్లు సమాచారం. వారిరువురు తమ పరిచయాన్ని అలాగే కొనసాగించడంతో తూర్పు పడమర వంటి రామోజీ రావు, జగన్మోహన్ రెడ్డి కలయిక సాధ్యం అయిందని వారి సన్నిహితులు భావిస్తున్నారు. కానీ ఇరువురూ రాజకీయంగా విభేదిస్తున్నప్పుడు ఇటువంటి కబుర్ల వలన ఏమయినా ప్రయోజనం ఉంటుందా? అంటే అనుమానమే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu