అందుకే అచ్చెం నాయుడు అలాగన్నారేమో?
posted on Sep 5, 2015 2:05PM
.jpg)
శాసనసభ సమావేశాలు సజావుగా సాగనీయాలంటే చివరి రోజయిన శుక్రవారంనాడు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై చర్చకు అనుమతించాలని జగన్మోహన్ రెడ్డి స్పీకర్ కోడెల శివప్రసాద రావుకి షరతు విధించడంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. శాసనసభ తను చెప్పినట్లు నడవాలనుకొంటే అది సాధ్యం కాదని మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేస్తున్నప్పటికీ జగన్ తన పట్టు విడవలేదు. దానితో శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు మొదలవగానే వైకాపా నేతలు యదావిధిగా సభను స్తంభింపజేసే ప్రయత్నాలు చేసారు.
శాసనసభ మొదటిసారి వాయిదా పడిన తరువాత బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు స్వయంగా జగన్ వద్దకు వెళ్లి సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. కానీ ఓటుకి నోటు కేసు గురించి సభలో చర్చకు అనుమతిస్తేనే సహకరిస్తామని జగన్ చెప్పడంతో ఆయన వెనుతిరిగారు. ఈ విషయాన్ని జగన్ కి చెందిన మీడియాలో ప్రచురించుకొన్నారు. అంటే జగన్ తను కోరినట్లు సభా కార్యక్రమాలు జరుగకపోతే సభ సజావుగా సాగనీయకుండా అడ్డుపడుతామని చెప్పడమే కాక ఆ విషయాన్ని తన మీడియాలో కూడా ప్రచురించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేవలం ఐదు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు అందులో ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం చేయకుండా, తన రాజకీయ కక్షల కోసం సమయం కేటాయించమని పట్టుబట్టడం, అందుకు స్పీకర్ ఒప్పుకోకపోతే సభ జరగనీయకుండా అడ్డుపడుతామని హెచ్చరించడం, ఆ సంగతిని మళ్ళీ తన మీడియాలో గొప్పగా ప్రచురించుకోవడం చూస్తుంటే మంత్రి అచ్చెం నాయుడు వైకాపాపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు నిజమేనేమో అనే అనుమానం కలుగడం సహజం.