జగన్, రాహుల్...ఒకరి బాటలో మరొకరు
posted on Sep 2, 2015 2:20PM
(2).png)
జగన్, రాహుల్... ఇద్దరూ యువనేతలే! ఒకరు ముఖ్యమంత్రి కావాలని పరితపించిపోతూ ఓదార్పు యాత్రలు చేస్తుంటే మరొకరు చేతిలో ఉన్న ప్రధానమంత్రి కుర్చీని కాలదన్నుకొని పశ్చాతాపపడుతూ భరోసా యాత్రలు చేస్తున్న వ్యక్తి. ఓదార్పు యాత్రల ద్వారా పవర్ చేతికి రాకపోయినా మంచి పాపులారిటీ వస్తుందనే సంగతి రుజువు చేయబడింది కనుక సార్వత్రిక ఎన్నికల ఎఫెక్టుతో పాపులారిటీ కోల్పోయిన రాహుల్ గాంధీ కాశ్మీరు బోర్డర్ నుండి అనంతపురం జిల్లా వరకు కవర్ చేసేస్తున్నారు. ఇక రాహుల్ సూచించిన తరువాతే యువనేత జగన్ ప్రత్యేక పోరాటాలు ఆరంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన కూడా డిల్లీ నుండి గుంటూరు వరకు ప్రత్యేక కవరేజ్ చేస్తున్నారు. ఈవిధంగా ఈ యువనేతలిద్దరూ ఒకరిబాటలో మరొకరు సాగిపోతుండటం చూస్తుంటే మున్ముందు ఇద్దరూ చేతులు కలిపే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లేకుంటే నిన్న మొన్నటి వరకు ప్రత్యేకంగా ప్రత్యేక హోదా గురించి ఎన్నడూ మాట్లాడని యువనేత ఇంత హటాత్తుగా బరిలో దిగిపోవడం ఏమిటి? ఇంతవరకు దాని గురించి పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ అకస్మాత్తుగా బరిలో నుండి పక్కకు త్రప్పుకొని యువనేతకు ఆ అవకాశం కల్పించడం ఏమిటి? అని రాజకీయ విశ్లేషకులు తెగ మధనపడిపోతున్నారు. బహుశః మళ్ళీ ఆ చల్లని తల్లి ఒడిలోకి చేరేందుకే వైకాపా సిద్దం అవుతోందేమో? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓ అయ్య (జగన్) చేతిలో పెట్టి రక్షించుకోనేందుకే జాతీయ యువనేత ఆరాట పడుతున్నారేమో? వారిరువురి మధ్య ప్రత్యేక అవగాహాన కుదిరి నందునే కాంగ్రెస్ పార్టీ ఈ ‘ప్రత్యేక బరి’ లో నుండి తప్పుకొని రాష్ట్ర యువనేతకు అవకాశం కల్పిస్తోందేమో? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.