జగన్ శల్యసారధ్యంలో అగమ్యంగా సాగుతున్న వైకాపా
posted on Aug 24, 2015 11:44AM
.jpg)
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంతకాలంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాలు, వ్యూహాలకు అనుగుణంగానే ముందుకు సాగుతోంది తప్ప పార్టీలో సీనియర్ల సలహాలు, సూచనలతో సమిష్టి నిర్ణయం జరుగుతున్నట్లు లేదు. ఆ కారణంగానే వైకాపాకి అనేకసార్లు భంగపాటు తప్పలేదు. ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయిందని చెప్పవచ్చును. రాహుల్ గాంధీ వచ్చి హెచ్చరిస్తే తప్ప ప్రత్యేక హోదాపై తమ పార్టీ పోరాటం చేయడంలో కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే వెనకబడి ఉందనే సంగతి గ్రహించలేకపోవడం అందుకు చక్కని ఉదాహరణ. ఆ తరువాతే ఆయన మనం (నేను) మారాల్సిన అవసరం ఉందని పార్టీ సమావేశంలో అంగీకరించారు.
తెలంగాణాలో పార్టీని నడిపించడం విషయంలోను ఆయన ఇంకా చాలా అయోమయంలో ఉన్నట్లే కనబడుతోంది. అప్పుడప్పుడు ఆయన సోదరి షర్మిల పరామర్శయాత్రాలే అందుకు నిదర్శనం. తెలంగాణాలో వైకాపాను బలోపేతం చేసుకోనేందుకు ఆపార్టీ ప్రజల తరపున నిలబడి ఎటువంటి పోరాటాలు చేయడం లేదు. అసలు తెలంగాణాలో వైకాపా ఉందా లేదా అనే అనుమానం కలుగుతోంది. అటువంటప్పుడు మూడ్నేల్లకో ఆర్నేల్లకో ఓసారి షర్మిల చేసే పరామార్శ యాత్రల వలన పార్టీ ఏవిధంగా బలపడుతుందో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి.
తను చేసే పరామర్శ యాత్రలకు ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవనే ఆమె వాదనను నమ్మినా సుమారు ఆరేళ్ళ తరువాత తాపీగా వచ్చి ఎప్పుడో చనిపోయిన వాళ్ళని గుర్తుచేసి మరీ ఓదార్చడం ఏమిటో ఎవరికీ అర్ధం కాదు. తన యాత్రలకి రాజకీయాలు ఆపాదిన్చావద్దని ఆమె చెపుతుంటారు. కానీ అదే సమయంలో ఆమె యాత్రకి వైకాపా నేతలు, కార్యకర్తలు జిల్లా నలుమూలల నుండి భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆపార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు పి. వెంకటేశ్వరులు పిలుపునివ్వడం గమనిస్తే అది రాజకీయ ఉద్దేశ్యంతో చేస్తున్న యాత్రేనని అర్ధం అవుతోంది.
జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైకాపా ఈవిధంగా అగమ్యంగా ముందుకు సాగిపోతోంది. పార్టీలో ఆయనకంటే చాలా అపార రాజకీయ అనుభవం ఉన్న సీనియర్లు చాలా మందే ఉన్నారు. సమిష్టి నిర్ణయాలు తీసుకోనేందుకు జగన్ సిద్దపడి వారికి మాట్లాడేందుకు తగినంత స్వేచ్చ ఇచ్చినట్లయితే వారు ఆయనకి చాలా మంచి సలహాలు, వ్యూహాలు ఇవ్వగలరు. కానీ తనకు తోచినట్లే పార్టీని నడిపించాలనుకొంటే ఎన్ని ఓదార్పు యాత్రలు చేసినా, ఎన్ని దీక్షలు చేసినా పార్టీ పరిస్థితిలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చును.