వారంలో ఒకరోజు జగన్ కేసుల విచారణకే కేటాయింపు
posted on Aug 22, 2015 7:38AM
.jpg)
అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి తదితరులపై సీబీఐ విచారణ నత్తనడకన సాగుతోందని, వాటిని వేగవంతం చేయామని కోరుతూ విజయవాడకు చెందిన వేదవ్యాస్ అనే న్యాయవాది వేసిన ప్రజాహిత పిటిషన్ పై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోస్లే, జస్టిస్ యస్.వి భట్ లతో కూడిన ద్విసభ్య బెంచి సానుకూలంగా స్పందిస్తూ సీబీఐ కోర్టుకి ఆగస్ట్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం జగన్ అక్రమాస్తులకు సంబంధించిన అన్ని కేసులను విచారించేందుకు వారంలో ఒకరోజు కేటాయించింది. సీబీఐ కోర్టు ప్రతీ శుక్రవారం జగన్ అక్రమాస్తుల కేసులను మాత్రమే విచారిస్తుంది.
ఈ కేసులలో నిందితులుగా ఉన్న అనేకమంది తమకు జగన్ అక్రమాస్తుల కేసులతో ఎటువంటి సంబందమూ లేదని కనుక తమకు ఈ కేసుల నుండి విముక్తి కల్పించాలని కోరుతూకోర్తులో డిశ్చార్జ్ పిటిషన్లను వేశారు. వాటిని కూడా శుక్రవారం నాడే సీబీఐ కోర్టు విచారిస్తుంది. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ చాలా లోతుగా దర్యాప్తు చేసి జగన్ తదితరులపై పక్కా ఆధారాలు, సాక్ష్యాలతో 11 చార్జ్ షీట్లు నమోదు చేసారు. కానీ సార్వత్రిక ఎన్నికలకు ముందు అకస్మాత్తుగా ఆయన మహారాష్ట్రకి బదిలీ అయిపోవడం, కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డిత్ సహా ఈ కేసుల్లో అరెస్టయిన వారందరూ బెయిలు పొంది జైలు నుండి బయటకి రావడం జరిగింది. అప్పటి నుండి సీబీఐ విచారణ నత్తనడకలు నడవడం మొదలయింది. వాటి పురోగతి ఎంతవరకు వచ్చిందో ఎవరికీ తెలియదు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పుడు వారంలో ఒకరోజు జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకే సీబీఐ కోర్టు పనిచేయడం మొదలుపెడితే పురోగతి కనిపించవచ్చును.