ప్రజాస్వామ్యమా...వైకాపాలో ఉందా అది?
posted on: Mar 19, 2015 11:24AM
(3).jpg)
ఆంద్రప్రదేశ్ శాసనసభ ఈరోజు సమావేశం కాగానే మళ్ళీ షరా మామూలుగానే అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం మొదలయింది. నిన్న పట్టిసీమ మీద యుద్ధం చేసుకొంటే, ఈరోజు పంట రుణాలపై మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డికి తగినంత సమయం ఇవ్వకుండా స్పీకర్ మైక్ కట్ చేసి అధికార పార్టీ సభ్యులకి మాట్లాడేందుకు మాత్రమే అవకాశం ఇచ్చారంటూ యుద్ధం మొదలుపెట్టారు. వైకాపా సభ్యులు స్పీకర్ పోడియం దగ్గరకి వెళ్లి నినాదాలు చేయడం మొదలుపెట్టడంతో ఆయన సభను 10 నిమిషాలు వాయిదా వేసారు. అయితే అంతమాత్రాన్న వివాదం సద్దుమణుగుతుందని ఆశిస్తే అది అత్యాశే అవుతుంది.
సభలో తనకి మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదనే అంశం మీదనే గంటలుగంటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండటం ఒక విచిత్రమేయితే, సభలో తన పార్టీ సభ్యులెవరికీ కూడా మాట్లాడే అవకాశం ఈయకుండా జగన్మోహన్ రెడ్డి ఒక్కరే సుదీర్ఘ ప్రసంగాలు చేయడం మరో విచిత్రం. సభలో సభ్యులు ఏదయినా ఒక అంశం గురించి మాట్లాడదలిస్తే, స్పీకర్ అందుకు నిర్దిష్ట సమయం కేటాయిస్తారు. ఆ సమయంలోనే సభ్యుడు తను చెప్పదలచుకొన్నది క్లుప్తంగా చెప్పవలసి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తను ఎంతసేపు మాట్లాడదలుచుకొంటే అంతసేపు తనను ఎవరూ అడ్డుకోరాదని, అడ్డుకొంటే అది ప్రతిపక్షాల గొంతు నొక్కేయడమేనని వితండవాదన చేస్తుంటారు.
తను మాట్లాడుతుంటే అధికార పార్టీకి చెందిన పదిమంది తనకు అడ్డుతగులుతున్నారని వాదిస్తున్న జగన్మోహన్ రెడ్డి, సభలో తన పార్టీ తరపున మరెవరూ మాట్లాడేందుకు ఎందుకు అనుమతించడం లేదు? అది వారి హక్కులను కాలరాయడం కాదా? అప్రజాస్వామికం కాదా? వైకాపా సభ్యులు అందరూ ఆయన ఆదేశానుసారం శాసనసభలో అల్లరి చేయడానికే పరిమితయ్యారా? ఈవిధంగా తన పార్టీలో సభ్యులు తమ తమ నియోజకవర్గాల సమస్యలను శాసనసభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించకుండా వారి సమయాన్ని కూడా యధేచ్చగా వాడేసుకొంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం మంటగలిసిపోతోందని గావుకేకలు పెడుతుంటే ఆశ్చర్యం కలుగుతోంది.



.jpg)
.jpg)


.webp)


