ముఖ్యమంత్రినవుతా, సమస్యలన్నీ పరిష్కరిస్తా...జగన్

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు అందరూ కూడా అతని దగ్గర చాలా నేర్చుకోవలసింది చాలా ఉంది. రాష్ట్రంలో ఏ మూల సమస్య వచ్చినా, ఎవరు కష్టాలలో ఉన్నా ఆయన అక్కడ టక్కున వాలిపోయి వారిని ఓదార్చుతుంటారు. వారి కోసం ప్రభుత్వంతో అలుపెరుగని పోరాటాలు చేస్తానని భరోసా ఇస్తారు. ఇవ్వడమే కాదు వారి కోసం ధర్నాలు దీక్షలు అంటూ పాపం కడుపు మాడ్చుకొంటారు కూడా. ఇంకా అవసరమయితే స్వంత ఖర్చులతో డిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడి వచ్చేందుకు కూడా ఆయన వెనుకాడరు. ఇంతచేసినా ఆయనని చూసి అధికార పార్టీ నేతలు ఏమీ నేర్చుకోకపోగా ఏవో కేసులు, కోర్టులు, లక్ష కోట్లు, ఈడీ జప్తులు, జైలు అంటూ అసందర్భంగా అర్ధంపర్ధం లేని మాటలు మాట్లాడుతూ సున్నితమయిన ఆయన మనసు నొప్పిస్తుంటారు. అయితే ఆయన వారి తాటాకు చప్పుళ్ళకు బెదిరిపోయే రకం కాదు కనుకనే అంత నిబ్బరంగా ఉండగలుగుతున్నారు.

 

ప్రజల సమస్యలను ఈ ప్రభుత్వం తీర్చలేకపోతోంది. కనుక నాలుగున్నరేళ్ళ తరువాత తమ పార్టీ అధికారంలోకి వచ్చి తను ముఖ్యమంత్రి అవగానే అన్ని సమస్యలను మంత్రదండంతో మాయం చేసేస్తానని ప్రజలకు నచ్చజెప్పుతూ వారు నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడకుండా కాపాడుకొస్తున్నారు. లేకుంటే ఆయన జీవితమంతా ఓదార్పు యాత్రలకే సరిపోతుంది.

 

తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సోమవారం నుండి సమ్మెకు దిగిన కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. కానీ ప్రభుత్వానికి జగన్ మోహన్ రెడ్డికి వారిపై ఉన్నంత ప్రేమ, అభిమానం, వారి సమస్యల పట్ల అవగాహన లేదో ఏమో గానీ వారి సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘జగమంత కుటుంబం నాది’ అని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి వారి దగ్గర వాలిపోయారు. వారిని కూడా ఓదార్చారు. ప్రభుత్వం వారినందరినీ మోసం చేస్తున్నందుకు పాపం ఆయన కూడా చాలా బాధ పడ్డారు. పంట రుణాల మాఫీ, రాజధాని భూములు, హూద్ హూద్ తుఫాను సహాయం, పెన్షన్లు, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు, కోర్టు కేసులు, ఈడీ జప్తులు వంటి సవాలక్ష సమస్యలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ వారి తరపున కూడా తను పోరాడుతానని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశం లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. ఒకవేళ అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోయినట్లయితే, ఇక ఎవరూ చేయగలిగేదేమీ ఉండదు కనుక ఓ నాలుగున్నరేళ్లు ఓపికబడితే తను ముఖ్యమంత్రి అవగానే వారి సమస్యలను తనే స్వయంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

 

ఇంతకంటే ఎవరయినా ఏమి చేయగలరు? ప్రజలు కష్టాల్లో ఉన్నారు కదాని వారి కోసం లక్ష కోట్లు కరిగించేసుకోలేము కనుక వారిని ఓ నాలుగున్నరేళ్లు ఉగ్గబట్టుకొని ఉంటే తనే వారి కష్టాలన్నీ తీర్చుతానని హామీ ఇస్తున్నారు అంతే. కష్టాల్లో ఉన్నవారిని ఆయన ఓదార్చి భరోసా ఇస్తుంటే అధికార పార్టీ నేతలు ఆయనను మెచ్చుకోకపోయినా పరువాలేదు కానీ ‘ఆయన ముఖ్యమంత్రి అవలేకపోయినా తప్పకుండా మళ్ళీ జైలుకి పోతాడు’ అని ఎకసెక్కెం చేయడం మాత్రం మానరు.అయనవంటి మంచివాళ్లకు ఈలోకంలోచోటే లేదు. ఈ పాడులోకం కంటే ఆ చంచల్ గూడా జైలే వెయ్యి రెట్లు నయమనిపిస్తోంది.