అప్పుడు సమైక్యం, ఇప్పుడు సింగపూర్
posted on Apr 22, 2014 9:06AM
.jpg)
గతేడాది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించినప్పటి నుండి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, కేవలం తాను మాత్రమే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలనని చెపుతూ వచ్చారు. అయితే అందుకు ప్రతిగా ప్రజలు తనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి,30 యంపీ సీట్లు ఇవ్వాలని కోరుతూ వచ్చారు. అయితే పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన తరువాత ఆయన ఇక ఆ సమైక్య ప్రస్తావనే అసలు ఎత్తడంలేదు. ఇప్పుడు ఆయన కూడా రాష్ట్రాన్ని సింగపూరులా మార్చేస్తానని, మళ్ళీ రాజన్నరాజ్యం ఏర్పాటు చేస్తానని మాత్రమే చెపుతున్నారు. రాష్ట్ర విభజన అనివార్యమయింది గనుకనే ఆయన ఆ ప్రసక్తి ఎత్తడంలేదని ఆయన మద్దతుదారులు సర్దిచెప్పుకోవచ్చు గాక, కానీ జగన్ మోహన్ రెడ్డి ఆనాడు చేసిన సమైక్య పోరాటమంతా కేవలం ప్రజలను మభ్యపెట్టి, సీమాంద్రాపై పూర్తి పట్టు సాధించేందుకే తప్ప, నిజానికి ఆయనకు కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేఖించే ఉద్దేశ్యం అసలు లేనేలేదని ఋజువు అవుతోంది.
ఒకప్పుడు తెలంగాణాలో పట్టు సాధించేందుకు ‘తెలంగాణా సెంటిమెంటు పట్ల గౌరవం’ ప్రదర్శించారు జగన్. ఆ తరువాత సీమాంధ్రపై పట్టుకోసం ఉత్తుత్తి సమైక్య పోరాటాలు చేసారు. ఇప్పుడు అధికారం సంపాదించేందుకు సింగపూర్ స్కెచ్ గీసి చూపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణాలో పోటీ చేసేందుకు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు రెండూ తనకు రెండు కళ్ళ వంటివని, తన చెల్లెలు షర్మిల ద్వారా చెప్పిస్తున్నారు. ఈవిధంగా మాట నిలకడ, విశ్వసనీయత, ఎటువంటి పరిపాలనానుభవమూ లేని ఆయన అధికారం చేపడితే ఇంకెన్ని స్టోరీలు వినిపిస్తారో మరి!