జగన్ కు రాష్ట్రాన్ని పాలించే శక్తి లేదా?

posted on: Mar 25, 2014 7:16AM

 

వైఎస్ జగన్ ను చిన్నతనం నుంచి చూసినవారిలో సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. అతనికి రాష్ట్రాన్ని పాలించే శక్తి లేదని జేసీ తేల్చిచెప్పేశారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, తాను ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన పాలనను పొగిడానని గుర్తుచేశారు. అదీ చంద్రబాబుకు.. జగన్ కు ఉన్న తేడా. తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన అపార అనుభం చంద్రబాబు సొంతం. రాష్ట్రంలో ఐటీ రంగానికి పునాదులు వేయడానికి ఫైళ్లు చేతపట్టుకుని ఎన్ని దేశాల్లో ఎన్ని కంపెనీల చుట్టూ తిరిగారో ఆయనకే తెలుసు. అందుకే కొత్త రాజధాని నిర్మాణం అంటే ఎలా చేయాలన్న విషయమై తన విజన్ ను ఆయన తన మేనిఫెస్టోలో చూపిస్తున్నారు. సీమాంధ్రను సింగపూర్ లా చేస్తానంటే.. అక్కడ వ్యవసాయం లేదని, అంటే సీమాంధ్ర మొత్తమ్మీద వ్యవసాయమే లేకుండా చేస్తారా అని జగన్ అండ్ కో విమర్శలు చేయడం మనకు తెలిసిందే. సీమాంధ్ర ప్రాంతంలో నానాటికీ వ్యతిరేకత తగ్గించుకుంటూ బలం పుంజుకుంటున్న తెలుగుదేశం పార్టీని చూసి భయాందోళనలతో ఇలాంటి విమర్శలు చేస్తున్నారే తప్ప చంద్రబాబు విజన్ వాళ్లకు తెలియక కాదన్నది టీడీపీ నాయకుల అభిప్రాయం.

 

క్రైసిస్ మేనేజ్ మెంట్ విషయంలో చంద్రబాబు చొరవను కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా కూడా శభాష్ అనకుండా ఉండలేని సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. కోనసీమ ప్రాంతంలో 1996 నవంబరులో పెను తుఫాను వచ్చినప్పుడు అధికార యంత్రాంగం మొత్తాన్ని అక్కడకు తరలించి, మినీ సెక్రటేరియట్ నే ఏర్పాటుచేసి అతి తక్కువ కాలంలో ఆ ప్రాంతం తుఫాను విలయం నుంచి కోలుకునేలా చేసింది చంద్రబాబేనని ఇప్పటికీ కోనసీమవాసులు చెప్పుకొంటారు. జీఎంసీ బాలయోగి లాంటి నాయకులు ఆ సమయంలో లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించి, ఈ ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో కూడా రోడ్లు వేయించారని, దానివల్లే ఇప్పటికీ రవాణా సదుపాయాలు బాగున్నాయని, ఇదంతా చంద్రబాబు నాయకత్వ ప్రతిభేనని కోనసీమ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పటికీ అంటున్నారు.

 

తండ్రి మరణించిన కొద్ది రోజులకే అధికార పీఠాన్ని అందుకోడానికి హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప, కొత్త రాష్ట్ర పునర్నిర్మాణం గురించి నిర్మాణాత్మకంగా ఒక్క ముక్క కూడా చెప్పని జగన్, ఆయన చుట్టూ ఉన్న భజన బృందం సీమాంధ్రలో పాగా వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు సాగబోవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో చేరే సందర్భంలో జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...