అయోమయంలో జగన్

posted on: Mar 24, 2015 6:23PM

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరిని చూస్తుంటే అదేదో సినిమాలోని ‘‘రాను రానంటూనే చిన్నదీ.. రాములోరి గుడికొచ్చే చిన్నదీ’’ అనే పాటను పాడుకోవాలని అనిపిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి, అంతకు రెండు రోజుల ముందు నుంచీ జగన్ వ్యవహరిస్తున్న తీరు చూసి రాజకీయ వర్గాలు మాత్రమే కాదు.. జనం కూడా ముక్కున వేలేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు స్పీకర్ ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ, తాను అసెంబ్లీలో అగ్లీగా బిహేవ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ తర్వాత తాను హెచ్చరించినట్టుగానే అగ్లీగా ప్రవర్తించారు. తమ నాయకుడే అగ్లీగా ప్రవర్తించినప్పుడు తాము అగ్లీగా ప్రవర్తిస్తే తప్పేం వుండదని అనుకున్నారేమోగానీ, రోజా తదితరులు మరీ అగ్లీగా ప్రవర్తించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత మహిళా ఎమ్మెల్యేని రోజా కించపరుస్తూ మాట్లాడిన తీరు చూసి జనాలు నోళ్ళు తెరిచారు. సినిమా తెరమీద లలితంగా కనిపించిన రోజా నోటి వెంట ఇలాంటి మాటలు వస్తున్నాయేంటని జనం అదిరిపోయారు. ఇదిలా వుంటే, బడ్జెట్ మీద చర్చ సందర్భంగా జగన్ గొడవ చేస్తూనే వున్నారు. కొందరు సభ్యులు సస్పెండ్ అయ్యాక జగన్ కూడా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తీర్మానం మీద చర్చ జరిగినప్పుడే అసెంబ్లీకి వస్తానని, అప్పటి వరకూ అసెంబ్లీలో అడుగు పెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత మీడియాని పిలిచి రెండున్నర గంటలు మాట్లాడి బుర్రలు వేడెక్కేలా చేశారు.

 

జగన్ చేసిన భీషణ ప్రతిజ్ఞ ప్రజలకు ఆనందం కలిగించింది. జగన్ అసెంబ్లీకి వెళ్ళకుండా వుంటే అసెంబ్లీ కార్యక్రమాలు సజావుగా జరుగుతాయని, ప్రజా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తాయని, వాటికి పరిష్కారాలు దొరుకుతాయని అందరూ ఆశించారు. అసెంబ్లీలో ‘అగ్లీ’గా ప్రవర్తించేవారు లేకపోవడం అందరికీ సంతోషాన్ని కలిగించే విషయమే కదా.. అయితే ప్రజల ఆశల మీద నీళ్ళు చల్లుతూ మంగళవారం నాడు జగన్ అండ్ కో అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడానికే వచ్చామంటూ వివరణ ఇచ్చుకున్నారు. జగన్ మాట మీద నిలబడే రకం కాదు కాబట్టి అసెంబ్లీకి రానని చెప్పిన ఆయన మళ్ళీ వచ్చినా ఎవరూ పెద్దగా షాకవ్వలేదు. అయితే కాసేపటికే మళ్ళీ ఆయన బృందం మొత్తం వాకౌట్ చేసి బయటకి వెళ్ళిపోయింది. దాంతో షాక్ అవడం జనం వంతయింది. ఆయన ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాక జగన్ ‌సృష్టించిన అయోమయంలో జనం గజిబిజి అయిపోయారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడి స్థానంలో వున్న జగన్ గారు తాను అయోమయానికి గురవుతూ, జనాన్ని కూడా అయోమయంలోకి నెడుతున్నారని, ఇప్పటికైనా ఇలాంటి అయోమయం సృష్టించే పనులు మానుకోవాలని పలువురు అంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...