ఆడిన మాట తప్పని జగన్
posted on: Mar 11, 2015 6:34PM

ఇంతకాలం జగన్ అనుచరగణం ఆయన్ని మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు అని పొగుడుతూ వుంటే రాజకీయ వర్గాలు మంచి జోక్ విన్నట్టుగా హాయిగా నవ్వుకునేవి. జగన్ అనే పేరు వినగానే లక్షల కోట్ల కుంభకోణాలు, పదహారు నెలల జైలు జీవితం తప్ప మరో విషయం ఎవరికీ గుర్తుకురాని పరిస్థితుల్లో, జగన్ అనుచరగణం ఆయన మాటతప్పని, మడమ తిప్పని మనిషి అని పొగుడుతూ ఆత్మానందం చెందుతూ వుండటం నిజంగానే నవ్వు తెప్పించే విషయమే. అయితే ఏపీ రాజకీయాలలో తాజాగా జరిగిన పరిణామాలు జగన్ మడమ తిప్పని మనిషి అనే విషయం అలా వుంచితే జగన్ మాట తప్పని మనిషి అనే విషయం మాత్రం చాలా కరెక్ట్ అని తేలిపోయింది. రాజకీయ వర్గాలు ఈ విషయంలో ఇంతకాలం ఆయన్ని అపార్థం చేసుకున్న విషయం కూడా స్పష్టమైంది. ఇంతకీ, జగన్ మాట తప్పని మనిషి అని ఎలా రుజువైంది?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లో సీఎం చంద్రబాబుతోపాటు జగన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, తాను కోరుకున్నట్టు అసెంబ్లీలో జరగకపోతే తాను ‘అగ్లీ’గా ప్రవర్తిస్తానని స్పీకర్ని హెచ్చరించారు. ఆ మీటింగ్‌లో జగన్ వ్యవహార శైలి, ‘అగ్లీ’గా ప్రవర్తిస్తానని హెచ్చరించడం గౌరవనీయ స్పీకర్‌కి ఎంతమాత్రం నచ్చలేదు. వెంటనే ఆయన జగన్‌కి క్లాస్ ఇచ్చారు. బాధ్యతాయుతమైన స్థానంలో వున్న మీరు ఇలా మాట్లాడ్డం సరికాదని మందలించారు. మామూలుగా ఎవరైనా తాను మాట్లాడిన విధానాన్ని పునః పరిశీలించుకుని పశ్చాత్తాపం చెందుతారు. కానీ, అక్కడ ఉన్నదెవరూ.... జగన్ గారు. అందుకే పశ్చాత్తాపం లాంటి పనులేమీ జరగలేదు. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. స్పీకర్‌తో జరిగిన మీటింగ్‌లో తాను అసెంబ్లీలో ఎలా ప్రవర్తిస్తానని చెప్పారో జగన్ కచ్చితంగా అలాగే ప్రవర్తిస్తూ తాను మాట మీద నిలబడే వ్యక్తినని నిరూపించుకున్నారు. ఇలా ఆడిన మాట తప్పని జగన్ లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా వుండటం ఆ రాష్ట్ర ప్రజలు ఏనాడో చేసుకున్న పుణ్యం.




.jpg)


.webp)


