వైసీపీ వర్గాల గుండె గుభేల్

 

కుటుంబ సమేతంగా లండన్‌కి వెళ్ళినా జగన్‌కి దుర్వార్తలు  వినక తప్పని పరిస్థితి. అటు నంద్యాల, ఇటు కాకినాడ జగన్ సారుకి జాయింట్ దుర్వార్తలయ్యాయి. ప్రస్తుతం జగన్ ఫ్యామిలీ లండన్లో వుంది. సారు లండన్ వెళ్ళింది కూతురి చదువు కోసం అని చెబుతున్నప్పటికీ, కూతురి చదువు సాకు చెప్పి వైద్య పరీక్షల నిమిత్తం లండన్ వెళ్ళాడన్న గుసగుసలు ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తు్న్నాయి. సరే, ఆయన ఏ కారణంతో లండన్ వెళ్ళినప్పటికీ, అక్కడ కూడా ఆయనకి మనశ్శాంతి లేకుండా పోయింది. అలా చేసిన వ్యక్తి మరెవరో కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

 

నంద్యాల ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు అక్కడి రాజకీయ పరిస్థితి మీద సర్వే నిర్వహించిన కేసీఆర్, నంద్యాలలో వైసీపీ గెలవటం ఖాయమని, భవిష్యత్తులో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం తథ్యమని చెప్పారు. అయితే ఎన్నికల ఫలితాలు సదరు సర్వేని తుస్సు్మనిపించాయి. ఇదిలా వుంటే కేసీఆర్ ఇటీవల కూడా మరో సర్వే నిర్వహించారన్న వార్తలు వచ్చాయి. సదరు సర్వేలో ఏపీలో వచ్చే ఎన్నికలలో టీడీపీ భారీ మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమనే రిజల్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కూడా అధికార టీఆర్ఎస్ ఎదురీదక తప్పదనే విషయాన్ని కూడా సదరు సర్వే వెల్లడించినట్టు సమాచారం.

 

తెలంగాణ విషయం అలా వుంచితే, ఏపీ విషయంలో సదరు సర్వే వెల్లడించిన విషయాలే జగన్ వర్గానికి గుండె గుభేల్మనిపించినట్టు సమాచారం. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే మంచి మెజారిటీ వస్తుందట. పవన్ కళ్యాణ్‌తో కలసి పోటీ చేస్తే మరో 30 సీట్ల వరకూ పెరుగుతాయట. ఇక బీజేపీతో పొత్తు కూడా లాభిస్తుందట. ఆ సర్వే ద్వారా టీడీపీ విషయంలో ఇన్ని సానుకూల ఫలితాలు రావడం పట్ల వైసీపీ వర్గాల్లో వణుకు మొదలైందని తెలుస్తోంది. లండన్ వెళ్ళినప్పటికీ మనశ్శాంతి దొరకని జగన్ అక్కడి నుంచి ఇక్కడి వారికి ఫోన్ చేసిన ప్రతిసారీ సర్వేకి సంబంధించిన విషయాలనే మాట్లాడుతున్నట్టు సమాచారం.