వైసీపీలో వ్యూహకర్తలు లేరా? అందుకే ఇలా జరిగిందా?

ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ తలపెట్టిన నిరాహార దీక్షకు అనుమతి నిరాకరిస్తూ గుంటూరు జిల్లా పోలీసులు షాకివ్వడంతో వైసీపీ ముఖ్యనేతలు గందరగోళంలో పడ్డారు, ఇప్పటికే పలు తేదీలు మార్చుతూ చివరికి సెప్టెంబర్ 26ని ఎంచుకుని అన్నీ ఏర్పాట్లు చేసుకుంటే తీరా ఇఫ్పుడు దీక్షాస్థలాన్ని మార్చాలని పోలీసులు సూచించడంతో ఏం చేయాలో తెలియక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. జగన్ దీక్షకు ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోందని పైకి ఆరోపిస్తున్నా, సరైన ప్లానింగ్, వ్యూహం లేకుండా ముందుకెళ్లడం వల్లే ఇబ్బందులు పడుతున్నారట. ఎంతసేపూ ఏ జిల్లా నుంచి ఎంతమందిని తరలించాలి, ఎలా తరలించాలన్నదానిపై ధ్యాసే తప్ప, దీక్షకు ఎంచుకున్న గ్రౌండ్ కి పోలీసుల అనుమతి తీసుకోవాలన్న మినిమం కామన్ సెన్స్ లేదా అంటూ కొందరు వైసీపీ నేతలే దెప్పిపొడుస్తున్నారు.

దీక్షాస్థలంలో హడావిడిగా భూమిపూజ చేసేశారు, వందమంది వరకూ ముఖ్యనేతలు పట్టేలా సభావేదికను, వెయ్యిమంది కూర్చొనేలా వేదిక ముందు సభా ప్రాంగణాన్ని రెడీ చేశారు, తరలివచ్చే కార్యకర్తలు, ప్రజలు, విద్యార్ధుల కోసం భారీ టెంట్లు వేసేశారు గానీ ఆ ప్రాంతంలో దీక్ష చేయడం జనజీవనానికి అంతరాయం కలిగించేలా ఉందనే విషయాన్ని మాత్రం గాలికొదిలేశారు, పైగా పోలీసుల అనుమతి తీసుకోకుండానే ఏర్పాట్లు చేసేశారు, మా ఇష్టం ఎవరు అడ్డుకుంటారో చూస్తాం అన్నట్లుగా కొబ్బరికాయ కొట్టిమరీ ముగ్గులు పోసేశారు, తీరా సీన్ కట్ చేస్తే జగన్ కు పోలీసులు ఝలక్ ఇచ్చారు. ఆ గ్రౌండ్ చుట్టూ స్కూళ్లు, హాస్టళ్లు ఉండటంతోపాటు సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది కలుగుతుందంటూ అనుమతి నిరాకరించారు. తాజాగా వైసీపీ నేతలు గుంటూరు అర్బన్ ఎస్పీని కలిసినా మరోచోటకు దీక్షాస్థలిని మార్చుకోవాలని తేల్చిచెప్పారు.

అయితే ఇదంతా ప్రభుత్వ కుట్ర అంటున్న వైసీపీ నేతలు అనుమతి ఇవ్వకుంటే కలెక్టరేట్ ముందే జగన్ దీక్షకు దిగుతారని హెచ్చరిస్తున్నారు. పైగా ఏదైనా జరగకూడదని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే తాజా పరిణామాలతో జగన్ కొంత కలత చెందారని, సరైన వ్యూహం లేకుండా ముఖ్యనేతలు ముందుకెళ్లడంతోనే ఇబ్బందులు పడుతున్నామని వ్యాఖ్యానించారట, మరి పోలీసులు సూచించినట్లు మరోచోటికి దీక్షాస్థలాన్ని మార్చుకుంటారో లేక పట్టుదలకు పోతారో చూడాలి

Online Jyotish
Tone Academy
KidsOne Telugu