రంగంలోకి జే గ్యాంగ్?
posted on Mar 10, 2014 10:20PM
.jpg)
జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీట్ లో పేర్లు ఉన్న వారిలో చాలా మంది లోటస్ పాండ్ గూటికి చెరుతున్నారు. ఆ కేసులతో తమకు సంభంధం లేదని కోర్టుకు విన్నవించుకున్న వారందరూ ఒక్కక్కరిగా జే గ్యాంగ్ లో చేరుతున్నారు. జైలులో ఉన్నప్పుడే మాజీ మంత్రి మోపిదేవి చేరికకు రంగం సిధ్ధమైంది. జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత జగన్ పార్టీలో చేరిన వారిలో ఎక్కువ మంది సీబీఐ ఆరోపణలు ఎదుర్కొన్నవారే ఉన్నారు. జగన్ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్ లిస్టు సేకరించారనే అభియోగాలు ఎదుర్కొన్న కేవీపీ వియ్యంకుడు రఘురామక్రిష్ణ రాజు వైసీపీలో చేరినట్టే చేరి గోడకు కొట్టిన బంతిలా వచ్చి బీజేపీలో పడ్డారు ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపేది తానే అన్నంత బిల్డప్ ఇచ్చే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా తన అన్న కృష్ణదాస్ ధర్మాన జే గ్యాంగ్ లో చేరిపొయారు. యెమార్ కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన కోనేరు ప్రసాద్ కూడా యువనేత సమైక్యాంద్ర నినాదం నచ్చి వైసీపీ కండువా వేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నయ్య అధికారంలోకి వస్తే కేసుల నుంచి బయటపడొచ్చు అనే ఆలోచనతోనే వీరంతా వైసీపీలో చేరుతున్నారని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. సీబీఐ ఛార్జ్ షీట్లో పేర్లున్న వారంతా ఒకే గూటికి చేరడం వెనుక ఏదో మతలబు ఉందని గొణుక్కుంటూ ఉన్నారు సామాన్యులు. క్విడ్ ప్రోకోతో వీరికి సంబంధం లేకపోతే జగన్ తో విభేదించాలి కానీ జే గ్యాంగ్ లో ఒకరిగా మారిపోవడం గూడు పుఠానీ ఆరోపణలకు బలం చేకూర్చినట్టు అవుతుందని చెవులు కొరుక్కుంటున్నారు.