జగన్ టీం.. కేరాఫ్ బెజవాడ జిల్లా జైలు.. పరమర్శకు జగన్ వెళ్లేదెప్పుడు?

మాజీ ముఖ్యమంత్రి జగన్ టీం మొత్తం ఇప్పుడు విజయవాడ జిల్లా జైలులో ఊచలు లెక్కపెడుతోందా? అంటే అందరూ కాకపోయినా చాలా మంది పరిస్థితి అలాగే ఉందని సమాధానం వస్తుంది. ఇప్పటి జగన్ అక్రమాలలోనూ, అవినీతిలోనూ, దౌర్జన్యాలలోనూ భాగస్వాములైన వంశీ, రాజ్ కసిరెడ్డి, ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు, సజ్జల శ్రీధర్ రెడ్డిలు వేరువేరు కేసులలో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయితే గత 75 రోజులుగా బెజవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆయన బెయిలు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.

 ఇక మద్యం కుంభకోణంలో కర్త, క్రియ, కర్మగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి సైతం అరెస్టై ఇదే విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఆయనపై ఇసుక మాఫీయా ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో పోలీసులు త్వరలో ఈ కేసులో కూడా ఆయనను అరెస్టు చేసే అవకాశాలున్నాయంటున్నారు. అంటే ఆయనకు కూడా ఇప్పటిలో బెయిలు వచ్చే అవకాశాలు మృగ్యమే. ఇక మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకు తరలించి కోర్టులో ప్రవేశ పెట్టగా ఆయనను కూడా కోర్టు విజయవాడ జిల్లా జైలుకు రిమాండ్ చేసింది. అదే విధంగా ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు కూడా అక్కడే ఊచలు లెక్కపెడుతున్నారు. వీరందరూ ఒకే బ్యారక్ లో వేరువేరు సెల్స్ లో ఉన్నారు.

ఎప్పుడో వల్లభనేని వంశీ అరెస్టైన సమయంలో జగన్ విజయవాడ జిల్లా జైలుకు వచ్చి ఆయనతో ములాఖత్ అయ్యారు. పరామర్శించారు. ధైర్యం చెప్పారు. అయితే ఆ తరువాత అరెస్టైన రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులును జగన్ ఇంకా పరామర్శించలేదు. ఆయన జైలు పరామర్శ యాత్రలకు విరామం ప్రకటించినట్లుగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. 

దర్యాప్తు సంస్థల వేగం దూకుడూ చూస్తుంటే ముందు ముందు మరింత మంది జగన్ బ్యాచ్ నేతలు అరెస్టయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అదే జరిగితే విజయవాడ జిల్లా జైలుకు మరింత మంది వీఐపీలు రిమాండ్ ఖైదీలుగా వచ్చే అవకాశం ఉంది. వారంతా కూడా జైలుకు వచ్చిన తరువాత తీరిగ్గా అందరినీ ఒకే సారి పరామర్శించేయవచ్చన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లున్నారంటూ నెటిజనులు సెటైర్లు పేలుస్తున్నారు.  

Related Segment News