Latest News

హైడ్రా చర్యలను అభినందించిన ఇస్రో శాస్త్రవేత్తలు

posted on: Mar 13, 2026 7:52PM

 

నగర పరిసర ప్రాంతాల్లో చెరువుల కబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టేందుకు ఉపగ్రహ ఆధారిత సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్  బఫర్ జోన్‌లు వంటి కీలక సమాచారాన్ని నిర్ధారించడంలో ఎన్‌ఆర్‌ఎస్‌సీ అందిస్తున్న డేటా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. భూమి పరిశీలన సాంకేతికతల ప్రాముఖ్యతపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. నగర అభివృద్ధి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో చెరువుల స్థితిగతులపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయని, ఇలాంటి సందర్భాల్లో ఉపగ్రహ డేటా ఖచ్చితమైన మార్గదర్శకంగా ఉపయోగపడుతోందని హైడ్రా కమిషనర్ చెప్పారు. 

చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కులు, రహదారులు వంటి ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాల వివరాలను గుర్తించడంలో ఈ సమాచారం సహాయపడుతోందన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో కూడా ఉపగ్రహ చిత్రాల ఆధారంగా భూ వినియోగ మార్పులను ప్రజలకు చూపిస్తూ ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని తెలిపారు. గతంలో ఒక ప్రాంతంలో ఉన్న భూమి వినియోగం కాలక్రమేణా ఎలా మారిందో స్పష్టంగా చూపించడంతో అనేక సమస్యలు తక్షణమే పరిష్కారమవుతున్నాయని పేర్కొన్నారు.

చెరువుల పరిరక్షణకు కఠిన చర్యలు

ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు హైడ్రా తన కార్యక లాపాలను విస్తరించినట్లు కమిషనర్ తెలిపారు. ఉపగ్రహ సమాచారం ప్రకారం నగర పరిసర ప్రాంతాల్లో దాదాపు 61 శాతం చెరువులు గత కొన్నేళ్లలో కనుమరుగైనట్లు గుర్తించామని వెల్లడించారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే 15 సంవత్సరాల్లో మరిన్ని చెరువులు మాయమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో చెరువుల గుర్తింపు, వాటి పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. హైడ్రా కఠిన చర్యలతో చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో రియల్ ఎస్టేట్ లేఅవుట్లు వేయడం లేదా నిర్మాణాలు చేపట్టడం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు.

2006 సంవత్సరానికి చెందిన డిజిటల్ ఎలివేషన్ మోడల్ డేటాను ఆధారంగా తీసుకుని చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను నిర్ధారిస్తున్నామని తెలిపారు. అవసరమైతే 1970, 1990 దశకాల ఉపగ్రహ డేటాను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో సుమారు 13,500 ఎకరాల ప్రభుత్వ భూములు, ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాలను ఆక్రమణల నుంచి రక్షించగలిగామని వెల్లడిం చారు. ఈ భూముల అంచనా విలువ దాదాపు 70 వేల కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

నీటి నాణ్యతపై ఉపగ్రహ అధ్యయనాలు

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని చెరువుల నీటి నాణ్యతను కూడా ఉపగ్రహ సాంకేతికత ద్వారా పరిశీలించేందుకు సహకరించాలని హైడ్రా కమిషనర్ ఎన్‌ఆర్‌ఎస్‌సీని కోరారు. కాలుష్య స్థాయిలను గుర్తించి శాస్త్రీయ ఆధారాలతో చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అంతరిక్ష సాంకేతికతను ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించడం ఎంతో కీలకమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. నీటి వనరుల సంరక్షణలో హైడ్రా తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం అని వారు తెలిపారు. ఉపగ్రహ ఆధారిత సాంకేతికతను వినియోగించి చెరువులు, ప్రభుత్వ ఆస్తులను కాపా డేందుకు హైడ్రా చేస్తున్న కృషికి శాస్త్రవేత్తలు అభినందనలు తెలిపారు.

“హైడ్రా-రక్ష” పౌర సేవా పోర్టల్ ప్రారంభం

 “హైడ్రా-రక్ష” పేరుతో కొత్త పౌర సేవా పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా ఓఆర్‌ఆర్ పరిధిలోని చెరువులు, నాలాలు, భూముల హద్దుల వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రజలు కొనుగోలు చేయబోయే భూమి చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందా, బఫర్ జోన్‌లో ఉందా అనే విషయాలను ముందుగానే తెలుసుకునే వీలుంటుంది. జిల్లా, మండలం, గ్రామం లేదా చెరువు పేరుతో పాటు భౌగోళిక కోఆర్డినేట్లను నమోదు చేస్తే సంబంధిత ప్రాంతం మ్యాప్‌లో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. 

దీంతో ఫుల్ ట్యాంక్ లెవల్ సరిహద్దులు, బఫర్ జోన్‌ల వివరాలు స్పష్టంగా తెలుసుకోవచ్చు. ప్రారంభ దశలో ఈ పోర్టల్‌ను కొద్ది వారాల పాటు హైడ్రా అంతర్గత వినియోగానికి మాత్రమే ఉపయోగించ నున్నారు. తరువాత పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూములను రక్షించడంలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తే భవిష్యత్తులో మరిన్ని ఆక్రమణలను అరికట్టగలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...