Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఐసిస్‌తో అన్నలు కలిస్తే అలజడేనా..?
posted on: Jul 20, 2016 3:10PM

ఇస్లామిక్ స్టేట్..దారుణ మారణకాండతో అగ్రరాజ్యాలతో సహా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న తీవ్రవాద సంస్థ. ఇప్పటికే వివిధ దేశాల్లో రక్తపుటేరులు పారించిన ఐఎస్ కన్ను భారతదేశంపై పడింది. ఎన్నోసార్లు భారత్‌లో విధ్వంసం సృష్టించాలనుకున్నా..మన నిఘా సంస్థలు, భద్రతా దళాల ముందు దాని ఆటలు సాగలేదు. పేలుడు పదార్థాలతో భారీ విధ్వంసాన్ని సృష్టించాలని పథక రచన చేస్తోన్న వివిధ రాష్ట్రాలకు చెందిన 18 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ గత జనవరిలో అరెస్ట్ చేసింది. దేశంలో ఐసిస్ ఉగ్రవాదులను తయారు చేస్తోన్న వ్యవహారంలో ప్రధాన నిందితుడు, తప్పించుకు తిరుగుతున్న షఫీ ఆర్మర్ సహా 16 మంది అనుమానిత ఉగ్రవాదులపై ప్రత్యేక న్యాయస్థానంలో ఎన్‌ఐఏ నిన్న ఛార్జిషీటు దాఖలు చేసింది.
ఈ క్రమంలో ఎన్ఐఏ ఒక చేదువార్తను వెలుగులోకి తెచ్చింది. భారత్‌లోని ఐసిస్ ఉగ్రవాదులు నక్సల్ గ్రూపులతో సంప్రదింపులు జరిపినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. దీంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిజానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో సాయుధ పోరాటాలు చేస్తున్న నక్సలైట్ గ్రూపులకు దేశంలోని ఇతర తీవ్రవాద, వేర్పాటు వాద గ్రూపులతోనే కాక పాక్ మద్ధతుగల ఆరు తీవ్రవాద గ్రూపులతో సన్నిహిత సంబంధాలున్నట్టు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయుధ సరఫరా, సైనిక శిక్షణ అవసరాల కోసం గతంలో శ్రీలంకలోని ఎల్‌టీటీఈతో నక్షలైట్లు సంబంధాలు ఏర్పరచుకున్నట్టు అనేక ఉదంతాలు వెల్లడించాయి. మావోయిస్టులతో వ్యాపార సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనదేశంలో భారత వ్యతిరేక కార్యకలాపాలకు వారిని పాకిస్తాన్‌లోని నిఘా వర్గాలు ఉపయోగించుకుంటున్నట్టు ఇంటెలిజెన్స్ ఆరోపిస్తోంది.
మత్తు పదార్థాలు, నకిలీ కరెన్సీ స్మగ్లింగ్‌లో మావోలు సహకరిస్తున్నట్టు భావిస్తున్నారు. అందుకు ప్రతిగా ఐఎస్ఐ ఆయుధాలు, ప్రేలుడు పదార్థాలను మావోలకు అందజేస్తోంది. ఇలా మావోల ఎదుగుదలలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కీలక పాత్ర పోషించినట్లు ఆధారాలను బట్టి అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని ప్రతి దేశానికి సవాలు విసురుతున్న ఇస్లామిక్ స్టేట్‌తో మావోయిస్ట్‌లు కలిస్తే..? అసలు ఆ ఊహే వెన్నులో వణుకుపుట్టిస్తోంది. అయినా ఐఎస్ భావజాలం వేరు..మావోయిస్టుల పంథా వేరు. ప్రపంచంలో ఇస్లాం రాజ్య స్థాపన ఐఎస్ లక్ష్యం..ఆయుధంతోనైనా బడుగులకు న్యాయం చేయాలన్నది మావోల లక్ష్యం. అయితే ఆపరేషన్ గ్రీన్‌హంట్‌తో పాటు వరుస ఎదురుదెబ్బలు మావోల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయి. దీనికి తోడు అన్నలకు ఆయుధాలు సరఫరా అయ్యే అన్ని రకాల మార్గాలను భద్రతా దళాలు మూసివేశాయి. దీంతో ఉద్యమాన్ని నడిపించాలంటే బయటి నుంచి మద్ధతు అవసరం అందుకే వేరే గత్యంతరం లేక మావోలు ఐఎస్‌తో సంబంధాలు పెట్టుకుని వుండవచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.






