ఎల్టీటీఈ 2.0 ద్వారా ఇంకా బ‌తికే ఉందా!?

posted on: Jun 1, 2026 12:25PM

శ్రీలంకలో ఎల్టీటీఈ సైనిక పరాజయం తర్వాత దాని అనుబంధ వ్యవస్థలు ప్రపంచ వ్యాప్తంగా కొత్త వ్యూహాలతో పనిచేస్తున్నాయి. నార్వే, బ్రిటన్‌, అమెరికా  కేంద్రాలుగా చేసుకుని నిధులు సమీకరించడం, అంతర్జాతీయ వేదికలపై ప్రభావం చూపడం, భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతునివ్వడం వంటివి ఈ వ్యవస్థల ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. వీటికి తోడు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విదేశీ నిఘా సంస్థలతో అనుబంధం వంటి అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

2009లో వేలుపిళ్లై ప్రభాకరన్ మరణం, ఎల్టీటీఈ సైనిక పరాజయం తర్వాత, ఈ సంస్థ.. ఆర్థిక, ప్రచార వ్యవస్థలు పూర్తిగా నిర్మూలం కాలేదు. బదులుగా, అవి మరింతగా ప‌దునుదేలిన‌ వ్యూహాలతో ఎల్టీటీఈ 2.0గా  రూపాంత‌రం చెందాయి.

ప్రముఖ ఉగ్రవాద నిపుణుడు ప్రొఫెసర్ రోహన్ గుణరత్న అభిప్రాయం ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఎల్టీటీఈకి సంబంధించిన మూడు ప్రధాన వర్గాలు అత్యంత‌ చురుకుగా పనిచేస్తున్నాయి. వాటిలో ఒక‌టి-  ట్రాన్స్‌నేషనల్ గవర్నమెంట్ ఆఫ్ తమిళ్ ఈలం(టీజీటీఈ)  ఇది న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. ఎల్టీటీఈ నాయకుడికి చట్టపరమైన సలహాదారుగా ఉన్న విశ్వనాథన్ రుద్రకుమారన్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు.

రెండోది.. గ్లోబల్ తమిళ్ ఫోరమ్(జీటీఎఫ్). ఇదైతే లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఫాదర్ ఎస్. జె. ఇమ్మాన్యుయేల్ నేతృత్వంలో ఈ బృందం మానవ హక్కుల పేరుతో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తోంది.

మూడోది. తమిళ్ ఈలం పీపుల్స్ అసెంబ్లీ (టీఈపీఏ). ఇది నార్వే కేంద్రంగా పనిచేస్తుంది. ప్రభాకరన్ తర్వాత శిక్షణ పొందిన ఎల్టీటీఈ కేడర్ అయిన పెరిన్పనాయగం శివపరన్ అలియాస్ నెడియావాన్ దీనికి నాయకుడు.

ఈ మూడు వర్గాలు కలిసి, ఒక సమన్వయ వ్యూహంలో భాగంగా ఐక్యరాజ్యసమితి సెషన్ల వంటి అంతర్జాతీయ వేదికలపై శ్రీలంక, భారత్ వంటి దేశాలపై ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎల్టీటీఈ అనుబంధ వర్గాలు ఇప్పుడు ఆయుధాలను పక్కన పెట్టి, రాజకీయ లాబీయింగ్, మానవ హక్కుల ప్రచారం,  ప్రవాసుల ఓటు బ్యాంకును కేంద్రంగా చేసుకున్న కొత్త తరహా పోరాటానికి మారాయి.

జీటీఎఫ్ నాయకుడు  ఫాదర్ ఇమ్మాన్యుయేల్ పాత్ర విష‌యానికి వ‌స్తే.. ఈ మూడు బృందాల్లో అత్యంత కీలకమైంది గ్లోబల్ తమిళ్ ఫోరమ్. శ్రీలంక తమిళుల ప్రవాస సమన్వయ సంస్థగా, 2010లో ఏర్పడిన ఈ ఫోరమ్, బ్రిటిష్ పార్లమెంటులో ప్రారంభమైంది. దీని ప్రారంభోత్సవంలో అప్పటి బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ మిలిబాండ్, షాడో ఫారిన్ సెక్రటరీ విలియం హేగ్ వంటి ప్రముఖులు పాల్గొనడం విశేషం.

ఇక ఫాదర్ ఎస్. జె. ఇమ్మాన్యుయేల్ నేపథ్యం.. ఆయ‌న విద్యాబ్యాసం- కొలంబో విశ్వవిద్యాలయంలో భౌతిక, గణిత శాస్త్రాలలో డిగ్రీ, రోమ్ నుంచి థియాలజీలో డాక్టరేట్ పొందారాయ‌న‌. ఇక మతపరమైన పాత్ర ఎలాంటిదంటే.. క్యాథలిక్ పూజారిగా, జాఫ్నా డియోసెస్‌కు వికార్ జనరల్ గా పనిచేశారు. ప్రస్తుతం జర్మనీలోని డార్ఫెల్డ్‌లో పాస్టర్ గా ఉన్నారు.

ఎల్టీటీఈ సంబంధాలు అనే అంశంలో, శ్రీలంక ప్రభుత్వ మూలాల ప్రకారం చూస్తే..  ఇమ్మాన్యుయేల్,  ప్రభాకరన్ లిబరేషన్ టైగర్స్ కి  సంబంధించిన‌ అంతర్జాతీయ కార్యకలాపాల విభాగానికి నాయకుడు.  కాస్ట్రో వంటి వారితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. వన్నీలోని కల్నల్ కిట్టు పొలిటికల్ కాలేజీలో ఎల్టీటీఈ కేడర్లకు శిక్షణ ఇచ్చిన ఆరోపణలు కూడా ఉన్నాయి.

జిఫ్  మెయిన్ టార్గెట్..  సైనిక పోరాటాన్ని విడనాడి, అంతర్జాతీయ స్థాయిలో తమిళ జనాభా ఎదుర్కొంటున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, మారణహోమం వంటి అంశాలతో శ్రీలంకపై ఒత్తిడి తీసుకురావడమే. ఈ క్రమంలో, వారు బ్రిటన్, అమెరికా, కెనడా వంటి దేశాల్లోని ప్రవాస తమిళుల ఓటు సామర్థ్యాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు.

బ్రిటిష్ పార్లమెంటులోనే ప్రారంభించిన జిఫ్, బ్రిటిష్ రాజకీయ నాయకులను సభ్యులుగా కలిగి ఉంది. ఇది శ్రీలంక విషయంలో బ్రిటన్ విధానంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపడానికే అంటారు నిపుణులు.

 టీజీటీఈ అనేది పూర్తి స్థాయి ప్రభుత్వ త‌ర‌హా నిర్మాణాన్ని కల్పించుకున్న సంస్థ. ప్రధానమంత్రి, పార్లమెంట్, విదేశాంగ విధానంతో కూడిన ఈ  ప్రభుత్వం, ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలలో ఉన్న తమిళ ప్రవాసుల మధ్య ఎన్నికలను నిర్వహిస్తుంది. ఎల్టీటీఈ నేతకు చట్టపరమైన సలహాదారుగా ఉన్న విశ్వనాథన్ రుద్రకుమరన్ దీనికి నాయకత్వం వహిస్తున్నారు.

భారత్, యూఎస్.. రెండు దేశాలు.. ఎల్టీటీఈని ఉగ్రవాద సంస్థగా ప్రకటించినప్పటికీ,టీఈటీఈ అమెరికాలో తన కార్యకలాపాలను చట్టబద్ధంగానే కొనసాగిస్తోంది. ఇది పెన్సిల్వేనియా రాష్ట్రంలో తమిళ జాతి నిర్మూలన ఆరోపణలతో తీర్మానాలు ఆమోదించేలా ప్రభావం చూపగలిగింది.

ఇక ఈ సంస్థ‌లు నిధుల సేకరణ ఎలా చేస్తాయంటే, మూడు ప్రధాన వనరులు క‌నిపిస్తాయి. ఈ ప్రవాస సంస్థల కార్యకలాపాలకు ప్రధాన ఆజ్యం పోసే నిధుల మూలాలను నిపుణులు గుర్తించారు. వాటిలో ఫ‌స్ట్ వ‌న్..  ప్రవాసుల విరాళాలు. ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న తమిళ ప్రవాసుల నుంచి వచ్చే నిధులు.

న్యాయపోరాట గ్రాంట్లు. మానవ హక్కుల పేరుతో పనిచేసే ఎన్జీవోల ద్వారా అందే గ్రాంట్లు. రెండో మార్గం..  మాదకద్రవ్యాల అక్రమ రవాణా.  నివేదికల ప్రకారం..  పాకిస్తాన్ నుంచి అరేబియా సముద్రం, శ్రీలంక గుండా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న.. మాదకద్రవ్యాల మార్గం ద్వారా వచ్చే ఆదాయం కూడా ఈ సంస్థలకు చేరుతుందని అంచనా.

ఇక నార్వే, ఐఎస్ఐ వంటి బెదిరింపులు ఎలాంటివి ఏంట‌ని చూస్తే.. 

ఈ విశ్లేషణలోని మరో కీలకమైన అంశం నార్వే పాత్ర. సుమారు 50 వేల‌ మంది పాకిస్తానీ ప్రవాసులు నివసిస్తున్న ఈ దేశం, కొన్ని నివేదికల ప్రకారం, నిధుల ప్రవాహానికి కేంద్రంగా ఉంది. ఐఎస్ఐ,  ఇతర అంతర్జాతీయ నిఘా వ్యవస్థలు తమిళనాడు వంటి ప్రాంతాల్లో అస్థిరతను సృష్టించేందుకు ఈ మార్గాలను ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు. తమిళనాడు.. వ్యూహాత్మక ప్రాముఖ్యత  విష‌యానికి వ‌స్తే.. శ్రీలంకకు ద‌గ్గ‌ర‌లో ఉండటం, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు ప్రవేశ ద్వారంగా ఉండటం.. దీన్ని మరింత సున్నితమైన ప్రాంతంగా మారుస్తుంది.

ఇండివిడ్యువ‌ల్ సోర్సెస్, కోర్డు రికార్డుల ద్వారా పరిశీలిస్తే, ఎల్టీటీఈ ప్రవాస నెట్‌వర్కులు.. వాస్తవంగా ఉనికిలో ఉన్నాయని, అవి వివిధ దేశాల్లో తమ ప్రభావాన్నింకా చూపుతున్నాయని స్పష్టమవుతూనే ఉంది. కాబ‌ట్టి ఎల్టీటీఈ పూర్తిగా స‌మ‌సిపోలేదు. ఇంకా అది  2. 0 రూపంలో బ‌తికే ఉంద‌న‌డానికి నిద‌ర్శ‌నాలే ఇవ‌న్నీ.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.     

google-ad-img
    Related Sigment News
    • Loading...