సీఐఏ ఏజెంట్ల వేదిక‌గా ఢిల్లీ జింఖానా క్ల‌బ్?

posted on: Jun 3, 2026 4:09PM

ఢిల్లీ జింఖానా క్లబ్‌ కేవలం ఎలైట్‌ల వినోద కేంద్రం మాత్ర‌మే కాదు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో  సీఐఏకి ఢిల్లీలో అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ డ్రాప్ సైట్‌గా పనిచేసిన ప్రాంగణం కూడా. ఐదు దశాబ్దాల తరువాత, అదే ప్రాంగణాన్ని భారత ప్రభుత్వం జాతీయ భద్రత పేరిట తిరిగి స్వాధీనం చేసుకోవడం హిస్ట‌రీ ఎట్ 360 డిగ్రీస్ గా మారిన‌ట్టు లెక్క‌.

ఢిల్లీ జింఖానా క్లబ్‌. 1913లో స్థాపించిన, లూటియన్స్‌ ఢిల్లీలోని అత్యంత ప్రతిష్ఠాత్మక కాలనీ క్లబ్‌లలో ఒకటి. సుమారు 27 ఎకరాల  విస్తీర్ణంలో, ప్రధానమంత్రి నివాసానికి అతి ద‌గ్గ‌ర్లో ఉన్న ఈ క్లబ్‌ దశాబ్దాలుగా బ్రిటిష్ ఐసీఎస్ అధికారుల నుంచి, స్వతంత్ర భారతదేశంలోని సీనియర్ బ్యూరోక్రాట్లు, సైనికాధికారులు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, ఇంకా ఎంద‌రో విదేశీ దౌత్యవేత్తలు  క‌లిసే సోష‌ల్ డ‌యాస్ గా నిలిచింది.

కోల్డ్ వార్ కాలంలో..  ఇదే వేదిక అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఐఏకి ఢిల్లీలో అత్యంత సౌకర్యవంతమైన  కాంటాక్ట్ జోన్ గా మారింది. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం..  అధికారులకు విదేశీయులతో అనుమతి లేకుండా సమావేశాలు నిషేధం. కానీ జింఖానా క్లబ్‌లోని ఎలాంటి నియ‌మ నిబంధ‌న‌లేవీ లేకుండా.. బార్‌లు, టెన్నిస్ కోర్టులు, బాల్‌రూమ్‌లు  సోష‌ల్ మూవింగ్ కి ఎంతో బాగా ప‌ని చేసిన‌ట్టు చెబుతోంది చ‌రిత్ర‌.

ప్రచ్ఛన్న యుద్ధం నుంచి, 2026 ప్రభుత్వ ఆదేశం వరకు ఈ క్ల‌బ్ లో ఎన్నో కార్య‌క‌లాపాలు కొన‌సాగాయి. 1970 జ‌న‌వ‌రి చివ‌రిలో  జిఖానాలో టీ 72 ఆప‌రేష‌న్ జ‌రిగింది. 2002లో  సీఐఏ మాజీ అధికారి రాబర్ట్ బేర్ రాసిన‌ తన ఆత్మకథ, సీ నో ఈవిల్ లో..  ఢిల్లీ జింఖానా క్లబ్‌  సీఐఏ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ల కీలక కేంద్రంగా ప‌ని చేసింద‌ని వివరించాడు.
 
1971 తర్వాత.. భారత్, సోవియట్ సన్నిహిత సంబంధాలు, అమెరికా, సోవియట్ పోటీ తీవ్రతరం అయ్యాయి. 1978లో భారత్, సోవియట్ యూనియన్ నుంచి ఆధునిక టీ-72 మెయిన్ బ్యాటిల్ ట్యాంక్లను దిగుమతి చేయడం ప్రారంభించింది. సీఐఏ, పెంటగాన్‌కు ఇదొక మెయిన్ టార్గెట్. సోవియట్ ట్యాంక్ టెక్నాలజీపై లోతైన సమాచారం సేకరించడం వంటివి న‌డిచాయి.
 
బేర్ చేసిన‌ వర్ణన ప్రకారం, ఢిల్లీలోని సీఐఏ.. స్టేషన్‌, ట్యాంక్‌తో సహా డిఫెక్షన్, డిపో అధికారులకు లంచం ఇవ్వడం, ఆర్మర్ నమూనాలు పొందడం వంటి య‌త్నాలు చేసింది. అవి విఫలమయ్యాయి.  చివరికి, ఒక భారతీయ కాంటాక్ట్ ద్వారా టీ-72 క్లాసిఫైడ్ మాన్యువల్స్‌తో నిండిన డఫల్ బ్యాగ్ సీఐఏ చేతికి చిక్కింద‌ని అంటారు బేర్. వీట‌న్నిటి విష‌యంలో ఢిల్లీ జింఖానా క్లబ్‌ ప్రస్తావన వస్తుంది. 2002లో బేర్ పుస్తకం వెలువడిన తర్వాత, ఢిల్లీ జింఖానా సీఐఏ–టీ-72 కథ మొదటిసారి పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చింది. భారత అధికార వర్గాలు దీనిపై అధికారికంగా పెద్దగా స్పందించకపోయినా, ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఇది ఓపెన్ సీక్రెట్ గా డిస్క‌స్ అయ్యింది. 2020లో భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోర్టులో ఇచ్చిన అఫిడవిట్‌లో ఢిల్లీ జింఖానా క్లబ్‌ను జిమ్నాజియం నుంచి డ్రింకింగ్ డెన్ గా మారిపోయిన‌ట్టు  తీవ్రంగా విమర్శించింది. అదే సమయంలో.. క్లబ్‌లో ఎలైట్ బ్యూరోక్రసీ, విదేశీ దౌత్యవేత్తలు నియ‌మాల‌ను అతిక్ర‌మిస్తూ  క‌లిసే వేదిక‌గానూ ముద్ర ప‌డింది. ఇది భద్రతా వ్యవస్థకు  నేషనల్ సెక్యూరిటీ రిస్క్ గా త‌యారైంద‌న్న‌ది ప్రభుత్వ వాదన.
 
2026 మే చివర్లో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ జింఖానా క్లబ్‌ను.. జాతీయ భద్రత, రక్షణ మౌలిక సదుపాయాల బలోపేతం, అత్యవసర ప్రజా ప్రయోజనం పేరుతో జూన్ 5లోపు ఖాళీ చేయాలని ఆదేశించింది.  ఈ ఆదేశం వెలువడిన వెంటనే..  క్లబ్ సభ్యులు  అన్యాయం,  కార‌ణాల‌న్నీ  క‌ట్టు క‌థ‌లే అంటూ విమర్శలు గుప్పించారు. మీడియా, సోషల్ మీడియాలో సీఐఏ, జింఖానా టీ-72  కథ మళ్లీ ముందుకు వ‌చ్చింది. ఇది భూమి విలువ గురించా? లేక నిజమైన భద్రతా ఆందోళనల గురించా? అన్న ప్రశ్నలు తిరిగి తెరపైకి వచ్చాయి. 

గ‌త చ‌రిత్ర ఒక్క‌సారి ప‌రిశీలిస్తే.. ప్రచ్ఛన్న యుద్ధం కేవలం సరిహద్దుల్లో, బ్రీఫింగ్ రూమ్‌లలో మాత్రమే జరగలేదు. కొన్నిసార్లు ఢిల్లీ జింఖానా బార్‌లో స్కాచ్ గ్లాస్‌ల మధ్య కూడా జరిగింది.  ఢిల్లీ జింఖానా క్లబ్ భూమి.. భారత ప్రభుత్వ ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ పరిధిలో ఉంది. క్ల‌బ్‌కు ఇది లీజ్ ఆధారంగా ఇచ్చిన భూమి. లీజ్ నిబంధనల ఉల్లంఘన, సభ్యత్వంలో అక్రమాలు, కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు వంటి అంశాలపై గత కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి.
 
జాతీయ భద్రత, రక్షణ మౌలిక సదుపాయాల అవసరం, పబ్లిక్ ఇంటరెస్ట్ పేరుతో లీజ్ రద్దు చేసి, భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ఉందని భారత ప్రభుత్వం, వాదిస్తోంది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 300ఏకి  చెందిన రైట్ టు ప్రాప‌ర్టీ యాజ్ ఏ లీగ‌ల్ రైట్, ల్యాండ్ అక్విజిష‌న్ / ప‌బ్లిక్ ప‌ర్ప‌స్ సిద్ధాంతాల పరిధిలోకి వస్తుంది. అయితే ఇక్కడ ఇది లీజ్ రద్దుతో పాటు ప్రభుత్వ స్వాధీనం రూపంలో కనిపిస్తోంది.

జాతీయ భద్రతా వాదన..  చట్టపరంగా ఎంత బలంగా అంటే, ప్రభుత్వం చెబుతోన్న‌ మూడు ప్రధాన కారణాల్లో మొద‌టిది నేష‌న‌ల్ సెక్యూరిటీ, రెండోది డిఫెన్స్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్, మూడోది అర్జంట్ ప‌బ్లిక్  ఇంట్ర‌స్ట్. కోర్టులు సాధారణంగా జాతీయ భద్రతా అంశాల్లో ఎగ్జిక్యూటివ్‌కు కొంత మేర డిఫరెన్స్ ఇస్తాయి. కానీ..  క్లబ్‌ గతంలో సీఐఏ ఆపరేషన్లకు వేదిక అయ్యిందనే చరిత్ర మాత్రం అంత మామూలు విష‌యం కాదు. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో ఢిల్లీ పవర్ కారిడార్‌లలో ఇలాంటి  ప్రైవేట్ ఎలైట్ స్పేస్ లపై ఉన్న అనుమానాలు, ఈ వాదనకు అద‌న‌పు బ‌లాన్నిస్తున్నాయి.

రాజకీయ, సామాజిక, మీడియా కోణాల విష‌యానికి వ‌స్తే.. మొద‌టిది  రాజకీయ కోణం. లూటియన్స్ ఎలైట్ పై దెబ్బా? లేక నిజమైన భద్రతా ఆందోళనా? అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది. ఈ నిర్ణయం వెనుక రెండు లేయర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది పీఎం నివాసానికి కూత‌వేటు దూరంలో ఉన్న 27 ఎక‌రాల ప్రాంగ‌ణం  కావ‌డం..  ఆపై విదేశీ దౌత్య‌వేత్త‌లు, ఇత‌రత్రా లాబీయిస్టులు.. అన‌ధికారిక మీటింగులు ఇత‌ర నెట్ వ‌ర్కింగుల‌కు వేదిక కావ‌డం. ఇవ‌న్నీ నేటి హైబ్రిడ్ వార్, ఇన్ఫ‌ర్మేష‌న్ వార్ యుగంలో సీరియ‌స్ గా తీసుకోవ‌ల్సిన  అంశాలు.

ఇక పోతే ఎలైట్ పాలిటిక్స్ కోణం.. ఢిల్లీ జింఖానా క్లబ్‌ సభ్యత్వం- ప్రధానంగా లూటియన్స్ ఎలైట్, ప్రభుత్వ, ఎలైట్ గ్రూపుల మ‌ధ్య‌ టగ్ ఆఫ్ వార్ న‌డుస్తోంది. లూటియ‌న్స్ ఎలైట్ అంటే హై ప్రొఫైల్ ప‌వ‌ర్ స‌ర్కిల్ అన్న‌మాట‌. వీరికీ ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారుల‌కూ మ‌ధ్య ఒక ఇగోవార్ లాంటిది  జ‌రుగుతోంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టాల‌న్న‌ది ఇందులో దాగిన మ‌రో ముఖ్య‌మైన విష‌యం. ఇవి కూడా ఈ నిర్ణయానికి రాజకీయ రంగు పులుముతున్నాయి.

క్లబ్ కల్చర్  నుంచి  నేషనల్ సెక్యూరిటీ రిస్క్ వరకు సాగిన ఈ ఉదంతం.. ఒకప్పుడు  సోషల్ క్యాపిటల్  నిర్మించే వేదికలుగా ఉండి.. ఇప్పుడు  ఇన్ఫ్లుయెన్స్ ట్రేడింగ్, ఇన్ఫర్మేషన్ లీక్, లాబీయింగ్ కేంద్రాలుగా మార‌డం.. ప్ర‌పంచ వ్యాప్తంగా  పెరిగిన ధోర‌ణికి తార్కాణం. ఇలాంటి దుస్థితిలోకి ఈ జింఖానా క్ల‌బ్ చేరింది.

ఇక‌ మీడియా కోణం ఏంటంటే, స్పై స్టోరీ, నోస్టాల్జియా, పొలరైజ్డ్ నారేటివ్.. గా దీన్ని చూడాలి. ఒక వ‌ర్గం మీడియా.. దీన్ని  సీఐఏ స్పై క్లబ్ గా బ్రాండింగ్ చేస్తూ, జాతీయ భద్రతా కోణాన్ని హైలైట్ చేస్తోంది.  ఇత‌ర మీడియా వ‌ర్గాలు దీన్నొక సాంస్కృతిక వారసత్వం, కాలనీ  ఆర్కిటెక్చర్, ఎలైట్ సోషల్ స్పేస్  కోణంలో నోస్టాల్జిక్ కథనాలు రాస్తోంది.

సోషల్ మీడియాలో రెండు భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇక్కడ సీఐఏ లాంటి విదేశీ శక్తులు నడిచాయి, ఇప్పుడు మన ప్రభుత్వం దీన్ని తన అధీనంలోకి తీసుకోవడం వంద శాతం కరెక్ట్. అని కొంద‌రు వాదిస్తుంటే..  భద్రత అనేది కేవలం ఒక సాకు మాత్రమే... అసలు విషయం ఏంటంటే, ఇది పక్కా ల్యాండ్ గ్రాబింగ్..  అంటే భూకబ్జా అంటున్నారు మ‌రికొంద‌రు.

ఒక అణ్వాయుధ దేశం.. జాతీయ భద్రతను దెబ్బతీయడానికి బాంబులు అవసరం లేదు. దాని ఎలైట్ క్లబ్‌లో సభ్యత్వం చాలనేది ఢిల్లీ జింఖానా కథ చెప్పే క‌ఠిక వాస్త‌వం  అన్న‌ది ఫైన‌ల్ కంక్లూష‌న్ గా తెలుస్తోంది. 

ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సీఐఏ కి ఇది సక్సెస్‌ఫుల్ డ్రాప్ సైట్ గా పనిచేసిందనే బేర్ వర్ణన

నేటి మల్టీ పోలార్, టెక్ డ్రైవన్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా ఇలాంటి ప్రాంగణాలు సాఫ్ట్ టార్గెట్ లుగా ఉండే అవకాశముంది, వీట‌న్నిటినీ కలిపి చూస్తే, భారత ప్రభుత్వం ఈ ప్రాంగణాన్ని సెన్సిటివ్ జోన్ గా పరిగణించడం పూర్తిగా కల్పితం కాదని చెప్పాల్సి వస్తుంది. ఇది కేవలం ఒక క్లబ్ కథ కాదు. ఇండియన్  ప్రజాస్వామ్యంలో.. ఎలైట్ స్పేస్‌లకు ఉన్న  అన్‌టచ్‌బుల్  స్టేటస్,  క్రమంగా సవాలు చేస్తున్న‌ సంకేతం. రాబర్ట్ బేర్ పుస్తకం 2002లో వచ్చింది. సీఐఏ జింఖానా టి 72 కథ అప్పుడే తెలిసింది.  కానీ, అప్పటి రాజకీయ, భద్రతా ప్రాధాన్యతలు, ఇండియా, అమెరికా S సంబంధాల మార్పు,
ఇంటెలిజెన్స్ వ్యవస్థల ఇంట‌ర్న‌ల్ డైనమిక్స్ వల్ల, ఈ చరిత్రపై వ్య‌వ‌స్థాగ‌త స్పంద‌న  బాగా ఆలస్య‌మైంది. 2026లో తీసుకున్న ఈ నిర్ణయం,  చరిత్రకు ఆలస్యమైనా కానీ స్ట్రాంగ్ రియాక్ష‌న్ కావ‌చ్చు.

ఓవ‌రాల్ గా చూస్తే.. ఇది భారత అధికార వ్యవస్థలోని కొంత భాగం.  ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో..  విదేశీ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌లకు సాఫ్ట్ టార్గెట్‌గా మారింది. టీ-72 మాన్యువల్స్ లీక్ కథ, జింఖానా వంటి ప్రాంగణాల్లో  అన్‌ఆఫిషియల్ ఇంటరాక్షన్‌లు.. ఇవి కేవలం సీఐఏ  తెలివితేటలకు చెందిన‌ కథ కాదు. మన సిస్టమ్‌లోని బలహీనతలకు సంబంధించిన‌ది కూడా. ఇక ఎలైట్ క్లబ్ కల్చర్, జాతీయ భద్రతా ఆసక్తులకు ఎప్పుడూ అనుకూలంగా ఉండదు. స్కాచ్ గ్లాస్‌లో సెక్యూరిటీ డిస్కషన్,  టెన్నిస్ కోర్ట్ పక్కన డిఫెన్స్ సీక్రెట్స్, ఇవి రొమాంటిక్ స్పై స్టోరీలా వినిపించినా, ఒక దేశానికి సంబంధించి అవి బలహీనతలే. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంలో రాజకీయ కోణాలు ఉన్నా, భద్రతా కోణం పూర్తిగా కల్పితం కాదు. 

పీఎమ్ నివాసానికి పక్కనే ఉన్న 27 ఎకరాల ఎలైట్ ప్రైవేట్ స్పేస్, గతంలో స్పై ఆపరేషన్లకు వేదిక, నేటి హైబ్రిడ్ వార్ యుగాన్ని బ‌ట్టీ వీట‌న్నిటినీ కలిపి చూస్తే, భ‌ద్ర‌తా  ప‌ర‌మైన సున్నితాంశాల ప్ర‌కారం.. దీన్ని తిరిగి స్వాధీన‌ప‌రుచుకోవ‌డం మంచి నిర్ణ‌యంగానే తెలుస్తోంది.   ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయింది. కానీ దాని నీలి నీడలు మాత్రం ఇంకా ఢిల్లీ పవర్ కారిడార్‌లలో తిరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ జింఖానా క్లబ్‌పై ప్రభుత్వ చర్య, ఆ నీడల మ‌ధ్య ఆలస్యమైనా కానీ దీన్నో స్పష్టమైన లెక్క గానే అభివ‌ర్ణిస్తారు కొంద‌రు విశ్లేష‌కులు.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.     

google-ad-img
    Related Sigment News
    • Loading...