కియా మోటార్స్ ఏపీ నుంచి తరలిపోనుందా? జగన్ ప్రభుత్వంతో కియాకి పడటం లేదా?

వైసీపీ ప్రభుత్వ విధానాలు, జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నో పరిశ్రమలు తరలివెళ్లిపోతున్నాయనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పలువురు పారిశ్రామికవేత్తలు సైతం వైసీపీ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం కొనసాగుతుందంటూ ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ మోహన్‌దాస్ పాయ్ ఆమధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రముఖ కంపెనీలు, పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ విమర్శలు చేశారు. ఆయన చేసిన విమర్శలు నిజమేనేమోననిపిస్తున్నాయి. ఎందుకంటే, దక్షిణకొరియా దిగ్గజ కంపెనీ కియా మోటార్స్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వైదొలగేందుకు ప్రయత్నిస్తోందన్న మాట వినిపిస్తోంది. ఏపీ నుంచి పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు తన ప్లాంట్ ను తరలించాలనే ఉద్దేశంతో ఉందనే ప్రచారం జరుగుతోంది. 1.1 బిలియన్ డాలర్లతో అనంతపురం జిల్లాలో నెలకొల్పిన కార్ల ప్లాంట్ ను తమిళనాడుకు తరలించే సాధ్యాసాధ్యాలపై కియా మోటార్స్ చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. కియా మోటార్స్ ప్రతినిధులు ఇఫ్పటికే తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపినట్లు ప్రముఖ వార్తసంస్థ రాయిటర్స్ సంచలన కథనం ప్రచురించింది. దాంతో, రాయిటర్స్ కథనంపై ఏపీలో కలకలం రేగుతోంది. 

ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద కారు మార్కెట్ కలిగివున్న కియా మోటార్స్... భారత్ లోకి ఎంట్రీ ఇచ్చి తన తొలి ప్లాంట్ ను ఏపీలో నెలకొల్పింది. అనంతపురం జిల్లాలో రెండేళ్ల నిర్మాణ పనుల తర్వాత గతేడాది డిసెంబర్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించింది. ఏడాదికి 3లక్షల కార్ల ఉత్పత్తి సామర్ధ్యంతో నెలకొల్పిన ఈ ప్లాంట్లో ప్రత్యక్షంగా 12వేల మందికి ఉద్యోగాలను కల్పించింది. అయితే, చంద్రబాబు హయాంతో రాష్ట్రానికొచ్చిన కియా మోటర్స్.... జగన్ ప్రభుత్వం వచ్చాక కొన్ని ఇబ్బందులను ఎదుర్కొందనే ఆరోపణలు వినిపించాయి. అందుకు రుజువుగా, అసెంబ్లీ సాక్షిగా కియాకి చంద్రబాబు కల్పించిన రాయితీలు, సౌకర్యాలపై మంత్రి బుగ్గన తప్పుబట్టారు. దాంతో, కియా మోటార్స్ తో జగన్ ప్రభుత్వానికి సఖ్యత లేదనే మాటలు వినిపించాయి. ఇఫ్పుడు, రాయిటర్స్ కథనంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక టీడీపీ నేతలైతే జగన్ సర్కార్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ వంటి వారైతే.. ఏపీ ప్రజలు ఏం తప్పు చేశారని ఈ శిక్ష అనుభవించాలి, ఏపీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారంటూ.. తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

అయితే, రాయిటర్స్ కథనాన్ని ఏపీ అధికారులు ఖండిస్తున్నారు. కియా మోటార్స్ తరలిపోతుందంటూ రాయిటర్స్ రాసిన కథనం పూర్తిగా అవాస్తవమంటున్నారు. కియా మోటార్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని ఏపీ ఇండస్ట్రీస్ సెక్రటరీ రజత్ భార్గవ చెబుతున్నారు. వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కూడా రాయిటర్స్ కథనాన్ని ఖండించారు. ఏపీ నుండి కియా తరలిపోతుందన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. సీఎం జగన్ కియాతో సంఖ్యతగా ఉన్నారని, రాష్ట్రంలో కియా అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తారని విజయసాయి చెప్పుకొచ్చారు. అసలు రాయిటర్స్ లాంటి సంస్థ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఏంటని అధికార పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కియా తరలిపోతుందన్న అసత్య ప్రచారంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తుండటంతో.. అటు అధికారులు, ఇటు అధికార పార్టీ నేతలు.. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ.. నష్టనివారణ చర్యలు చేపట్టారు. అయితే, రాయిటర్స్ కథనంపై కియా మోటార్స్ స్పందించాల్సి ఉంది. అలాగే, ఏపీ నుంచి ప్లాంట్ ను తరలించే ఉద్దేశం లేదని ప్రకటన విడుదల చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. లేదంటే అనుమానాలు కంటిన్యూ కావడం ఖాయం.