Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాక్రోచ్ జనతా పార్టీ.. ఎజెండా హిందుత్వ వ్యతిరేకతేనా?
posted on: Jun 9, 2026 2:44PM

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్ట ’ అనే సెటైరికల్ వెబ్‌సైట్ తెగ వైరల్ అవుతుంది. ఈ వెబ్‌సైట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 66 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ వెబ్‌సైట్ ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, షార్ట్ వీడియోలతో సహా సుమారు 50 పోస్ట్‌లను షేర్ చేసింది. తమను తాము ..యువత యొక్క, యువత చేత, యువత కోసం.. ఉద్భవించిన రాజకీయ వేదికగా ప్రకటించుకుంది. ఈ వెబ్‌సైట్ సృష్టికర్త అభిజీత్ దీప్కే అనే వ్యక్తి తనను కాక్రోచ్ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ ఫేక్ ప్రొఫెషనల్ ధృవపత్రాల కేసు విచారణ సందర్భంగా మే 15, 2026న పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొందరు యువత బొద్దింకలు వంటి వారు. వారికి ఎలాంటి ఉపాధి లభించదు. ఏ వృత్తిలోనూ వారికి స్థానం ఉండదు. వీరిలో కొందరు మీడియాగా, మరికొందరు సోషల్ మీడియా కార్యకర్తలుగా, ఆర్టీఐ, ఇతర కార్యకర్తలుగా మారి అందరిపై దాడి చేస్తుంటారు అని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు గంటల వ్యవధిలో వైరల్ అయ్యాయి. నిజానికి.. సుప్రీం కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు న్యాయ, మీడియా వంటి వృత్తులలోకి ప్రవేశించడానికి ఫేక్ డిగ్రీలను ఉపయోగిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఉద్దేశించి మాత్రమే చేశారు. నిరుద్యోగ యువతను ఉద్దేశించి తాము ఈ వ్యాఖ్యలు చేయలేదని కూడా చీఫ్ జస్టీస్ ఆ తర్వాత స్పష్టం చేశారు. కానీ అప్పటికే ఆలస్యమైది. సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే నెట్టింట కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీ ఆవిర్భవించింది.
అలా సోషల్ మీడియా నుండి అకస్మాత్తుగా ఉద్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ, తనను తాను దేశ యువత గొంతుకగా, వ్యవస్థాగత మార్పుకు ప్రతీకగా చిత్రీకరించుకుంటోంది. అయితే, దాని నాయకత్వం, అధికార ప్రతినిధులు, మద్దతుదారులకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఇది నిజంగా యువజన ఉద్యమమా, లేక వామపక్ష, నక్సల్ సానుభూతి, భారత్ వ్యతిరేక కథనాలకు కొత్త రూపు ఇచ్చే వ్యవస్థీకృత ప్రయత్నమా? అన్న చర్చ జరుగుతోంది.
ఈ నెల 6న జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనను ప్రకటించడం ద్వారా సీజేపీ వీధి రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ, ఈ ఉద్యమం వెనుక ఉన్న వ్యక్తుల గత చరిత్ర, బహిరంగ ప్రకటనలు చూస్తే, ఇది నిరుద్యోగం లేదా విద్యా సంస్కరణల వంటి సమస్యలను పరిష్కరించడం కంటే, ఒక సైద్ధాంతిక ఎజెండాను ముందుకు తీసుకెళ్లే వేదికగానే ఎక్కువగా ఉపయోగపడుతుందని సూచిస్తున్నాయి.
సీజేపీ అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ చుట్టూనే అతిపెద్ద వివాదం అలుముకుంది. పార్టీ అతడిని తమ కీలక నాయకులలో ఒకరిగా నిలబెట్టినప్పటికీ, అతని గత ప్రకటనలు, రచనలు వివాదాస్పదమవుతున్నాయి. ఢిల్లీలో కాలుష్య నివారణ నిరసనల సందర్భంగా మావోయిస్టు కమాండర్ మాడ్వీ హిద్మా కు మద్దతుగా చేసిన నినాదాలను దాస్ సమర్థించారు.
ఎంతమంది హిద్మాలను చంపుతారు? ప్రతి ఇంటి నుంచి ఒక హిద్మా ఉద్భవిస్తాడు వంటి నినాదాలపై జాతీయ భద్రతా సంస్థలు, పోలీసులు చర్యలు తీసుకున్నప్పుడు, దాస్ నిరసనకారుల పక్షాన నిలిచారు. గత రెండు దశాబ్దాలుగా దేశ భద్రతా దళాలు మావోయిస్టులపై పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఒక రాజకీయ సంస్థ అధికార ప్రతినిధి ఇటువంటి నినాదాలకు మద్దతు ఇస్తుండటంతో, వారి సిద్ధాంతంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా.. జి.ఎన్. సాయిబాబా మరణానంతరం, దాస్ ఆయనను ఒక ధైర్యవంతుడు గా అభివర్ణించారు. మావోయిస్టు సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై సాయిబాబా దోషిగా నిరూపితులయ్యారు. ఢిల్లీ అల్లర్లు, సంబంధిత దర్యాప్తులలో పేర్లు వెలుగులోకి వచ్చిన వ్యక్తులకు సౌరభ్ దాస్ మద్దతుగా నిలిచారు. ఉమర్ ఖాలిద్ నిర్బంధం విషయంలో ఆయన న్యాయవ్యవస్థను, దర్యాప్తు సంస్థలను పదేపదే విమర్శించారు. అదేవిధంగా, ఆయన గుల్ఫిషా ఫాతిమా విషయాన్ని నిరంతరం లేవనెత్తారు. ఒక రకంగా చెప్పాలంటే, జాతీయ భద్రత, మత హింస, లేదా తీవ్రవాద రాజకీయ కార్యకలాపాలకు సంబంధించిన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు దాస్ మద్దతుగా నిలిచినట్లు ఆయన ప్రస్థానం స్పష్టం చేస్తోంది.
సౌరభ్ దాస్ బహిరంగ ప్రకటనలు నక్సలిజం, ఢిల్లీ అల్లర్లకు మాత్రమే పరిమితం కాలేదు. రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం అనంతరం, ఇతర వివాదాస్పద మతపరమైన ప్రదేశాల విషయంలో హిందూ పక్షం చేసిన డిమాండ్లను ఆయన వ్యతిరేకించారు. చారిత్రక వివాదాలకు ప్రస్తుత తరం ముస్లింలను బాధ్యులుగా చేయడాన్ని ఆయన అభ్యంతరం తెలిపారు.
మొత్తానికి కాక్రోచ్ పార్టీ ఉద్భవించక ముందు నుంచే ఆ పార్టీ నాయకులుగా ఫోకస్ అవుతున్న వారు హిందూత్వ వ్యతిరేక వాదాన్ని ప్రోత్సహిస్తున్నారని స్పష్టమవుతోంది. సీజేపీ మద్దతుదారులలో ప్రకాష్ రాజ్, ప్రశాంత్ భూషణ్, సోనమ్ వాంగ్చుక్, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు. వీరిలో చాలామంది గతంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించినవారే. ప్రశాంత్ భూషణ్ సీజేపీని బహిరంగంగా నిజమైన జెన్-జెడ్ ఉద్యమం గా అభివ ర్ణించగా, ప్రకాష్ రాజ్ ఈ ఉద్యమంలో చేరాలని యువతకు పిలుపునిచ్చారు. దాంతో కాక్రోచ్ పార్టీ నిజంగా ఒక ఆకస్మిక యువజన ఉద్యమమే అయితే.. అలాంటి పొలిటీషియన్లు దానికి ఎందుకు పబ్లిసిటీ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. సీజేపీ తనను తాను ఒక సంప్రదాయేతర, పక్షపాతరహిత ఉద్య మంగా అభివర్ణించుకుంటున్నప్పటికీ.. ఢిల్లీలోని కాన్సిటిట్యూషన్ క్లబ్‌లో జరిగిన పత్రికా సమావేశానికి ఒక ప్రతిపక్ష ఎంపీ ఎందుకు సిఫార్సు చేశారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు లబ్ధి చేకూర్చడం, తెరవెనుక నుండి పరోక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీ కి మద్దతు ఇవ్వడమే ఈ ఉద్యమం అసలు లక్ష్యమని సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఈ కాక్రోచ్ ఉద్యమానికి అంతర్జాతీయ మీడియా నుండి లభిస్తున్న మద్దతు మరింత ఆలోచింప చేస్తోంది. టర్కీ ప్రభుత్వ ఆధీనంలోని మీడియా సంస్థ, టీఆర్టీ వరల్డ్, సీజేపీని భారతదేశంలో ఉద్భవిస్తున్న యువ విప్లవంగా చిత్రీకరించింది. ఇదే టర్కీ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. యూరప్, అమెరికాలోని కొన్ని మీడియా సంస్థలు కాక్రోచ్ పార్టీని యువత అసంతృప్తి గొంతుకగా చిత్రీకరిస్తున్నాయి. భారత్ వ్యతిరేక మీడియాలన్నీ ఆ ఉద్యమానికి అండగా నిలుస్తుండటం చూస్తుంటే కాక్రోచ్ జనతాపార్టీ సడన్‌గా పుట్టిన ఉద్యమం కాదని, రాజకీయ కుట్రలో భాగమన్న సంకేతాలు స్ఫష్టమవుతున్నాయి.
నిజంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే నిజమైన లక్ష్యమై ఉంటే, ఆ సంస్థ విద్య, ఉపాధి, ఆర్థిక సంస్కరణలు, పరిపాలనా జవాబుదారీతనంపై స్పందించాలి. కాని వివాదాస్పద వ్యక్తులకు మద్దతివ్వడం, రెచ్చగొట్టే ప్రకటనలే దాని ఎజెండాలు కనిపిస్తుండటంతో అనుమానపు నీడలు కమ్ముకుంటున్నాయి.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






