కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు రూ. లక్ష కోట్ల పైనే.. కేంద్ర జలశక్తి మంత్రి

posted on: Mar 31, 2026 3:18PM

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా  కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని విస్పష్టంగా పేర్కొంది. కాళేశ్వరంలో జరిగిన అక్రమాల విలువ దాదాపు లక్ష కోట్ల రూపాయల పైమాటేనని సంచలన ప్రకటన చేసింది.  కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాజ్యసభ వేదికగా చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 

కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పార్లమెంటులోని తన కార్యాలయంలో బీజేపీ సభ్యులతో భేటీ అయిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు.  అవినీతి, అక్రమాలకు తోడు  సాంకేతిక కారణాలను కూడా  ప్రాజెక్టు వైఫల్యానికి కారణాలని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక, డిజైన్, లోపభూయిష్టమైన నిర్మాణ ప్రక్రియ కారణంగానే ఆ ప్రాజెక్టు ఈ దుస్థితికి చేరిందని కేంద్ర మంత్రి కుండబద్దలు కొట్టారు.  

గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టును అప్పట్లో  అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు జీవనాడిగా అభివర్ణించారు. అయితే బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే   ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడం, లీకేజీలు బయటపడటంతో దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర జలశక్తి శాఖకు చెందిన ఉన్నతాధికారులు సైతం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ప్రాజెక్టు వైఫల్యం కూడా గత ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. సరే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత దీనిపై దర్యాప్తునకు ఆదేశించింది. అది వేరే సంగతి. ఇక ఇప్పుడు తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయని ధృవీకరించినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలను ప్రస్తావిస్తూ ప్రజాధనాన్ని ఈ రీతిన అడ్డగోలుగా దుర్వినియోగించడం ప్రజా ద్రోహమనీ, క్షమించరాని నేరమనీ కూడా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అన్నారు. 

అదలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువదీరిన తరువాత సీఎం  రేవంత్ రెడ్డి   సర్కార్ ఈ ప్రాజెక్టుపై విచారణను వేగవంతం చేసింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇప్పటికే సుదీర్ఘ విచారణ జరిపి, బాధ్యులైన వారిపై నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది.  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా గత ప్రభుత్వ హయాంలో నీటి పారుదల శాఖను నిర్వహించిన కీలక నేతలను కూడా ఈ కమిషన్ విచారించింది.   ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నేరుగా లక్ష కోట్ల అవినీతి అని పేర్కొనడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో కాళేశ్వరం అక్రమాలపై కేంద్రం చర్యలకు ఉపక్రమిస్తున్నదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...