అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గిన ఇరాక్.. కొత్త ప్రధానిగా తటస్థుడు అలీ అల్ జైదీ

posted on: Apr 28, 2026 4:50PM

 ఇరాక్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా సాగుతున్న రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరదించుతూ ఆ దేశ నూతన అధ్యక్షుడు నిజార్ అమేదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, బ్యాంకర్ అయిన 40 ఏళ్ల అలీ అల్ జైదీని ఇరాక్ ప్రధాన మంత్రిగా నామినేట్ చేశారు. అమెరికా నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి నేపథ్యంలోనే అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమౌతోంది.

ముందుగా ఇరాక్ పార్లమెంటరీ కూటమి  కోఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్ మాజీ ప్రధాని నూరి అల్ మాలికిని ఆ పదవిలో కూర్చోబెట్టాలని భావించింది. అయితే, మాలికికి ఇరాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకవేళ ఇరాన్ అనుకూల నేతను ప్రధానిని చేస్తే..  ఇరాక్‌కు అందిస్తున్న అన్ని రకాల ఆర్థిక, సైనిక సహకారాలను నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో అగ్రరాజ్యం ఆగ్రహానికి గురికావడం ఇష్టం లేక ఇరాక్ అగ్రనేతలు దిగివచ్చారు. 

అలీ అల్ జైదీకి రాజకీయాల్లో ఎటువంటి పూర్వ అనుభవం లేదు. ఇరాక్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. వృత్తిరీత్యా బ్యాంకర్, సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్ అయిన జైదీకి ఒక టీవీ ఛానెల్ కూడా ఉంది. ఎటువంటి వివాదాలు లేని వ్యక్తిగా పేరున్న జైదీని ఎంపిక చేయడం ద్వారా అటు అమెరికాను, ఇటు దేశీయ అవసరాలను సమతుల్యం చేయవచ్చని అధ్యక్షుడు అమేదీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. 

రాజ్యాంగ నిబంధనల ప్రకారం, అలీ అల్ జైదీకి తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి 30 రోజుల గడువు ఉంది. అయితే ఆయన బాధ్యతలు చేపట్టగానే అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా ఇరాక్‌లో క్రియాశీలకంగా ఉన్న ఇరాన్ మద్దతు గల గ్రూపులను అదుపు చేయాలని వాషింగ్టన్ డిమాండ్ చేస్తోంది. దీనిని జైదీ ఏ విధంగా డీల్ చేస్తారనేది చూడాల్సి ఉంది. 

మరోవైపు, దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. హార్మూజ్ జలసంధిలో ఏర్పడిన ఉద్రిక్తతల వల్ల చమురు ఎగుమతులు దెబ్బతిని ఆదాయం పడిపోయింది. చమురుపైనే 90 శాతం ఆధారపడిన ఇరాక్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం జైదీకి అగ్నిపరీక్షే అని చెప్పాలి. గల్ఫ్ దేశాలతో సంబంధాలను పునరుద్ధరిస్తూనే, అగ్రరాజ్యాల మధ్య సమతుల్యతను కాపాడుకుంటూ ఆయన దేశాన్ని ఎలా ముందుకు నడిపిస్తారన్నది ప్రశ్నార్థకమే. 

google-ad-img
    Related Sigment News
    • Loading...