ఇరాక్‌లో మరో దారుణ ఘటన

 

బిన్ లాడెన్ మరణంతో తాలిబాన్ ఉగ్రవాదుల ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోందని అందరూ సంతోషిస్తుంటే అంతకంటే క్రూరమయిన ఐ.యస్. (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాద సంస్థ మరొకటి పుట్టుకొచ్చింది. అది చేస్తున్న దారుణ మారణహోమం చాలా వరకు బయట ప్రపంచానికి తెలియడం లేదు. ఇరాక్, సిరియా దేశాల ప్రజలు దాని దురాఘతాలకి మౌనంగా బలయిపోతున్నారు. తాలిబాన్ ఉగ్రవాదులు పెషావర్ లో 148 మంది విద్యార్ధులను అతికిరాతకంగా హతమార్చిన సంఘటనతో యావత్ ప్రపంచం కలవరపడుతుంటే, ఈ ఐ.యస్. ఉగ్రవాద సంస్థ అంతకంటే దారుణమయిన ఘాతుకానికి పాల్పడిన విషయం కొంత ఆలశ్యంగా బయటపడింది.

 

ఇరాక్ పశ్చిమ ప్రాంతంలో ఈ ఐ.యస్.ఉగ్రవాదులు 150 మంది మహిళలను, 91 మంది పురుషులు, అతి కిరాతకం కాల్చి చంపి ఫల్లూజా అనే ప్రాంతంలో వారినందరినీ సామూహిక ఖననం చేసేసారని ఇరాక్‌ మానవ హక్కుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చనిపోయిన వారిలో గర్భిణులు, అభం శుభం తెలియని చిన్నారులు కూడా చాలా మంది ఉన్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. వారిని చంపడానికి కారణం ఆ మహిళలు వారిని పెళ్లి చేసుకొనేందుకు ఇష్టపడకపోవడమేనట. ఐ.యస్.ఉగ్రవాదులు మొత్తం 241మందిని కాల్చి చంపారని ఇరాక్ ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. ఇరాక్‌లోని అల్‌ అన్బర్‌ అనే ప్రాంతంలో ఐ.యస్. ఉగ్రవాదుల నాయకుడు అబూ అనాస్‌ అలి లిబి నేతృత్వంలో ఈ దారుణం జరిగినట్టు తెలుస్తోంది. ఇటువంటి మారణ హోమాలు అక్కడ ఇంకా ఎన్నిజరుగుతున్నాయో ఎందరు బలయిపోతున్నారో వాటిని ఎవరు అడ్డుకొని అమాయకులయిన ప్రజలను కాపాడుతారో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు మనిషికి నాగరికత తెలియని రోజుల్లో కూడా బహుశః ఇటువంటి దారుణాలు జరిగి ఉండవేమో. కానీ నాగరికత నేర్చిన మానవుడు మతం పేరుతో ఇటువంటి దారుణాలకు పాల్పడుతుండటం, వాటిని ప్రపంచదేశాలు నిస్సహాయంగా చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోవడం మానవజాతి సమస్తం సిగ్గుతో తలదించుకోవలసిన విషయం.