Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి.. మళ్లీ పెచ్చరిల్లిన ఉద్రిక్తతలు
posted on: Jun 8, 2026 9:21AM

పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకుమళ్లీ బ్రేక్ పడింది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన చారిత్రాత్మక కాల్పుల విరమణ ఒప్పందాన్నిఉల్లంఘిస్తూ.. ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడింది. ఆదివారం (జూన్ 7) సాయంత్రం ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు. అయితే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సకాలంలో స్పందించి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకోవడంతో ముప్పు తప్పింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు.
క్షిపణి దాడులకు కొన్ని గంటల ముందే లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాల్లోని హిజ్బుల్లా సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దళాలు భీకర వైమానిక దాడులు జరిపాయి. ఈ ఘోర వైమానిక దాడుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 20 మంది గాయపడ్డారని లెబనాన్ అధికారిక వర్గాలు ధృవీకరించాయి. బీరుట్‌పై గనుక ఇజ్రాయెల్ దాడులకు తెగబడితే తాము చూస్తూ ఊరుకోబోమని.. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ గతంలోనే తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన సంగతి విదితమే.
ఈ భారీ క్షిపణి దాడికి తామే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఇరాన్‌కు చెందిన శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్‌జీసీ అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా.. రాబోయే వారం రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగే దాడుల పరంపరకు ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని హెచ్చరించింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ తన దూకుడు చర్యలను తక్షణమే నిలిపివేయకుంటే.. భవిష్యత్తులో మరింత తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఐఆర్‌జీసీ వార్నింగ్ ఇచ్చింది. ఈ పరిణామాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ స్పందిస్తూ.. ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసిందనీ, ఇందుకు ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించారు.
అన్నట్టుగానే, ఇరాన్ దాడులు జరిగిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రతిదాడులు ప్రారంభించాయి. పశ్చిమ, మధ్య ఇరాన్‌లోని టెహ్రాన్ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు కీలక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో ఇరాన్‌లోని అనేక నగరాల్లో భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఇరాక్, సిరియా దేశాలు తమ గగనతలాలను తాత్కాలికంగా మూసివేశాయి. ఇరాన్ సైతం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమైనీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే అన్ని విమాన సర్వీసులను రద్దు చేసింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడి, తదుపరి ప్రతీకార దాడులకు స్వస్తి చెప్పి దౌత్య మార్గాల ద్వారా శాంతికి ప్రయత్నించాలని సూచించారు. ఈ తాజా ఉద్రిక్తతల ప్రభావంతో సోమవారం ఉదయం ఆసియా మార్కెట్లలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.


.webp)
.webp)


