యుద్ధం పూర్తిగా ట్రంప్ తప్పిదమే.. సీఐఏ మాజీ డైరెక్టర్

posted on: Mar 23, 2026 8:35AM

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడానికి పూర్తి కారణం అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంపేనా అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. అది కూడా అమెరికా వ్యతిరేక దేశాల నుంచి  కాదు.. స్వయంగా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న అమెరికాలోనే యుద్ధానికి కారణం ట్రంపే నంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఇరాన్ యుద్ధం పూర్తిగా ట్రంప్ తప్పిదమేననీ, ఆయన మూర్ఖత్వం, దుందుడుకు తీరు, దూకుడుగా తీసుకున్న నిర్ణయాల వల్లే ఇరాన్ యుద్ధం సంభవించిందని  అమెరికా కేంద్ర నిఘా ఏజెన్సీ (సీఐఏ)  మాజీ డైరెక్టర్ కుండబద్దలు కొట్టేశారు. ట్రంప్ కారణంగానే ఇప్పుడు అమెరికా బయటకు రాలేనంత లోతుగా ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు.

ఇరాన్ ఆయుధ సంపత్తిని, శక్తిసామర్థ్యాలనూ, ప్రతిఘటనా పాటవాన్ని అంచనా వేయడంలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని సీఐఏ మాజీ చీఫ్ పేర్కొన్నారు.  ట్రంప్   ఏకపక్ష నిర్ణయాలు అమెరికా ప్రతిష్ఠను దిగజార్చడమే కాకుండా, అగ్రరాజ్యం అన్ని రకాలుగానూ సంక్షోభంలో కూరుకుపోయేలా చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  చర్చలతో పరిష్కార మార్గాలను విస్మరించి.. యుద్ధ కాంక్షతో అగ్రరాజ్యాధినేత వ్యవహరించడం వల్లనే ఇప్పుడీ పరిస్థితి వచ్చిందన్నారు.   ఇరాన్ అణు విద్యుత్ కేంద్రాలపై కనుక దాడి చేస్తే, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తులే లక్ష్యంగా ఇరాన్ ప్రతిదాడులకు దిగుతుందని హెచ్చరించారు. ఇరాన్ హెచ్చరికను పట్టించుకోకుంటే.. అమెరికా భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. 

ఇప్పటికే హర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమౌతోందన్న సీఐఏ మాజీ చీఫ్  ట్రంప్ నిర్వాకం వల్ల అమెరికా మిత్రదేశాల మద్దతును సైతం కోల్పోతోందనీ, ఇదే పరిస్థితి కొనసాగితే అగ్రరాజ్య హోదా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాగా సీఐఏ మాజీ చీఫ్ హెచ్చరికలపై అమెరికా స్పందన తెలియాల్సి ఉంది.  ఇక ట్రంప్ తీరును, యుద్ధ కాంక్షను డెమొక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా యుద్ధంపై కాంగ్రెస్‌లో చర్చకు డిమాండ్ చేస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...