ఇరాన్ యుద్ధం, అమెరికా రక్షణ సామర్థ్యం.. ఒక విశ్లేష‌ణ‌

posted on: Jun 1, 2026 11:33AM

ఆధునిక యుద్ధ తంత్రంలో కేవలం వీరత్వం సరిపోదు, అంతులేని ఆయుధ సంపత్తి కూడా అవసరం. ఇరాన్‌తో జరిగిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సంఘర్షణ, అమెరికా రక్షణ వ్యవస్థలోని ఒక చేదు నిజాన్ని ప్రపంచం ముందుంచింది.  దశాబ్దాలుగా నమ్మకమైన రక్షణ కవచంగా ఉన్న అమెరికా అమ్ములపొది, నేడు ఖాళీ అయ్యే స్థితికి చేరుకుంది. అత్యాధునిక సాంకేతికతను సొంతం చేసుకున్నప్పటికీ, ఆ ఆయుధాలను యుద్ధరంగంలో నిరంతరాయంగా భర్తీ చేసే తయారీ సామర్థ్యం విషయంలో.. అమెరికా తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది.

1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత, అమెరికా రక్షణ వ్యూహకర్తలు ఒక పొరపాటు అంచనాకు వచ్చారు. భవిష్యత్తు యుద్ధాలు స్వల్పకాలికంగా, ప్రాంతీయంగానే ఉంటాయని, అందువల్ల భారీ ఆయుధ నిల్వలు అవసరం లేదని భావించారు. ఈ తప్పుడు అంచనానే పెంటగాన్ ఆయుధాల కొనుగోలులో కోత విధించడానికి దారితీసింది. అయితే, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, తాజాగా ఇరాన్‌తో జరిగిన సంఘర్షణలు - యుద్ధాలు సుదీర్ఘంగా సాగుతాయని, భారీ స్థాయిలో అధునాతన మందుగుండు సామాగ్రి అవసరమనే సంకేతాన్నిస్తున్నాయి.

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ.. యుద్ధ నష్టం - గణాంకాలు ఎలాంటివో చూస్తే.. ఈ సంఘర్షణ అమెరికాకు కేవలం భౌగోళిక రాజకీయ సవాలే కాదు, ఆర్థికంగా, సైనికంగా భారీ దెబ్బను మిగిల్చింది. నివేదికల ప్రకారం.. చూస్తే..

మొద‌ట ధ్వంసమైన విమానాల విష‌యానికి వ‌స్తే, ఎఫ్-35, ఎఫ్-15ఈ, ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు, కేసీ-135 ట్యాంకర్లు, ఏడబ్ల్యూఏసీఎస్ నిఘా విమానాలతో కలిపి మొత్తం 42 విమానాలు దెబ్బతిన్నాయి.

ఇక ఆర్ధిక న‌ష్టం సంగ‌తి చూస్తే. సుమారు 29 బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఒక‌ అంచనా.
ఆయుధాల కొరత విష‌యానికి వ‌స్తే..  సమయమే అతిపెద్ద శత్రువుగా  భావిస్తున్నారు. 

ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య  డబ్బు కాదు, సమయం. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు 1.5 ట్రిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్‌ను కేటాయించినప్పటికీ, క్లిష్టమైన ఆయుధ వ్యవస్థల తయారీకి ఏళ్లు పడుతోంది.

టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులు.. యుద్ధంలో వెయ్యి కంటే ఎక్కువ వాడారు. ఈ విష‌యంలో గ‌త‌కాల‌పు నిల్వలకు చేరుకోవడానికి 2030వ సంవ‌త్స‌రం వరకు పట్టవచ్చు.

THAAD ఇంటర్‌సెప్టర్లు సంగ‌తి చూస్తే వీటిని సుమారు 290 వ‌ర‌కూ వాడారు. వీటి భర్తీ 2029 చివరి వరకు పట్టవచ్చు. 

పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్లు- వెయ్యి కంటే ఎక్కువ భర్తీ చేయడానికి 2029 మధ్య వరకు సమయం ప‌ట్టొచ్చు.

ఫైన‌ల్ గా రాజకీయాలు, వ్యూహాత్మక కోణాల విష‌యానికి వ‌స్తే.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2027 నాటికి తైవాన్ అంశంపై చేస్తున్న హెచ్చరికలు, అమెరికా రక్షణ వ్యూహకర్తలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఒకవైపు ఉక్రెయిన్‌ను రక్షించడం, మరోవైపు తమ సొంత నిల్వలను పెంచుకోవడం, ఇంకోవైపు 17 దేశాలకు పేట్రియాట్ వ్యవస్థలను సరఫరా చేయడం - ఈ మూడు బాధ్యతల మధ్య అమెరికా స‌త‌మ‌త‌మ‌వుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, రక్షణ కాంట్రాక్టర్లపై ఉత్పత్తిని రెట్టింపు చేయాలని ఒత్తిడి తెస్తున్నప్పటికీ, పారిశ్రామిక పరిమితులు అడ్డంకిగా మారుతున్నాయి. 

ఈ నివేదికలు అమెరికా సైనిక సంసిద్ధతపై అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి. రక్షణ కాంట్రాక్టర్లు అయిన రేథియాన్, లాక్‌హీడ్ మార్టిన్ భారీ పెట్టుబడులు పెడుతున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆయుధాల కొరత అమెరికా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ప్రశ్నార్థకం చేస్తోంది. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో చైనాతో ఏవైనా ఘర్షణలు తలెత్తితే, ఈ బలహీనతలు అమెరికాకు శాపంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.     

google-ad-img
    Related Sigment News
    • Loading...