Latest News
కిందపడ్డా పై చేయి మాదే అంటే ఎలా సారూ.. ట్రంప్ కు ఇరాన్ షాక్
posted on: Mar 26, 2026 9:01AM

ఓటమిని విజయంగా చిత్రీకరించుకునేందుకు అగ్రరాజ్యం ప్రయత్నిస్తోందంటూ ఇరాన్ ఎద్దేవా చేసింది. తాజా యుద్ధ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ చేసిన ఐదు రోజుల యుద్ధ విరామ ప్రకటనను, 15 సూత్రాల శాంతి ప్రణాళికను ఎద్దేవా చేస్తూ ఇరాన్ అమెరికాది ద్వంద్వ నీతి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.
ఘోర ఓటమిని దౌత్య విజయం(డిప్లమాటిక్ సక్సెస్)గా కలర్ ఇస్తోందని దుయ్యబట్టింది. అమెరికా తన అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలతో ఇరాన్ దాడులను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమైందనీ, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి శాంతి చర్చలు, దౌత్య విజయం అంటూ కొత్త నాటకానికి తెర లేపిందని ఇరాన్ సైనిక ప్రతినిధి ఎండగట్టారు. ఇరాన్ ప్రయోగించిన అత్యంత వేగవంతమైన క్షిపణులు అమెరికా రక్షణ కవచాలను ఛేదించి మరీ లక్ష్యాలను తాకాయనీ, దీంతో అమెరికా డిఫెన్స్ లో పడిందనీ ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దేశాల ముందు పరువు కాపాడుకోవడానికి ట్రంప్.. ఈ ఘోరపరాభవాన్ని, పరాజయాన్ని ఒక విజయంగా చెప్పుకోవడానికి నానా తంటాలూ పడుతోందన్నారు.
హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా యుద్ధ నౌకల వెనకడుగును, తమ ఎఫ్-35 విమానాల వైఫల్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
అమెరికా ఒకవైపు శాంతి ప్రణాళికలను పంపిస్తూనే, మరోవైపు ఇజ్రాయెల్‌కు ఆయుధాలను సరఫరా చేస్తోందని ఆరోపించారు. ఈ ద్వంద్వ వైఖరిని తాము సహించబోమని, తమ సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమెరికా తన అబద్ధపు ప్రచారాలను ఆపకపోతే, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగి అమెరికా ఉనికికే ముప్పు తప్పదని హెచ్చరించారు.
అదలా ఉంటే.. అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణితో దాడులు చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ ససాక్ష్యంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ విడుదల చేసింది. అయితే ఈ దాడిని అమెరికా ఇంకా ధృవీకరించాల్సి ఉంది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌక కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నానమీ, ఆ నౌక లక్ష్యంగా దాడులు చేస్తామని ప్రకటించిన గంట వ్యవధిలోనే ఇరాన్ దాడి చేయడం గమనార్హం. ఇరాన్ దాడిలో యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహన నౌక బాగా దెబ్బతిందని కూడా ఇరాన్ ఆ ప్రకటనలో పేర్కొంది.
అదలా ఉంటే.. యుద్ధ విరమణ అంటూ అమెరికా చేసిన దౌత్య ప్రయత్నాలకు ఇరాన్ హెచ్చరిక గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. కాల్పుల విరమణ కోసం అమెరికా పంపిన 15 సూత్రాల ప్రతిపాదనను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. పాకిస్థాన్, ఈజిప్టుల మధ్యవర్తిత్వంతో అమెరికా తన శాంతి ప్రణాళికను ఇరాన్ కు పంపింది. అయితే ఇరాన్ మాత్రం యుద్ధం ఎప్పుడు, ఎలా ముగించాలో తానే నిర్ణయించుకుంటానని స్పష్టం చేసింది. ఇరాన్ శాంతి ప్రణాళిక మోసపూరితమనీ, తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించేదిలా ఉందనీ కుండబద్దలు కొట్టింది.
అంతే కాదు.. అమెరికాకు నిజంగా శాంతి కావాలనుకుంటే.. తమ షరతులకు అంగీకరించాలని పేర్కొంది. యుద్ధ విరమణకు ఇరాన్ ఐదు షరతులు విధించింది. ఇరాన్ పై దాడులను పూర్తిగా నిలిపివేయాలనీ, అలాగే యుద్ధం పునరావృతం కాదన్న స్పష్టమైన హామీ ఇవ్వాలనీ, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని, హార్ముజ్ జలసంధిపై తమ సార్వభౌమత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలన్న డిమాండ్లను అమెరికా ముందు ఉంచింది. అంతే కాకుండా, దౌత్యపరంగా చర్చలు జరుగుతున్న సమయంలో కూడా తాము దాడులను ఆపేది లేదని విస్ఫష్టంగా తేల్చి చెప్పింది.


.webp)



