Latest News
చమురు సంక్షోభం....క్రూడ్ ఆయిల్ ధరలపై తీవ్ర ప్రభావం
posted on: Mar 10, 2026 2:45PM

అమెరికా–ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లలో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ సరఫరాపై ప్రభావం పడే అవకాశాలు కనిపించడంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సాయంత్రం G7 దేశాల ఎనర్జీ మంత్రులు అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా తలెత్తే ఇంధన సంక్షోభంపై చర్చించి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ ప్రభావం అనేక దేశాల్లో ఇంధన ధరల పెరుగుదల రూపంలో కనిపిస్తోంది. ఈజిప్ట్‌లో ఇంధన ధరలను సుమారు 30 శాతం వరకు పెంచారు. మరోవైపు శ్రీలంక ప్రభుత్వం కూడా అర్ధరాత్రి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. ఆక్టేన్ 92 పెట్రోల్‌పై రూ.24 పెంచడంతో లీటర్ ధర రూ.317కి చేరింది. ఆక్టేన్ 95 పెట్రోల్‌పై రూ.25 పెరిగి రూ.365గా మారింది. ఆటో డీజిల్ రూ.22 పెరిగి రూ.303 కాగా, సూపర్ డీజిల్ రూ.24 పెరిగి రూ.353కి చేరింది. కిరోసిన్ ధర కూడా రూ.13 పెరిగి లీటర్‌కు రూ.195గా నిర్ణయించారు.
పాకిస్థాన్ కూడా ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. లీటర్‌కు రూ.55 వరకు పెంపు చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మండిపోతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలపై భారీ భారం పడే పరిస్థితి ఏర్పడుతోంది. అయితే మరోవైపు చైనా మాత్రం ఈ చమురు సంక్షోభంపై పెద్దగా ఆందోళన చెందట్లేదు.
కారణం ఇరాన్ నుంచి సుమారు 90 శాతం ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం మాత్రమే కాకుండా, ఇప్పటికే 1.4 బిలియన్ బ్యారెళ్ల అత్యవసర చమురు నిల్వలను సిద్ధంగా ఉంచుకోవడమే. అంతేకాదు చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరగడంతో చమురుపై ఆధారపడటం కూడా తగ్గింది. ఒకవేళ గల్ఫ్ దేశాల నుంచి సరఫరా అంతరాయం కలిగినా రష్యా నుంచి దిగుమతులను పెంచుకునే అవకాశముండటంతో ఈ సంక్షోభాన్ని తట్టుకునే స్థితిలో చైనా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.



.webp)


