Latest News

అమెరికా అవాక్స్ విమానాన్ని పేల్చేసిన ఇరాన్

posted on: Mar 30, 2026 9:30AM

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసి అమెరికా సైనిక ఆస్తులను ధ్వంసం చేసింది. ఈ దాడిలో అమెరికా వాయుసేనకు చెందిన అత్యంత కీలకమైన ఈ-3 సెంట్రీ  అవాక్స్ నిఘా విమానం పూర్తిగా దెబ్బతింది. ఆ విషయాన్ని ఇరాన్  అధికారికంగా ప్రకటించి, ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేసింది. అమెరికా అవాక్స్ విమానం ధ్వంసానికి సంబంధించిన ఫొటోలను ఇరాన్ అధికారిక మీడియా ప్రెస్ టీవీ విడుదల చేసింది.

శుక్రవారం (మార్చి 27)  జరిగిన ఈ దాడిలో   6 బాలిస్టిక్ క్షిపణులు, 29 డ్రోన్లను ఇరాన్ విడుదల చేసింది. ఇరాన్ విడుదల చేసిన ఫొటోలలో ఈ-3 సెంట్రీ విమానం మధ్య భాగం కాలిపోయి, తల, తోక భాగాలు మాత్రమే మిగిలి ఉన్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది.  గగనతలం నుంచి నిఘా, శత్రువుల కదలికలను పసిగట్టడంలో ఈ విమానం అమెరికాకు అత్యంత కీలకం. ప్రస్తుతం అమెరికా వద్ద ఇలాంటివి కేవలం 17 విమానాలు మాత్రమే ఉండగా, వాటిలో ఒకటి ధ్వంసం కావడం అమెరికాకు భారీ నష్టమని అంటున్నారు.

 ఈ దాడిలో కనీసం 10 మంది అమెరికా సైనికులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. కాగా  గాయపడిన అమెరికా సైనికుల సంఖ్య ఇంకా భారీగా ఉంటుందని తెలుస్తోంది.  కాగా ఈ ఘటనకు సంబంధించి అమెరికా ఇప్పటి వరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...