Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హర్మూజ్ జలసంధి ఓపెన్.. ఇరాన్ షరతులు.. అమెరికా ససేమిరా
posted on: Apr 28, 2026 9:45AM
.webp)
అమెరికాతో ఉద్రిక్తతలను తగ్గించి, శాంతి స్థాపన దిశగా ఇరాన్ ఒక కీలక అడుగు వేసింది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామనీ అయితే అందుకు తాము విధించే షరతులను అంగీకరించాలని పేర్కొంది. ఒమన్, పాకిస్థాన్ వంటి మధ్యవర్తిత్వ దేశాల ద్వారా ఇరాన్ ఈ ప్రతిపాదనలు చేసింది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి నేతృత్వంలో రూపొందించిన ఈ ప్రణాళికలో ప్రధానంగా , ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన కఠినమైన నౌకా దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయానీ, ఇరాన్ అణు కార్యక్రమంపై ప్రస్తుతం జరగాల్సిన చర్చలను వాయిదా వేయాలనీ తమ ఈ షరతులకు అంగీకరిస్తేనే హ ర్ముజ్ మార్గంలో నౌకల రాకపోకలకు అనుమతిస్తామని పేర్కొంది.
అయితే, ఈ షరతులకు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ససేమిరా అన్నట్లు తెలిసింది. ముఖ్యంగా అణు చర్చలను వాయిదా వేయాలన్న ప్రతిపాదనను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను తయారు చేయకూడదన్నదే తన ప్రధాన లక్ష్యమని, దీనిపై రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అణు చర్చలను పక్కన పెట్టి చేసే ఏ ఒప్పందమైనా నిష్ప్రయోజనమని ట్రంప్ అంటున్నారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం ఇరాన్ ప్రతిపాదనలపై అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని కట్టడి చేయకుండా ఎటువంటి ఒప్పందానికి తావులేదన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, ఈ షరతుల విషయంలో స్పష్టత రాకపోతే హార్ముజ్ జలసంధిపై ప్రతిష్టంభన మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది.
అదలా ఉండగా.. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకూ పెచ్చరిల్లుతూనే ఉన్నాయి. ఇరాన్‌కు చెందిన రెండు భారీ ఆయిల్ ట్యాంకర్లను అమెరికా దళాలు స్వాధీనం చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. అమెరికా చర్యను ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తూ, ఇది నడిసముద్రంలో జరిగిన సాయుధ దోపిడీ అని పేర్కొంది.
హిందూ మహాసముద్రం మీదుగా వెళ్తున్న మెజెస్టిక్ ఎక్స్, టిఫానీ అనే రెండు నౌకలను అమెరికా దళాలు అడ్డగించాయి. ఈ రెండు నౌకల్లో సుమారు 19 లక్షల బ్యారెళ్ల ఇరాన్ చమురు ఉన్నట్లు గుర్తించారు. అయితే.. ఈ స్వాధీనం పూర్తిగా చట్టబద్ధమని అమెరికా సమర్థించుకుంది. కోర్టు జారీ చేసిన వారెంట్ల ఆధారంగానే, అక్రమ చమురు నెట్‌వర్క్‌లను అడ్డుకోవడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ప్రతినిధి స్పష్టం చేశారు.
మరోవైపు ఇరాన్ విదేశాంగ శాఖ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని అమెరికాపై విరుచుకుపడింది. ఆపరేషన్ ఎకనామిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్‌పై గరిష్ట స్థాయిలో ఒత్తిడి పెంచాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఇప్పటికే ఇరాన్‌కు సహకరించే కంపెనీలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ తన అణ్వాయుధ తయారీ ప్రయత్నాలను విరమించుకుంటామని స్పష్టమైన హామీ ఇస్తేనే చర్చలకు తాము సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తేల్చి చెప్పారు.
ఈ పరిణామాల నేపథ్యంలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో భద్రతా పరమైన ముప్పు మరింత పెరిగింది. ప్రపంచ చమురు రవాణాకు ఆయువుపట్టుగా ఉన్న ఈ మార్గంలో మళ్లీ దిగ్బంధనాలు మొదలైతే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఇరు దేశాలు తమ పంతాలను వీడకపోవడంతో రానున్న రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.



.webp)


