యూఏఈపై ఇరాన్ దాడులు.. ముగ్గురు ఇండియన్స్ కు గాయాలు

posted on: May 5, 2026 8:57AM

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై ఇరాన్ డ్రోన్లతో విరుచుకు పడింది. . సోమవారం (మే 4) జరపిన డ్రోన్ దాడిలో  యూఏఈలోని వ్యూహాత్మక చమురు కేంద్రమైన ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రీస్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ముగ్గురు భారతీయ పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అధికారికంగా ఇరాన్, యూఏఈలు ధృవీకరించాయి. 

 డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు  గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం  స్పందించింది. గాయపడ్డ భారతీయులకు మెరుగైన వైద్య సేవలు అందేలా స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.  

మరోవైపు, ఇరాన్ మొత్తం నాలుగు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని యూఏఈ రక్షణ శాఖ తెలిపింది. వీటిలో మూడింటిని యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకోగా.. మరొకటి సముద్రంలో పడిపోయింది. అయితే, ఇదే సమయంలో జరిగిన డ్రోన్ దాడి మాత్రం ఫుజైరా ఆయిల్ జోన్‌ను తాకడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఫుజైరా సివిల్ డిఫెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి  తెచ్చాయి.

గల్ఫ్ ప్రాంతంలో చమురు ఎగుమతులకు ఫుజైరా అత్యంత కీలకమైన హబ్. హోర్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా చమురు రవాణా చేసే సామర్థ్యం దీనికి ఉండటంతోనే ఇరాన్  దీనిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ ఘటన  అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తించింది.  

యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. ఇది దేశ భద్రతపై జరిగిన దారుణమైన దాడిగా అభివర్ణించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇరాన్ చేస్తున్న ఈ దాడులు  అశాంతికి దారితీస్తాయని, దీనికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించింది. సమాధానం చెప్పే హక్కు తమకు ఉందని హెచ్చరించింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...