Latest News
మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం : సీఎం చంద్రబాబు
posted on: Mar 8, 2026 11:37AM
.webp)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, తల్లులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం నుంచి ప్రారంభమైన మహిళా సాధికారిత ప్రయాణం, ఈ రోజు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే స్థాయికి చేరిందన్నారు.
మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛన్లు వంటి పథకాలు అమల్లో ఉన్నాయని చెప్పారు.అలాగే మెగా డీఎస్సీ ద్వారా 7,955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, 993 మంది మహిళలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ అమలు చేస్తున్నామని వెల్లడించారు.
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 5 లక్షల మంది మహిళా ఎంట్రప్రెన్యూర్లను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు లక్ష మంది మహిళలను మైక్రో, ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దామని చెప్పారు. మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, కేంద్ర ప్రభుత్వంతో కలిసి సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణకు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మహిళల అభ్యున్నతి, భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
మహిళా సాధికారతలో మరిన్ని విజయాలు సాధించేందుకు అందరి సహకారం కావాలని కోరుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. జన్మనిచ్చిన అమ్మ నుంచి జీవితాంతం మనలను కంటికి రెప్పలా కాచే ప్రతి మాతృమూర్తికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగింటి ఆడపడుచులకు తన తాత అన్నగా నిలిచి ఆస్తి హక్కు కల్పించారని, తన తండ్రి మహిళా సాధికారత కోసం స్వయంసహాయక సంఘాలను ప్రారంభించారని గుర్తుచేశారు.






