విశాఖలో 50 దేశాలు...70 యుద్ద నౌకలు
posted on: Feb 15, 2026 3:43PM

విశాఖ సాగరతీరం విభిన్న నౌకలతో అలలారుతుంది. కొత్త కాంతులను వెదజల్లుతుంది. ఒకటి కాదు,రెండు కాదు... 70కి పైగా యుద్ధ నౌకలు, ధవళ వస్త్రాలతో నేవీ సిబ్బంది చేసే విన్యాసాలతొ పది రోజుల పాటు సాగరతీరంలో ఆదివారం (15-2-26) నుంచి పది రోజుల పాటు సందడి నెలకొననుంది. భారత నౌకాదళం అరుదుగా నిర్వహించే ‘అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష’ (ఐఎఫ్‌ఆర్)కు విశాఖపట్నం మరోసారి వేదికగా మారింది.
దేశంలో ఇప్పటిదాకా రెండుసార్లు ‘ఐఎఫ్‌ఆర్’ నిర్వహించగా మొదట ముంబైలో (2001), పదేళ్ల క్రితం విశాఖలో (2016) జరిగింది. దశాబ్దం తరువాత తిరిగి (2026) విశాఖనే ఎంపిక చేయడం విశేషం. ఈ ఉత్సవానికి 50 దేశాల నుంచి నాలుగు వేల మంది అతిథులు, 70కి పైగా యుద్ధనౌకలు వస్తున్నాయి. ఇదేకాకుండా రెండేళ్లకొకసారి భారత నౌకాదళం నిర్వహించే ‘మల్టీ లేటరల్ నేవల్ ఎక్సర్‌సైజెస్ (మిలాన్)’ కూడా ఈసారి విశాఖలోనే నిర్వహిస్తున్నారు.
ఇందులో భారతదేశంతో స్నేహసంబంధాలు కలిగిన దేశాలన్నీ పాల్గొంటాయి. ఈ రెండింటితో సరిపెట్టకుండా ముచ్చటగా మూడో కార్యక్రమం ‘ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం’ అదనపు ఆకర్షణ. హిందూ మహా సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలన్నీ ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ నేటి (ఫిబ్రవరి 15) నుంచి మొదలై 25వ తేదీ వరకూ కొనసాగుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పది రోజులు విశాఖ ధవళ వస్త్రధారులతో ధగధగా మెరిసిపోనుంది.


.webp)



