గుంటూరు వైసీపీలో చిచ్చు.. ఏసురత్నం ఎవరో తెలుసా?

రీసెంట్ గా వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పార్టీ సమన్వయకర్తగా 'ఏసురత్నం' ను నియమించింది. అయితే అసలు ఈ ఏసురత్నం ఎవరు? అంటూ ఓ వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఆరా తీస్తుండగా.. టీడీపీ మాత్రం సంబరాలు చేసుకుంటుంది. మరి ఇంతకీ ఈ ఏసురత్నం ఎవరో తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. ఒకప్పుడు చంద్రబాబు అభిమాని అయిన అధికారిగా ఏసురత్నంకు పేరుంది. ఆయన పదవీ విరమణ సమయంలో సచివాలయంలో ఎస్‌పిఎఫ్‌శాఖలో పనిచేస్తూ ముఖ్యభద్రతాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు టీడీపీ నాయకులు, మంత్రులు చాలా మంది తెలుసు. టీడీపీ అధికారం కోల్పోయిన తరువాత ఏసురత్నానికి ప్రమోషన్‌ వచ్చి బదిలీలో వెళ్లారు. తరువాత ఆయన అక్రమంగా ఆస్తులు కూడేసుకున్నారని ఏసీబీ కేసులు పెట్టింది. ఇదంతా తనపై కావాలని కుట్ర చేసి దాడులు చేశారని.. తాను ఏ విధంగా అక్రమాస్తులు కూడబెట్టానో చెప్పాలని ఆయన అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని కలసి గోడు వెల్లబోసుకోవడంతో ఆయన కనికరించి ఆశీర్వదించారు.

 

 

ఆ తరువాత ఏసురత్నం ఎక్కడ పనిచేశారో తెలీదు కానీ.. కట్ చేస్తే తాజాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వైసీపీ సమన్వయకర్తగా ఎంట్రీ ఇచ్చారు. మరి జగన్‌ ఎలా ఆకర్షించారో?.. ఎంత ముట్టచెప్పారో? కానీ గుంటూరు సమన్వయకర్త పదవిని పొందారు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళిత క్రిష్టియన్‌ అయిన ఏసురత్నాన్ని గుంటూరు-2లో ఎలా నియమించారు?. టీడీపీకి బలమైన మద్దతు ఉన్న ఈ నియోజకవర్గంలో ఏసురత్నం టీడీపీ అభ్యర్థిని ఎదుర్కోగలరా? కోట్ల రూపాయలు ముఖ్యమా? టీడీపీని  ఓడించడం ముఖ్యమా? దీని వెనుక ఏమేమి జరిగుంటుందో అనేదానిపై వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా అప్పిరెడ్డి తప్ప వేరే ఎవరినీ గెలిపించమని వైసీపీ నేతలు చెబుతున్నారు.


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీని వెనుక ఉన్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయలు ఉన్నాయని ఏసు రత్నాన్ని అభ్యర్థిగా నియమించారా? అప్పిరెడ్డిని కాదని ఏసురత్నాన్ని ఎవరికి కోసం నియమించారు? ఎందుకోసం నియమించారు? విధేయులైన కార్యకర్తలు జగన్‌కు అక్కర్లేదా?.. ఒకవేళ కన్నాను గెలిపించాలని ఏసురత్నాన్ని దింపినా.. తాము కన్నాను అయినా ఏసురత్నాని అయినా ఓడిస్తామని.. తాము అప్పిరెడ్డిని ఇండిపెండెంట్‌గా బరిలోకి దించుతామని.. స్వార్థం కోసం పార్టీని బలి చేయడాన్ని సహించమని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఏసురత్నమేమిటి? ఆయన వైసీపీ అభ్యర్థి ఏమిటి? ఇదంతా కలగా ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబుకు వీరవిధేయుడైన ఏసురత్నం.. వైఎస్‌ చేసిన సహాయం వల్ల వైకాపాలో చేరారా? లేక జగన్‌ కు ముడుపులు ముట్టచెప్పి ఆయన పార్టీలో చేరారా? ఈ విషయంలో మధ్యవర్తుల ఎవరు? అంటూ పోలీసు అధికారులు కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నారు.

ఏది ఏమైనా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వేణుగోపాల్‌రెడ్డికి టిక్కెట్‌ ఇవ్వరని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీలోలో ఈ రకమైన ముసలం ఏర్పడడంతో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏసురత్నం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే.. టీడీపీ మెజార్టీ ఎంత? అనేదానిపైనే ఎన్నికలు ఉంటాయని టీడీపీ నాయకులు అంటున్నారు. స్థానిక నేతలను బలిపశువులను చేయడం జగన్‌ కు ప్యాషన్‌గా మారిందని.. ఏమిటిది? అని పార్టీకి చెందిన నేతలు కూడా తప్పుపడుతున్నారు. మాజీ పోలీసు అధికారి ఏసురత్నం వైసీపీలో చేరి సమన్వయకర్తగా నియమింపబడి సంచలనం సృష్టించి స్థానిక నేతలకు నిద్రలేకుండా చేస్తున్నారు. చూద్దాం మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఏమవుతుందో.