Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దేశానికి తెలంగాణ మహిళలు ఆదర్శం : సీఎం రేవంత్
posted on: May 25, 2026 7:23PM

2034 నాటికి తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. “మహిళ ఆర్థికంగా బలపడితే కుటుంబం బలపడుతుంది.. కుటుంబం బలపడితే గ్రామం అభివృద్ధి చెందుతుంది.. గ్రామం అభివృద్ధి చెందితే తెలంగాణ మరింత శక్తివంతమవుతుంది” అని సీఎం పేర్కొన్నారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ.60,472 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించిందని, వడ్డీ లేని రుణాల కోసం ఇప్పటికే రూ.1,390 కోట్లను చెల్లించిందని సీఎం వెల్లడించారు. ఇకపై మహిళా సంఘాలు చిన్నచిన్న ఉపాధి కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా భారీ వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టాలని పిలుపునిచ్చారు. రైస్ మిల్లులు, మండల స్థాయి గోదాములు, లాజిస్టిక్ పార్కులు నిర్మించుకోవాలని సూచించారు.
అవసరమైతే 100 ఎకరాల వరకు భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ధాన్యం కొనుగోలు, నిల్వ, మిల్లింగ్ వ్యవస్థలో మహిళా సంఘాల పాత్రను పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. మహిళా సంఘాలే నేరుగా వడ్లు కొనుగోలు చేసి బియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేసే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. మహిళల చేతుల్లో ఈ వ్యవస్థ ఉంటే పారదర్శకత, బాధ్యత మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో కార్పొరేట్ స్థాయిలో “మహిళా శక్తి సూపర్ బజార్లు” ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. డీమార్ట్, బిగ్‌బజార్‌లకు పోటీగా ఉండేలా అత్యాధునిక సూపర్ మార్కెట్లు ప్రారంభించాలని చెప్పారు. పట్టణాల్లో వీటి కోసం తక్కువ ధరకు స్థలాలను లీజుకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతుల ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం, వినియోగదారులకు నాణ్యమైన సరుకులు అందించడం, మహిళా సంఘాలకు ఆదాయం పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సూపర్ బజార్లలో భాగస్వామ్యం అవుతుందని తెలిపారు.
సోమవారం సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న 8 వేల ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఇది చారిత్రాత్మక అడుగని సీఎం పేర్కొన్నారు. ఒకే రోజు, ఒకే సమయంలో 8 వేల భవనాలకు శంకుస్థాపన చేయడం దేశంలోనే సంచలన నిర్ణయమని తెలిపారు. మహిళా సంఘాలకు సొంత భవనాలు అంటే కేవలం సమావేశాల స్థలం కాదని, వారి ఆర్థిక కార్యకలాపాలు, శిక్షణ, వ్యాపార ప్రణాళికలకు శాశ్వత వేదిక అని వివరించారు.
తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టే దిశగా ముందుకు సాగుతోందన్నారు. మహిళా సంక్షేమంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సీఎం చెప్పారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేశామని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఈ పథకం కోసం ఆర్టీసీకి రూ.10 వేల కోట్ల వరకు చెల్లించామని తెలిపారు. ఈ పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు జరిగినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని విమర్శించారు.
మహిళలను బస్సుల యజమానులుగా మార్చే లక్ష్యంతో మహిళా సంఘాల ద్వారా 1000 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ప్రణాళికను అమలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. ఇందులో భాగంగా జూన్ 5న పరేడ్ గ్రౌండ్స్‌లో 553 బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. సోలార్ ఎనర్జీ రంగంలో కూడా మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నామని సీఎం చెప్పారు. 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసే ప్రణాళిక అమలులో ఉందన్నారు. అలాగే జిల్లా కేంద్రాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు జిల్లాల మహిళా సమాఖ్యలతో సీఎం మాట్లాడారు. నారాయణపేట మహిళా సమాఖ్య సభ్యులు పెట్రోల్ బంక్ ద్వారా రూ.27 లక్షల వరకు ఆదాయం పొందామని చెప్పగా సీఎం వారిని అభినందించారు. కొన్ని మహిళా సంఘాలు నెలకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాయని తెలిపారు. నిర్మల్ జిల్లా మహిళా సంఘాలు బ్యాంకు రుణాలను వందశాతం చెల్లించడంపై సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు.
పెద్ద వ్యాపారులు వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన ఉదాహరణలు ఉన్నాయని, కానీ మహిళా సంఘాలు నిజాయితీగా రుణాలను తిరిగి చెల్లిస్తూ ఆర్థిక క్రమశిక్షణలో ఆదర్శంగా నిలుస్తున్నాయని సీఎం అన్నారు.
ఈ సందర్భంగా చిలకపచ్చ రంగులో రూపొందించిన కొత్త ఇందిరమ్మ చీరల నాలుగు డిజైన్లను కూడా సీఎం ఆవిష్కరించారు. గతంలో చీరల నాణ్యతపై విమర్శలు వచ్చాయని గుర్తుచేసిన సీఎం.. ఇప్పుడు ఇందిరమ్మ చీరలు మహిళలను మరింత ఆకర్షణీయంగా నిలబెడుతున్నాయని అన్నారు. త్వరలో పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ చీరలను పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






