Latest News

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కొట్టివేత.. ఏపీ సీఎం చంద్రబాబుకు క్లీన్ చిట్

posted on: Apr 1, 2026 11:07AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చకు దారితీసిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు మంగళవారం (మార్చి 31) కొట్టివేసింది. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్, మంత్రి నారాయణలపై  అభియోగాలను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.  ఐఆర్ఆర్ అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని సీఐడీ సమర్పించిన క్లోజర్ రిపోర్ట్‌ను న్యాయస్థానం అధికారికంగా ఆమోదించింది.

జగన్ హయాంలో  అప్పటి మంగళగిరి  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు తెరపైకి వచ్చింది.  2014-19 మధ్యకాలంలో రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి, తమకు అనుకూలమైన వారికి లబ్ధి చేకూర్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ, చంద్రబాబును ప్రధాన నిందితుడిగా చేరుస్తూ అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

అయితే..  రాష్ట్రంలో  జగన్ అధికారం కోల్పోయి.. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత  ఈ కేసు దర్యాప్తులో కొత్త మలుపు చోటు చేసుకుంది. గతంలో జరిగిన విచారణ  సరళిని సమీక్షించిన సీఐడీ అధికారులు.. ఆ ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు లభించలేదని నిర్ధారించారు. దీంతో ఈ కేసును  మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్  కింద పరిగణించి  మూసివేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో  ఫైనల్ క్లోజర్ రిపోర్ట్  దాఖలు చేశారు.

సీఐడీ సమర్పించిన నివేదికను సవాల్ చేస్తూ ఫిర్యాదుదారుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రొటెస్ట్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను విచారించిన ఏసీబీ కోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం    సీఐడీ దర్యాప్తు నివేదికతో ఏకీభవిస్తూ, చంద్రబాబు సహా ఇతరులపై ఉన్న కేసులను  కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.  

గతంలో కూడా ఈ కేసు విషయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పలుమార్లు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిం చారు. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని, కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయనకు చుక్కుదురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా  ఏసీబీ కోర్టు ఐఆర్ఆర్ కేసు కోట్టివేసింది.   ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేవని ఈ తీర్పుతో స్పష్టమైందని న్యాయ నిపుణులు అంటున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...