పారిశ్రామిక ప్రగతిపథంలో ఆంధ్రప్రదేశ్!

posted on: Jul 7, 2014 1:31PM

 

గడచిన ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నారు. తాము తీసుకున్న నిర్ణయం ద్వారా తమను తామే అభివృద్ధి పథం వైపు నడిపించుకుంటున్నారు. ఆ నిర్ణయమే తెలుగుదేశం పార్టీకి అధికారం అప్పగించడం, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడం అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా వుంది. రాష్ట్రాన్ని పునాదుల నుంచి పునర్నిర్మించుకోవాల్సిన పరిస్థితి వుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి సమర్థమైన నాయకత్వం చాలా అవసరం. ఆ అవసరాన్ని గుర్తించే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడికి నాయకత్వం అప్పగించి తమ విజ్ఞతను చాటుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజలు చూపించిన విజ్ఞతకు తగిన ప్రతిఫలం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దేశ పారిశ్రామిక రంగం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అభివృద్ధే ఏకైన నినాదంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన చంద్రబాబు నాయుడు దార్శనికత మీద దేశ వ్యాప్తంగా సదభిప్రాయం వుంది. ఆ సదభిప్రాయమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ని పారిశ్రామికంగా అగ్రస్థానంలో నిలిపే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. దేశంలోనే అగ్రగాములుగా వున్న పలు కార్పొరేట్ సంస్థలు, మల్టీ నేషనల్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో తమ పరిశ్రమలను విస్తరించడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ ఆంధ్రప్రదేశ్‌లో తన పరిశ్రమలను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి చంద్రబాబుతో సూత్రప్రాయంగా చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. శ్రమించే తత్వం వున్న ప్రజలున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు, సమర్థవంతంగా వాటి నిర్వహణకు పూర్తి అనుకూలమైన రాష్ట్రమన్న అభిప్రాయం దేశ పారిశ్రామిక వర్గాలలో ఇప్పటికే ఏర్పడింది. దానితోపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండటం కూడా రాష్ట్రానికి ఒక వరంగా మారింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఏడాది తిరిగేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా కళ్ళు చెదిరే అభివృద్ధి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...