Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇండియా, యూఏఈ వ్యూహాత్మక ఇంధన రక్షణ ఒప్పందాలు.. హెర్మూజ్ సంక్షోభానికి చెక్!
posted on: May 18, 2026 3:30PM

పశ్చిమ ఆసియా ప్రాంతంలో రోజురోజుకూ మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయ చమురు రవాణా మార్గాలపై వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో భారతదేశం తన ఇంధన భద్రతను మరింత పటిష్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఈఏ)తో కలిసి సరికొత్త వ్యూహాత్మక ఇంధన, రక్షణ కారిడార్ దిశగా అడుగులు వేసింది. కేవలం సాధారణ వ్యాపార లావాదేవీలకే పరిమితం కాకుండా.. ఇరు దేశాల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా అత్యున్నత స్థాయి కూటమిగా ఈ భాగస్వామ్యం రూపాంతరం చెందుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలి అబుదాబి పర్యటన ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను సరికొత్త మైలురాయికి చేర్చింది. మౌలిక సదుపాయాలు, బ్యాంకింగ్, సముద్రయాన ప్రాజెక్టుల అభివృద్ధి కోసం యూఏఈ ఏకంగా 5 బిలియన్ డాలర్లు అంటే 41 వేల కోట్ల రూపాయల బృహత్తర పెట్టుబడిని ప్రకటించడం అంతర్జాతీయ వ్యాపార, రక్షణ రంగాలలో విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి పరిధిలో తరచుగా తలెత్తే ఉద్రిక్తతలు, ఇరాన్ ఆధిపత్య ధోరణుల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడే ఇంధన కొరతను అధిగమించడానికి యూఏఈ ఒక వినూత్న ప్రణాళికను సిద్ధం చేసింది. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్నాక్) తన ఫుజైరా పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. వచ్చే సంవత్సరం నాటికి హోర్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ముడి చమురు ఎగుమతి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలన్నది యూఏఈ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యూహాత్మక పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో సంక్షోభాలు తలెత్తినప్పటికీ, భారతదేశం వంటి మిత్రదేశాలకు ఎటువంటి ఆటంకాలు లేని చమురు సరఫరాను నిరంతరం కొనసాగించే వీలు కలుగుతుంది. భారతదేశ అత్యవసర ఇంధన అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల (ఎస్ పీఆర్) సామర్థ్యాన్ని పెంచడంలో అడ్నాక్ సంస్థ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. నూతన అంతర్జాతీయ ఇంధన దౌత్యంలో భాగంగాఇండియాలోని వివిధ భూగర్భ నిల్వ కేంద్రాలలో తన ముడి చమురు నిల్వలను 30 మిలియన్ బ్యారెళ్ల వరకు విస్తరించేందుకు అడ్నాక్ అంగీకరించింది.
దేశంలోని కీలక తీరప్రాంత కేంద్రాలైన మంగళూరు, విశాఖపట్నంతో పాటు ఒడిశాలోని చండికోల్‌లో ఉన్న భూగర్భ చమురు నిల్వ సౌకర్యాలలో ఈ నిల్వలను భద్రపరుస్తారు. అదే సమయంలో, అంతర్జాతీయ వ్యూహంలో భాగంగా యూఏఈ పరిధిలోని ఫుజైరాలో అందుబాటులో ఉన్న ముడి చమురు నిల్వ కేంద్రాలను సైతం అవసరమైనప్పుడు వినియోగించుకునే అవకాశాలను ఇండియా పరిశీలిస్తోంది. ఈ ద్వైపాక్షిక సహకారం కేవలం ముడి చమురు రంగానికే పరిమితం కాకుండా మల్టీ-ఎనర్జీ కారిడార్‌గా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ), లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పీజీ) నిల్వల పంపిణీకి కూడా ఇరు దేశాలు చేతులు కలిపాయి. ముఖ్యంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అడ్నాక్ మధ్య కుదిరిన దీర్ఘకాలిక ఎల్‌పీజీ సరఫరా ఒప్పందాలు ఇండియాలో గృహాల ఇంధన అవసరాలకు, మార్కెట్ స్థిరత్వానికి గట్టి భరోసాను కల్పిస్తున్నాయి. ప్రపంచ చమురు మార్కెట్‌లో అనిశ్చితి, ధరల హెచ్చుతగ్గులు నెలకొన్న కష్టసమయాల్లో ఇటువంటి భారీ వ్యూహాత్మక నిల్వలు ఇండియాకు రక్షణ కవచంగా మారుతాయి.
అంతర్జాతీయ సరఫరాలో తలెత్తే ప్రమాదాలను కనిష్ట స్థాయికి తగ్గించడం ద్వారా దేశీయ మార్కెట్‌లో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ఈ ఇంధన కారిడార్ ఎంతగానో దోహదపడనుంది. మరోవైపు, గుజరాత్ తీరప్రాంతం ఇండియా సముద్రయాన, ఇంధన ఆశయాలకు ప్రధాన ముఖద్వారంగా మారుతోంది. పశ్చిమ తీరంలో లాజిస్టిక్స్ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో గుజరాత్‌లోని వడినార్‌లో అంతర్జాతీయ స్థాయి నౌకా మరమ్మతు క్లస్టర్ ఏర్పాటుకు భారత్, యూఏఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. 1,570 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో సాగుతున్న ఈ ప్రాజెక్ట్ వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగినది. వడినార్ భౌగోళికంగా లోతైన సముద్ర ప్రదేశం కావడం వల్ల, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ వాణిజ్య నౌకలను సైతం సులభంగా నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ముంద్రా, కండ్లా వంటి ప్రధాన అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు సమీపంలో ఉండటం దీనికి అదనపు బలంగా మారింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే విదేశీ నౌకా మరమ్మతు కేంద్రాలపై భారతదేశం ఆధారపడటం భారీగా తగ్గుతుంది.
ఆర్థిక, ఇంధన రంగాలతో పాటు భారత్-యూఏఈ కూటమి అత్యంత సున్నితమైన రక్షణ, భద్రతా రంగాలలోకి సైతం ప్రవేశించింది. గతంలో కేవలం సంప్రదాయ సైనిక శిక్షణకు మాత్రమే పరిమితమైన ఇరు దేశాల బంధం, ఇప్పుడు అధునాతన సాంకేతికత, ఉమ్మడి రక్షణ పరికరాల తయారీ దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా నౌకాదళ భద్రత, డ్రోన్ సాంకేతికత, సైబర్ సెక్యూరిటీ, రక్షణ ఉత్పత్తుల తయారీ రంగాలపై ఇరు దేశాలు ప్రత్యేక దృష్టి సారించాయి. అంతర్జాతీయ చమురు వాణిజ్య మార్గాల పరిరక్షణే ధ్యేయంగా అరేబియా సముద్రం, హిందూ మహాసముద్ర పరిధిలో ఇరు దేశాల నౌకాదళాలు ఉమ్మడి సైనిక విన్యాసాల ద్వారా కార్యకలాపాల సమన్వయాన్ని పెంచుకుంటున్నాయి. భారతదేశపు రక్షణ రంగ స్వయంసమృద్ధి దార్శనికతకు మద్దతుగా, మేక్ ఇన్ ఇండియా కింద గల్ఫ్ దేశాల పెట్టుబడులను ఆకర్షించడంలో యూఏఈ అగ్రగామిగా నిలుస్తోంది. కేవలం సైనిక విన్యాసాలకే పరిమితం కాకుండా ఉగ్రవాద నిరోధక చర్యలు, రహస్య నిఘా సమాచార మార్పిడి అంటే ఇంటెలిజెన్స్ షేరింగ్ లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం మునుపెన్నడూ లేనంతగా బలపడింది. పశ్చిమ ఆసియాలో భౌగోళిక రాజకీయ చదరంగం వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో, ఇండియా, యూఏఈల మధ్య కుదిరిన ఈ వ్యూహాత్మక ఇంధన-రక్షణ కారిడార్ అంతర్జాతీయ సమతుల్యతలో అత్యంత కీలక పాత్ర పోషించనుంది.
అడ్నాక్ అందించే 3 కోట్ల బ్యారెళ్ల చమురు నిల్వల తోడ్పాటు, గుజరాత్ వడినార్ రేవు సమూల అభివృద్ధి, 5 బిలియన్ డాలర్ల అబుదాబి పెట్టుబడులు నవ భారత ఆర్థిక, రక్షణ సార్వభౌమాధికారానికి పటిష్టమైన పునాది వేస్తున్నాయి. ఇది కేవలం రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక వాణిజ్యం మాత్రమే కాదు, భవిష్యత్ తరాల స్థిరత్వానికి మరియు ఇంధన భద్రతకు నిర్మించిన ఒక సురక్షితమైన రక్షణ కవచంగా నిలవబోతోంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






