Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మారుతున్న ఇండియన్ టెక్కీల అమెరికా డ్రీమ్?!
posted on: Apr 17, 2026 1:22PM

అమెరికన్ డ్రీమ్ మారుతోందా? భారతీయ టెక్ మేధస్సు గల్ఫ్ వైపు మళ్లుతున్నదా? అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. ఒకప్పుడు భారతీయులకు, ముఖ్యంగా ఐటీ నిపుణులకు అమెరికన్ డ్రీమ్ ఒక అద్భుతమైన లక్ష్యం. అమెరికాలో స్థిరపడటం, భారీ జీతం, గ్రీన్ కార్డ్ సంపాదించడం విజయానికి చిహ్నాలుగా భావించేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు ఈ ఆలోచనా ధోరణిలోనూ మార్పు వస్తున్నది. ఇటీవల చికాగోలో గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో మూడు లక్షల డాలర్ల ప్యాకేజీని వదులుకుని ఒక భారత మహిళా టెక్ నిపుణురాలు దుబాయ్‌కి తరలివెళ్లడం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. ఇది కేవలం ఆమె తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదని.. మారుతున్న గ్లోబల్ టెక్ ట్రెండ్ కు అద్దం పడుతోందని నిపుణులు అంటున్నారు.
హెచ్-1బీ వీసా ఒక బంగారు పంజరంగా మారింది. అమెరికాలో పనిచేస్తున్న ఐటీ నిపుణులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య హెచ్-1బీ వీసా నిబంధనలు. చాలా మంది దీనిని ఒక గోల్డెన్ కేజ్ అంటే బంగారు పంజరంగా అభివర్ణిస్తున్నారు. భారీ జీతాలు అందుతున్నప్పటికీ, ఈ వీసా వల్ల స్వేచ్ఛ కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్-1బీ నిబంధనల ప్రకారం ఉద్యోగులు కేవలం ఒకే కంపెనీకి పరిమితం కావాల్సి ఉంటుంది. అదనపు ఆదాయ వనరుల కోసం సైడ్ బిజినెస్‌లు చేసే అవకాశం ఉండదు. దీనివల్ల సంపద సృష్టించే మార్గాలు మూసుకుపోతున్నాయి. ఇదే విషయాన్ని అమెరికాలో భారీ వేతనంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని గల్ఫ్ కు తరలిపోయిన మహిళ వెల్లడించారు. లేఆఫ్స్ భయం.. నిరంతర ఆందోళనల మధ్య గడిచిన రెండేళ్లలో అమెరికన్ టెక్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. సుమారు 3 లక్షలకు పైగా ఉద్యోగాలలో కోత విధించగా, అందులో అధిక శాతం హెచ్-1బీ వీసాదారులే ఉన్నారు. ఈ వీసా నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన వారు కేవలం 60 రోజుల్లోపు మరో స్పాన్సర్‌ను వెతుక్కోవాలి, లేదంటే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నిరంతర అభద్రతా భావం వల్ల కెరీర్ రిస్క్ కాస్తా ఇమిగ్రేషన్ రిస్క్‌గా మారుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
డబ్బు కంటే కూడా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలనే కోరిక భారతీయ యువతలో పెరుగుతోంది. అమెరికాలో ఉంటే దూర ప్రాంత ప్రయాణాలు, వీసా పరిమితులు, టైమ్ జోన్ వ్యత్యాసాల వల్ల ఇండియాలోని కుటుంబ సభ్యులను కలుసుకోవడం కష్టతరంగా మారుతోంది. చికాగో వంటి నగరాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నామనే భావన మనసులో ఒక రకమైన ఖాళీని నింపుతోందని చాలా మంది ఎన్నారైలు భావిస్తున్నారు.
దుబాయ్ ఎందుకు ఆకర్షణీయంగా మారుతోందంటే.. ?
ఇండియన్ టెకీలు తమ తదుపరి గమ్యస్థానంగా గల్ఫ్ ను ఎంచుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఇండియా నుంచి కేవలం 3-4 గంటల ప్రయాణంతో చేరుకోగలిగే భౌగోళిక వెసులుబాటుతో పాటు యూఏఈలో ఆదాయపు పన్ను లేకపోవడం, ఇతర వ్యాపారాలు చేసుకునే స్వేచ్ఛ ఉండటం నిపుణులను ఆకర్షిస్తోంది. అమెరికాతో పోలిస్తే జీతం కొంత తక్కువైనా, మెరుగైన జీవనశైలి, కుటుంబానికి దగ్గరగా ఉండే అవకాశం లభిస్తుండటంతో దీనిని ఒక ' టర్ ఈక్వేషన్, ఆప్షన్ గా వారు చూస్తున్నారు.
మారుతున్న కంపెనీల వ్యూహాలు.. జెన్ జీ ఆలోచనలు
కేవలం ఉద్యోగులే కాదు, టెక్ కంపెనీలు కూడా తమ కార్యకలాపాలను కేవలం సిలికాన్ వ్యాలీకే పరిమితం చేయకుండా ఇండియా, గల్ఫ్ దేశాలకు తరలిస్తున్నాయి. గత ఏడాది కాలంలోనే సుమారు 32,000 హైస్కిల్డ్ ఉద్యోగాలు అమెరికా నుంచి భారత్‌కు మారడం గమనార్హం. మరోవైపు కొత్త తరం (జెన్ జీZ) నిపుణులు కూడా కేవలం బిగ్ టెక్ సంస్థల్లో పనిచేయడమే జీవిత లక్ష్యంగా భావించడం లేదు. వారు రిమోట్ వర్క్, స్టార్టప్స్ అలాగే వ్యక్తిగత స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
నిర్వచనం మారుతున్న అమెరికా డ్రీమ్
మొత్తానికి అమెరికన్ డ్రీమ్ అనేది పూర్తిగా కనుమరుగు కాలేదు కానీ, దాని నిర్వచనం మారుతోంది. ఒకప్పుడు అది కేవలం ఒక దేశానికి, ఒక పాస్‌పోర్ట్‌కు పరిమితమైన కల. కానీ నేటి నిపుణులకు ఎక్కడైతే కెరీర్, కుటుంబం, స్వేచ్ఛ మధ్య సమతుల్యత లభిస్తుందో అదే నిజమైన డ్రీమ్. ఈ క్రమంలో కొందరు హైదరాబాద్, బెంగళూరు వైపు చూస్తుంటే, మరికొందరు దుబాయ్ వంటి నగరాలను ఎంచుకుంటున్నారు. మన జీవితంపై మనకు నియంత్రణ ఉండాలనేది నేటి యువత ప్రధాన నినాదంగా కనిపిస్తోంది.
- సీతారాం కంఠమనేని






