మీరు ప్రౌడ్ ఇండియనైతే... మీకు ఇస్రో ఏం చేయబోతోందో తెలియాల్సిందే!
posted on Feb 8, 2017 4:17PM
.jpg)
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్... షార్ట్ గా చెప్పుకుంటే... ఇస్రో! ఈ పేరు మనందరికీ తెలిసిందే. కాని, త్వరలో ఇస్రో శాస్త్రవేత్తలు తలపెట్టిన చారిత్రక ప్రయోగం గురించి మీకు తెలుసా? ఒకటి రెండు కాదు.. ఏకంగా వందకు మించి ఉపగ్రహాల్ని ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు! అంటే ఇండియన్ సైంటిస్టులు సాటిలైట్స్ సెంచరీ కొట్టనున్నారన్నమాట!
ఇస్రో ఫిబ్రవరీ 15, 2017న పీఎస్ఎల్వీ సీ 37 రాకెట్ తో ఒకేసారి 104 ఉపగ్రహాల్ని భూమికి 500కిలో మీటర్ల ఎత్తున కక్ష్యలో ప్రవేశపెట్టనుంది! 104 సాటిలైట్స్ లో కేవలం 3 మాత్రమే మన దేశానివి! 88 అమెరికాకు చెందినవి! మిగతావి ఇజ్రాయిల్, కజకిస్తాన్, నెదర్లాండ్స్, యూఏఈ లాంటి దేశాలవి!. ఇస్రో చేస్తోన్న సాహసం విజయవంతం అయితే ప్రపంచంలోనే ఇన్ని ఉపగ్రహాలు ఒకేసారి లాంచ్ చేసిన దేశం మనదే అవుతుంది! అమెరికా 29, రష్యా 37 సాటిలైట్స్ లాంచ్ చేయగలిగాయి. గత సంవత్సరం ఇస్రోనే 20 ఉప గ్రహాలు కక్ష్యలో ప్రవేశపెట్టి సత్తా చాటింది!
ఇప్పటి వరకూ ఇస్రో పీఎస్ఎల్వీ రాకెట్ల సాయంతో 39సార్లు ప్రయోగాలు చేసింది. అందులో 37సార్లు మనం విజయవంతం అయ్యాం. ఒకసారి పూర్తిగా విఫలం కాగా మరొకసారి పాక్షిక విజయం మాత్రమే దక్కింది. అంటే, ఇస్రో చేసిన పీఎస్ఎల్వీ లాంచింగ్స్ 97శాతం సక్సెస్ అయ్యాయన్నమాట! పీఎస్ఎల్వీ సాయంతోనే మన శాస్త్రవేత్తలు చంద్రయాన్, మంగళ్ యాన్ ప్రయోగాలు కూడా చారిత్రకంగా విజయవంతం చేశారు! త్వరలో మన శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న వంద ఉపగ్రహాలు కూడా విజయవంతంగా కక్ష్యలోకి చేరుకోవాలని కోరుకుందాం!