టెక్సాస్ సామాజిక, ఆర్థిక విప్లవం వెనుక భారతీయ మూలాలు!

posted on: May 8, 2026 4:33PM

అమెరికాలోని టెక్సాస్   అంటే ఒకప్పుడు  చమురు బావులు, విశాలమైన పశువుల క్షేత్రాలు (రాంచోలు),  సంప్రదాయ శ్వేతజాతీయుల ఆధిపత్యమే గుర్తుకు వచ్చేది. కానీ గడిచిన మూడు నాలుగు దశాబ్దాలుగా అక్కడ ఒక నిశ్శబ్ద సామాజిక, ఆర్థిక విప్లవం చాపకింద నీరులా విస్తరించింది. ఈ మార్పుకు ప్రధాన కారణం భారతీయ మూలాల ఉన్న కుటుంబాలు. ఎలాంటి ఆర్భాటం లేకుండానే హోటళ్లు, రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్, బ్యాంకింగ్ వంటి కీలక రంగాలను తమ గుప్పిట్లోకి తీసుకుంటూ టెక్సాస్ ఆర్థిక వ్యవస్థను భారతీయులు కొత్త దిశలో నడిపిస్తున్నారు.

 భారతీయ కుటుంబాల ఈ ఎదుగుదల ఒక ప్రత్యేకమైన  ఇండియన్ మోడల్ ఆధారంగా సాగుతోంది. వలస వెళ్లడం, కమ్యూనిటీ ఫైనాన్సింగ్ ద్వారా నిధులు సమీకరించుకోవడం, వచ్చిన లాభాలను తిరిగి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టడం,  సామాజిక సేవకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు ఇందులో ప్రధానంగా కనిపిస్తాయి. 

ఒకప్పుడు చిన్నపాటి వ్యాపారాలుగా మొదలైన ఇవి, నేడు మల్టీ-బిలియన్ డాలర్ల విలువైన వ్యవస్థలుగా రూపాంతరం చెందాయి. కేవలం సంపద సృష్టించడమే కాకుండా.. హంగర్ మిటావో  వంటి ఉద్యమాల ద్వారా అసవా వంటి కుటుంబాలు ఆకలి నిర్మూలనకు లక్షలాది డాలర్లను విరాళంగా ఇస్తూ సమాజంలో ఒక కొత్త నైతిక విలువలను నెలకొల్పుతున్నాయి.  హాస్పిటాలిటీ రంగంలో భారతీయుల ప్రస్థానం అసాధారణమైనది.

1970లలో ఒక చిన్న గదిలో అమెరికా జీవితాన్ని ప్రారంభించిన చాన్ పటేల్  నేడు..   స్టేట్ బ్యాంక్ ఆఫ్ టెక్సాస్ ద్వారా వందలాది మంది భారతీయ పారిశ్రామికవేత్తలకు వెన్నుముకగా నిలిచారు. ప్రధాన బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరించిన సమయంలో..  ఇమ్మిగ్రెంట్ వ్యాపారులకు ఈ బ్యాంక్ అండగా నిలిచింది.  అదే విధంగా.. అమెరికాలోని   40 శాతం హోటళ్లు ప్రస్తుతం గుజరాతీ పటేల్ కుటుంబాల యాజమాన్యంలో ఉన్నాయి. నష్టాల్లో ఉన్న మోటెల్స్ కొనుగోలు చేసి, కుటుంబ సభ్యులే స్వయంగా శ్రమించి, వాటిని లాభాల్లోకి తీసుకురావడం వీరి ప్రత్యేకత.  రియల్ ఎస్టేట్,  ఇన్వెస్ట్‌మెంట్ రంగాల్లోనూ మనవారు సత్తా చాటుతున్నారు. స్వప్నిల్ అగర్వాల్ నేతృత్వంలోని నిత్యా క్యాపిటల్, ఒక చిన్న రిస్క్ తో మొదలై నేడు పాతిక వేలకు పైగా అపార్ట్‌మెంట్ యూనిట్లను నిర్వహిస్తోంది. కేవలం వ్యాపార లావాదేవీలకే పరిమితం కాకుండా..  శ్రామిక వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపై వీరు దృష్టి సారిస్తున్నారు. మరోవైపు..  డాక్టర్ కిరణ్ పటేల్ వంటి వారు అమెరికన్ హెల్త్ కేర్ వ్యవస్థలోని లోపాలను అవకాశాలుగా మార్చుకుని..  భారీ ఆసుపత్రి నెట్‌వర్క్‌లను నిర్మించి విజయం సాధించారు.  టెక్నాలజీ,  ఏవియేషన్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన వ్యక్తులు టెక్సాస్ గడ్డపైనే ఎదిగారు. విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ ద్వారా బ్రియన్ శేఠ్ సాఫ్ట్‌వేర్ రంగంలో తనదైన ముద్ర వేయగా, జయ చౌదరి స్థాపించిన 'Zscaler' క్లౌడ్ సైబర్ సెక్యూరిటీలో ప్రపంచ స్థాయి లీడర్‌గా ఎదిగింది. అలాగే టెక్సాస్‌లో ఏవియేషన్ అనుభవం గడించిన రాకేష్ గంగ్వాల్, భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ అయిన  ఇండిగో ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు.  

ఈ కుటుంబాల విజయాల వెనుక ఒక సాధారణ సూత్రం ఉంది. నిర్లక్ష్యానికి గురైన వ్యాపారాలను గుర్తించడం..  క్రమశిక్షణతో వాటిని అభివృద్ధి చేయడం, సమాజంతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం. టెక్సాస్ ఆర్థిక వ్యవస్థలో ఎవరు కీలకం అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు పాత చమురు రాజవంశాల నుంచి భారతీయ మూలాల వైపు నెమ్మదిగా మారుతోంది. ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారు, ఎవరు రుణాలు ఇస్తున్నారు, వైద్య సేవలు ఎలా అందుతున్నాయి అన్న ప్రతి అంశంలోనూ నేడు భారతీయుల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది.  భవిష్యత్తులో టెక్సాస్ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో ఈ భారతీయ కుటుంబాల పాత్ర మరింత పెరగనుంది. ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన  ఈ సామ్రాజ్యాలు మరింత మంది కొత్త పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిస్తూ, అమెరికాలోని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. కేవలం సంపద సృష్టికర్తలుగా మాత్రమే కాకుండా, విద్య, వైద్యం,  సామాజిక రంగాల్లో వీరు చేస్తున్న కృషి టెక్సాస్ సమాజాన్ని సమూలంగా మార్చే దిశగా సాగుతోంది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చితే https://www.teluguone.com ను ఫాలో అవ్వండి. షేర్ చేయండి. మీ అభిప్రాయాలను తెలియజేయండి.

google-ad-img
    Related Sigment News
    • Loading...