ఇండియన్ రైల్వే భద్రతా విప్లవం.!

posted on: Aug 2, 2026 12:07PM

దేశంలో కోట్లాది  మంది  నిత్య ప్రయాణ సాధనంగా, వ్యాపార రవాణాకు ప్రధాన మార్గంగా వెలుగొందుతున్న ఇండియన్  రైల్వే వ్యవస్థలో ప్రయాణికుల భద్రత అత్యంత కీలక అంశంగా నిలుస్తోంది. సరుకు రవాణాతో పాటు,  ప్యాసింజర్ సేవల నిర్వహణలో సురక్షితమైన ప్రయాణాన్ని అందించడం అధికారులకు ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ఈ క్రమంలో పార్లమెంట్ వేదికగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టిన గణాంకాలు రైల్వే వ్యవస్థ సాధించిన ప్రగతిని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. గత పుష్కర కాలంలో ప్రాణనష్టానికి, తీవ్ర ఆస్తి నష్టానికి దారితీసే ప్యాసింజర్ రైలు ప్రమాదాలు   88 శాతం తగ్గడం ఒక ప్రధాన మైలురాయి.

ఇది కేవలం సాధారణ గణాంకాల మార్పు మాత్రమే కాదు..  రైల్వే శాఖ చేపట్టిన సాంకేతిక సంస్కరణలు, నూతన విధానాలు, మౌలిక వసతుల కల్పనలో వచ్చిన విప్లవాత్మక మార్పుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  2014కు పూర్వం దేశంలో రైల్వే వ్యవస్థ విస్తృతంగా ఉన్నప్పటికీ, భద్రత,  మౌలిక వసతుల నిర్వహణలో  లోపాలు ప్రస్ఫుటంగా కనిపించేవి. పాతబడిపోయిన పట్టాలు, సాంకేతిక పరిజ్ఞానం లేని సిగ్నలింగ్ పరికరాలు, కాపలా లేని రైల్వే గేట్లు ప్రమాదాలకు నిలయంగా మారేవి.  ఆ కాలంలో బ్రాడ్ గేజ్ మార్గాల్లో మానవరహిత లెవెల్ క్రాసింగ్‌ల వద్ద తరచూ   ప్రమాదాలు చోటుచేసుకునేవి. అలాగే పాత ఐసీఎఫ్ కోచ్‌ల వాడకం వల్ల ప్రమాదం జరిగినప్పుడు బోగీలు ఒకదానిపైకి ఒకటి ఎక్కి.. భారీ మరణాలకు కారణమయ్యేది. 

ట్రాక్ మార్పిడి పనులు, వంతెనల తనిఖీలు,  పరిశుభ్రత వంటి అంశాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండేవి కావు. పరిమిత సాంకేతిక పరిజ్ఞానం వల్ల మానవ తప్పిదాల శాతం ఎక్కువగా ఉండి భద్రతకు   విఘాతం కలిగేది.  కవచ్ పరిజ్ఞానంతో మారిన భద్రతా ప్రమాణాలు గత దశాబ్ద కాలంలో భారతీయ రైల్వేలు సాంకేతికంగా సరికొత్త రూపు రేకలను సంతరించుకున్నాయి. రైళ్లు  ఢీకొనడాన్ని అడ్డుకునేందుకు దేశీయంగా రూపొందించిన  కవచ్ 4.0,  ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ పరిజ్ఞానం ఈ దిశలో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. విదేశీ పరిజ్ఞానంతో సమానంగా, మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసిన ఈ వ్యవస్థను ఇప్పటికే 2 వేల 490 రూట్ కిలోమీటర్ల మేర విజయవంతంగా అమర్చగా.. , మరో 21 వేల 937 రూట్ కిలోమీటర్ల పరిధిలో విస్తరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి.

ఈ వ్యవస్థ ద్వారా సుమారు 7వేల 435 లోకోమోటివ్‌లు, ఎన్నెండొందల  ఈఎంయూ/ఎంఈఎంయూ  రైళ్లలో భద్రతా పరికరాలను అమరుస్తున్నారు. అలాగే 6 వేల 671 స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ విధానాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సిగ్నలింగ్ లోపాలు,  డ్రైవర్ల మానవ తప్పిదాల వల్ల జరిగే అవాంఛనీయ ఘటనలను  పూర్తి స్థాయిలో అరికట్టగలుగుతున్నారు.  ట్రాక్ నిర్వహణ,  రైలు మార్గాల భద్రతలోనూ ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. బ్రాడ్ గేజ్ పరిధిలో ఉన్న కాపలా లేని ప్రమాదకర లెవెల్ క్రాసింగ్‌లను పూర్తిగా తొలగించడం ద్వారా పెద్ద ప్రమాదాల శాతం తగ్గింది. పట్టాల పునరుద్ధరణ, వెల్డింగ్ నాణ్యత పెంపు, ఆధునిక యంత్రాలతో ట్రాక్ తనిఖీలు చేపట్టడం వల్ల జాయింట్ల వద్ద ఏర్పడే లోపాలు గణనీయంగా తగ్గాయి.

ప్రయాణికుల రక్షణ కోసం పాత బోగీల స్థానంలో ప్రమాద నిరోధక ఎల్‌హెచ్‌బీ (ఎల్హెచ్ బీ) కోచ్‌లను విస్తృతంగా ప్రవేశపెట్టారు.  2014కు ముందు కేవలం 38 శాతంగా ఉన్న నెట్‌వర్క్ ఎలక్ట్రిఫికేషన్ ఇప్పుడు 99.9శాతానికి తానికి చేరుకోవడంతో రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెరగడమే కాక, పర్యావరణ కాలుష్యం కూడా గణనీయంగా తగ్గింది.  అధునాతన మౌలిక వసతులు,  డిజిటల్ రైల్వే  వ్యవస్థ ఆధునికీకరణలో భాగంగా ప్రయాణికుల సేవల కోసం ప్రవేశపెట్టిన వందే భారత్ సెమీ, హైస్పీడ్ రైళ్లు, స్టేషన్ల పునర్నిర్మాణ కార్యక్రమాలు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. 

ప్లాట్‌ఫారమ్‌లపై ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఆధునిక యంత్రాల ద్వారా నిర్వహించే పారిశుద్ధ్య  చర్యలు స్టేషన్ల స్థాయిని పెంచాయి. డిజిటలైజేషన్‌లో భాగంగా ఆన్‌లైన్ టికెట్ లు, లైవ్ రైల్ ఇన్ఫర్మేషన్,   ఆన్‌బోర్డ్ క్లీనింగ్ సేవలు వంటి అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పులు భద్రతకే పరిమితం కాకుండా ప్రయాణ వేగాన్ని, విశ్వసనీయతను కూడా పెంచాయి.  భారత రైల్వే భద్రతా పద్ధతులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించేందుకు ఆర్డీఎస్‌ఓ, క్షేత్రస్థాయి అధికారులపై జవాబుదారీతనం పెరిగింది. ప్రతి ప్రాజెక్టులోనూ సెక్యూరిటీ ఆడిట్‌లను తప్పనిసరి చేయడం వల్ల సాంకేతిక లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి సరిదిద్దే వ్యవస్థ రూపుదిద్దుకుంది.

 సామాజిక, రాజకీయ చర్చలు,  సవాళ్లు

రైల్వే అభివృద్ధికి సంబంధించి సమాజంలోనూ, మీడియా వర్గాల్లోనూ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మౌలిక వసతుల విస్తరణ, కవచ్ ప్రాజెక్ట్, వందే భారత్ రైళ్లు,  స్టేషన్ల ఆధునికీకరణను సానుకూల దృక్పథంతో చూసే వర్గాలు ఉన్నప్పటికీ.. కొన్ని సవాళ్లు ఇంకా మిగిలే ఉన్నాయంటున్నారు విమర్శకులు.  దేశవ్యాప్తంగా కవచ్ వ్యవస్థను వంద శాతం అమలు చేయడానికి పట్టే సమయం..  ప్రధాన ప్రాజెక్టులలో జరిగే ఆలస్యం, రీ డెవలప్‌మెంట్ ఖర్చులు పెరగడం వంటి అంశాలపై విశ్లేషణలు సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఇంకా మెరుగుపడాల్సిన సాంకేతిక అంశాలను గుర్తించి సరిదిద్దాల్సిన అవసరం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది.  ప్రమాదాలు 88 శాతం తగ్గడం అనేది కేవలం ఒక గణాంకం మాత్రమే కాక, రైల్వే వ్యవస్థలో ఏర్పడిన 'భద్రతా సంస్కృతి'కి సంకేతం. రాబోయే రోజుల్లో కవచ్ పరిజ్ఞానాన్ని దేశవ్యాప్తంగా 100 శాతం అమలు చేయడం, కృత్రిమ మేధ   ఆధారిత ముందస్తు తనిఖీ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడం, డ్రోన్ల ద్వారా ట్రాక్ నిఘా నిర్వహించడం వంటి అధునాతన విధానాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణ రక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్న భారతీయ రైల్వేలు, ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన మరియు వేగవంతమైన రవాణా వ్యవస్థగా ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నాయి. 

- సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.  

Indian Railways Safety revolution, Kavach System, Ashwini Vaishnaw, Lok Sabha, Railway Accidents Reduction,  Vande Bharat, Electrification 

google-ad-img
    Related Sigment News
    • Loading...