Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి జైలు...ఎందుకంటే?
posted on: Feb 13, 2026 7:01PM

పక్కింటి వారితో మనస్పర్థలు రావడం సహజమే.. కానీ ఆ కోపం హద్దులు దాటి ఇతర మతాల విశ్వాసాలను దెబ్బతీస్తే సహించేది లేదని సింగపూర్ కోర్టు స్పష్టం చేసింది. సింగపూర్‌లో నివసిస్తున్న ఓ భారత సంతతి వ్యక్తి.. దీపావళి పండుగ రోజున పక్కింటి వారితో జరిగిన చిన్న గొడవతో.. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించాడు. ముఖ్యంగా వారి వరండాలో పంది మాంసం చల్లి వారిని ఇబ్బందికి గురి చేశాడు.
దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆపై ఈ కేసు న్యాయస్థానానికి వెళ్లగా.. అతడి తప్పును తీవ్రంగా పరిగణించిన కోర్టు.. అతడికి 14 వారాల జైలుశిక్ష విధించింది. ముఖ్యంగా గొడవను మతపరమైన అంశంగా మార్చడం, ఇతర మతాల విశ్వాసాలను అవమానించడం వంటివి చేయడం అతడిని చిక్కుల్లోకి నెట్టింది.
భారత దేశానికి చెందిన 36 ఏళ్ల విక్నేశ్వరన్ వి మోగనవల్ సింగపూర్‌లో నివసిస్తున్నాడు. అతని ఇంటి పక్కన నివసించే వారు వేరే మతానికి చెందిన వారు. వారి పిల్లలు తరచూ వరండాలో ఆడుకుంటూ అల్లరి చేస్తున్నారని, దానివల్ల తనకు ఇబ్బంది కలుగుతోందని విక్నేశ్వరన్ పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. అయితే గతేడాది దీపావళి పండుగ రోజున ఈ గొడవ మరింత ఎక్కువైంది. ముఖ్యంగా పండుగ పూట పిల్లల అల్లరి వల్ల తన ఇంట్లో వేడుకకు ఆటంకం ఏర్పడిందని అతను తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.
దీపావళి రోజున పొరుగువారిపై కక్ష పెంచుకున్న విక్నేశ్వరన్.. వారి మత విశ్వాసాలను కించపరిచేలా వ్యవహరించాడు. ఆ మతంలో నిషిద్ధంగా భావించే పంది మాంసాన్ని ఉద్దేశపూర్వకంగా తీసుకువచ్చి.. వారి ఇంటి వరండాలో చల్లాడు. ఇది చూసిన పొరుగువారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో కూడా అతను దురుసుగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా వారిని కూడా దూషించాడు. దీంతో పోలీసులు విక్నేశ్వరన్‌ను అరెస్ట్ చేశారు.
ప్రాథమిక విచారణ అనంతరం అతని మానసిక స్థితిని పరిశీలించడానికి కొంతకాలం మానసిక చికిత్స కేంద్రంలో కూడా ఉంచారు. ఇటీవల ఈ కేసు విచారణకు రాగా.. విక్నేశ్వరన్ తన తప్పును అంగీకరించి కోర్టుకు క్షమాపణలు చెప్పాడు. అయితే మత సామరస్యం దెబ్బతినేలా ప్రవర్తించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడాన్ని సింగపూర్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. నిందితుడికి 14 వారాల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పును ఇచ్చారు.






