Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వ్యూహాత్మక భాగస్వామి నుంచి వ్యూహాత్మక ప్రత్యర్థి వరకూ.. భారత్-అమెరికా బంధంలో కొత్త అధ్యాయం.!
posted on: Jul 20, 2026 10:08AM

ఇండియా, అమెరికా మధ్య కొనసాగుతున్న సంబంధాలు తీవ్రమైన మార్పులకు లోనవుతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఆసియా ప్రాంతంలో చైనా విస్తరణను అడ్డుకోవడానికి భారత్‌ను ఒక బలమైన ప్రజాస్వామ్య శక్తిగా అమెరికా ప్రోత్సహిస్తూ వచ్చింది. అయితే.. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే వాషింగ్టన్ తన పాత వ్యూహాలను మార్చుకుని, భారత్‌ను కేవలం ఒక భాగస్వామిగానే కాకుండా భవిష్యత్తులో తన ఆర్థిక, సాంకేతిక ఆధిపత్యానికి సవాలు విసిరే సామర్థ్యం ఉన్న ప్రత్యర్థిగా చూడటం ప్రారంభించింది. ఈ విధానపరమైన మార్పు కేవలం విశ్లేషణలకే పరిమితం కాకుండా వాషింగ్టన్ తీసుకుంటున్న నిర్ణయాలు, సుంకాల విధింపులు, దౌత్య వేత్తల ప్రకటనలలో స్పష్టంగా కనిపిస్తోంది. శీతల యుద్ధ కాలంలో భారత్, అమెరికాల మధ్య తీవ్రస్థాయి అనుమానాలు, దౌత్యపరమైన దూరం ఉండేవి. ఆ సమయంలో భారత్ అలీన విధానాన్ని అవలంబిస్తూ నాటి సోవియట్ యూనియన్‌కు దగ్గరగా ఉండగా, అమెరికా పాకిస్తాన్‌తో మైత్రిని పెంచుకుంది. 1971 నాటి పరిస్థితులు, 1974లో భారతదేశం నిర్వహించిన అణు పరీక్షలు, ఆ తర్వాత విధించిన ఆంక్షలు ఇరు దేశాల సంబంధాలను మరింత క్లిష్టం చేశాయి.
1991 ఆర్థిక సంస్కరణల అనంతరం, ఇండిమా మార్కెట్ ప్రపంచ దేశాలకు తెరుచుకోవడం, చైనా ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వంటి అంశాలు వాషింగ్టన్ వైఖరిలో స్పష్టమైన మార్పు తెచ్చాయి. బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బరాక్ ఒబామా వంటి అమెరికా అధ్యక్షుల హయాంలో చారిత్రక ఇండో, యూఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్, కీలక రక్షణ ఒప్పందాలు, లాజిస్టిక్స్ మార్పిడి ఒప్పందాలు, క్వాడ్ రూపకల్పన వంటివి చోటుచేసుకున్నాయి. దీనితో ఇండో, పసిఫిక్ రీజియన్‌లో భారత్ ఒక కీలకమైన భాగస్వామిగా నిలిచింది.
2025 తరువాత అమెరికా రాజకీయాల్లో చోటుచేసుకున్న మార్పులతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు సంక్లిష్టంగా మారాయి. అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా ఇండియా ఎగుమతులపై సుంకాలను భారీగా పెంచడం, జీఎస్పీ, హోదా ఉపసంహరణ వంటి చర్యలు వాణిజ్య వాతావరణాన్ని ఒత్తిడికి గురిచేసాయి. 2026 ప్రారంభంలో కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం వల్ల కొంత ఉపశమనం లభించినప్పటికీ, అమెరికా నుండి అత్యధిక మొత్తంలో సరుకులను కొనుగోలు చేయాలనే నిబంధనలు భారత్‌పై అదనపు భారంగా మారాయి. 2026 మార్చిలో జరిగిన రైసినా డైలాగ్ సదస్సులో అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టఫర్ లాండౌ చేసిన వ్యాఖ్యలు ఈ వ్యూహాత్మక మార్పును సందేహాతీతంగా బహిర్గతం చేశాయి. చైనాతో రెండు దశాబ్దాల క్రితం చేసిన తప్పును భారత్ విషయంలో పునరావృతం చేయబోమని ఆయన పేర్కొనడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. భారత కంపెనీలు తమ మార్కెట్లలో ఎదిగి, అమెరికా సంస్థలకే పోటీగా మారే అవకాశాన్ని ఇవ్వబోమని ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
లాండౌ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ఘాటెగా స్పందించారు. ఒక దేశం ఎదుగుదల అనేది ఆ దేశ సొంత సామర్థ్యం, బలాల ఆధారంగా మాత్రమే నిర్ణయించబడుతుంది కానీ.. ఇతర దేశాలు చేసే తప్పుల వల్ల కాదన్న డాక్టర్ ఎస్. జైశంకర్ ఇండియా ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని, బాహ్య శక్తులు సాంకేతికతను, దా మార్కెట్ సదుపాయాలను నియంత్రించాలని చూసినప్పటికీ భారత్ తన అంతర్గత బలంతో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ అమెరికాకు భాగస్వాములు మాత్రమే కావాలని, రక్షణ కల్పించాల్సిన రక్షిత ప్రాంతాలు కాదనీ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇండో, పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావానికి అడ్డుకట్ట వేయడానికి భారత్ భాగస్వామ్యం అవసరమే అయినప్పటికీ.. ఇకపై రక్షణ భారాన్ని అమెరికా ఒక్కటే మోయదని, ప్రతి భాగస్వామ్య దేశం తమ రక్షణ బడ్జెట్‌ను, సొంత సైనిక సామర్థ్యాలను పెంచుకోవాలని సంకేతాలిచ్చారు.
దక్షిణ ఆసియా రాజకీయాల్లో ఉత్పన్నమవుతున్న కొత్త సవాలు
గత కొన్ని సంవత్సరాలుగా భారత్ సరిహద్దు ప్రాంతాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా ఇరు దేశాల దౌత్య సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ మార్పులు, మయన్మార్‌పై అమెరికా విధించిన ఆంక్షలు, అక్కడ పనిచేస్తున్న తిరుగుబాటు దళాలకు మద్దతు ఇవ్వడం, నేపాల్‌తో అమెరికా నేరుగా సంబంధాలను విస్తరించడం వంటి అంశాలు భారత దౌత్య వర్గాలలో కొంత ఆందోళన కలిగించాయి. ఈ నిర్ణయాలు భారత భద్రతా ప్రయోజనాలకు సవాలుగా మారుతున్నప్పటికీ.. అమెరికా తన సొంత వ్యూహాత్మక ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోంది. మరోవైపు, అంతరిక్ష పరిశోధనలు, కీలక ఖనిజాల ఒప్పందాలు, డిఫెన్స్ కో-ప్రొడక్షన్ వంటి రంగాలలో ద్వైపాక్షిక సహకారం కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్యపరమైన ఆంక్షలు, వీసా నిబంధనలు బంధంపై ప్రభావం చూపుతున్నాయి.
భవిష్యత్తు పరిణామాలు, భారత్ ముందున్న వ్యూహాత్మక మార్గాలు
భారత్ మరియు అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం భారీ స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ, భవిష్యత్తులో ఈ సంబంధం సంపూర్ణ మైత్రిగా కాకుండా భాగస్వామ్యం, పోటీ కలగలిసిన ఒక కొత్త నమూనాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐటీ, ఫార్మా, కృత్రిమ మేధస్సు, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు వంటి రంగాలలో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, అమెరికా రక్షణవాద విధానాలను తట్టుకుని నిలబడేలా సొంత పరిశ్రమలను బలోపేతం చేసుకోవడం భారత్‌కు అనివార్యంగా మారింది.
వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి
అమెరికాతో సంబంధాలను కొనసాగిస్తూనే, రష్యా, యూరోపియన్ యూనియన్, జపాన్, గల్ఫ్ దేశాలు, ఆసియాన్ కూటమితో సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడం ద్వారా భారత్ తన సమతుల్యతను కాపాడుకోవాల్సి ఉంటుంది. భారత్ కేవలం ఒక ప్రాంతీయ శక్తిగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కీలక నిర్ణేతగా ఎదుగుతున్న తరుణంలో, అమెరికా విధించే ఆంక్షలు, ఒత్తిళ్లకు లొంగకుండా తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ప్రస్తుత తరుణంలో భారత్-అమెరికా సంబంధాలలోని పాత అధ్యాయం ముగిసినప్పటికీ, భాగస్వామ్య అవసరం మాత్రం అలాగే ఉండిపోయింది. రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక సంబంధాలలో ఎదురయ్యే సవాళ్లను భారత్ ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటుందనే దానిపైనే ఇండో, పాసిఫిక్ ప్రాంతంలో భవిష్యత్ వ్యూహాత్మక సమీకరణలు ఆధారపడి ఉంటాయి.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.
india US relations, Donald Trump tariffs, Jaishankar, Indo Pacific strategy, India US trade deal






